Tarun Tejpal Rape Case Verdict
* తెహల్కా మాజీ ఎడిటర్ కేసులో సంచలన తీర్పు
* తరుణ్ తేజ్‌పాల్‌కు 10 ఏళ్ల జైలు.. 10 లక్షల జరిమానా
* ఎన్నో మలుపులు తిరిగిన అత్యాచార కేసు
* 13 ఏళ్ల తర్వాత మరోసారి చర్చనీయాంశం
ఆకేరు న్యూస్, హైదరాబాద్:
ఇన్వెస్టిగేషన్ జర్నలిజంలో సంచలనం నమోదు చేసిన తెహల్కా మాజీ ఎడిటర్ తరుణ్ తేజ్‌పాల్ అత్యాచార కేసులో తాజాగా గోవా ధర్మాసనం కీలక తీర్పు వెలువరించింది. 2021లో ఆయన నిర్దోషి అంటూ ట్రయల్ కోర్టు వెలువరించిన తీర్పును రద్దు చేసింది. సుదీర్ఘ వాదనలు విన్న హైకోర్టు దోషిగా తీర్పు వెలువరించింది. ఆయనకు 10 ఏళ్ల జైలు శిక్ష, 10 లక్షల రూపాయల జరిమానా విధించింది. ఆయన నాలుగు వారాల్లోగా లొంగిపోవాలని ఆదేశించింది.
* అసలు ఏం జరిగింది?
తెహల్కా పత్రిక మాజీ ఎడిటర్-ఇన్-చీఫ్ తరుణ్ తేజ్‌పాల్ పై 13 ఏళ్ల క్రితం అత్యాచారం కేసు నమోదైంది. 2013లో గోవాలోని ఒక ఫైవ్ స్టార్ హోటల్లో తెహల్కా సంస్థ ‘థింక్ ఫెస్ట్’ కార్యక్రమం నిర్వహించింది. ఆ కార్యక్రమానికి తరుణ్ తేజ్‌పాల్‌తో పాటు ఆ పత్రికలో పని చేసే ఒక జూనియర్ మహిళా జర్నలిస్ట్ కూడా హాజరయ్యారు. ఆ సమయంలో తనపై తరుణ్ తేజ్‌పాల్ లైంగిక దాడికి పాల్పడ్డారని ఆ మహిళా జర్నలిస్టు సంచలన ఆరోపణలు చేసింది. హోటల్ లిఫ్ట్‌లో తనపై అఘాయిత్యానికి పాల్పడ్డారని పేర్కొంది. అంతేకాకుండా, బాధితురాలు తెహల్కా అప్పటి మేనేజింగ్ ఎడిటర్ శోమా చౌదరికి లేఖ రాసింది. తనపై వచ్చిన ఆరోపణలపై స్పందించిన తరుణ్ తేజ్ పాల్ ఆరు నెలల పాటు బాధ్యతల నుంచి తప్పుకుంటున్నట్లు సంస్థకు ఈ-మెయిల్ ద్వారా సమాచారం ఇచ్చారు.
* ఫిర్యాదు చేయని బాధితురాలు కానీ..
బాధితురాలు తనపై జరిగిన లైంగిక దాడిపై పోలీసులకు నేరుగా ఫిర్యాదు చేయలేదు. సంస్థ అప్పటి మేనేజింగ్ ఎడిటర్ శోమా చౌదరికి మాత్రం ఆమె ఈ-మెయిల్ ద్వారా తనపై జరిగిన అఘాయిత్యంపై ఫిర్యాదు చేశారు. అనంతరం తరుణ్ తేజ్‌పాల్ రాజీనామా చేశారు. ఈ అంశాలన్నీ మీడియా ద్వారా లీకు అయ్యాయి. దీంతో ఈ ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర కలకలం సృష్టించింది. గోవా పోలీసులు రంగంలోకి దిగి 2013లో సుమోటో కేసు నమోదు చేశారు. తరుణ్ తేజ్పాల్పై లైంగిక దాడి (IPC 376) కింద ఎఫ్ ఐఆర్ ఫైల్ చేశారు. అనంతరం బాధితురాలిని సంప్రదించి, ఆమె వాంగ్మూలాన్ని మేజిస్ట్రేట్ ఎదుట సెక్షన్ 164 CRPC కింద అధికారికంగా రికార్డు చేశారు. అప్పటి నుంచీ కేసు విచారణ ప్రారంభమైంది.
* 2013 నవంబర్ 30న అరెస్ట్.. 2,800 పేజీల ఛార్జ్‌షీట్
తనపై లైంగిక దాడి కేసు నమోదైన వెంటనే మాజీ ఎడిటర్ కోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. కానీ న్యాయస్థానం తిరస్కరించింది. దీంతో 2013 నవంబర్ 30న ఆయనను గోవా క్రైమ్ బ్రాంచ్ పోలీసులు అరెస్ట్ చేశారు. 2014 ఫిబ్రవరిలో అతడిపై ఏకంగా దాదాపు 2,800 పేజీల ఛార్జ్‌షీట్‌ను కోర్టుకు సమర్పించారు. జూలై 2014లో సుప్రీంకోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. దీంతో ఆయన బెయిలుపై బయటకు వచ్చారు.
* సుదీర్ఘ విచారణ అనంతరం సంచలన తీర్పు
సుదీర్ఘ విచారణ అనంతరం 2021 మే 21న గోవాలోని మాపుసా సెషన్స్ కోర్టు తరుణ్ తేజ్పాల్ను నిర్దోషి అని ప్రకటిస్తూ తీర్పునిచ్చింది. అప్పట్లో అది సంచలనంగా మారింది. అదనపు సెషన్స్ జడ్జి క్షమా జోషి ఇచ్చిన ఈ తీర్పు వివాదాస్పదంగా మారింది.
* నిర్దోషిగా చెప్పేందుకు కోర్టు చెప్పిన కారణాలు
ఈ కేసులో వాదనలు విన్న తర్వాత లైంగిక దాడికి గురైన బాధితురాలు ప్రవర్తన తనకు అన్యాయం జరిగింది అనేట్లుగా లేదని, ప్రవర్తన సాధారణంగా ఉందని జడ్జి తన తీర్పులో పేర్కొన్నారు. ఈ ఘటన జరిగిన తర్వాత జరిగిన ఈవెంట్ ఫోటోలను పరిశీలిస్తే బాధితురాలు నవ్వుతూ, సాధారణంగా కనిపించిందని, ఆమె పంపిన వాట్సాప్ సందేశాలు ఆమె భయాందోళనకు గురైనట్లు చూపించడం లేదని కోర్టు అభిప్రాయపడింది. బాధితురాలి స్టేట్మెంట్లలోని కొన్ని అంశాలు పరస్పర విరుద్ధంగా ఉన్నాయని, అందువల్ల ఆరోపణలకు సరైన ఆధారం లేదని కోర్టు పేర్కొంది. దీంతో తరుణ్ తేజ్ పాల్‌ను నిర్దోషిగా ప్రకటిస్తూ 527 పేజీల తీర్పును నాటి న్యాయస్థానం ఇచ్చింది. దీంతో ఆయన నిర్దోషిగా విడుదల అయ్యారు.
* అప్పీలుకు వెళ్లిన గోవా ప్రభుత్వం
ట్రయల్ కోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ గోవా ప్రభుత్వం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ప్రభుత్వం తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదనలు వినిపించారు. తరుణ్ తేజ్ పాల్‌ను వెంటనే అరెస్టు చేయాలని, బాధితురాలికి తండ్రి వయసుతో ఉన్న అతడు ఇటువంటి ఘటనకు పాల్పడడం దారుణమని అన్నారు. ఆ మహిళా జర్నలిస్టు వద్దని వారించినా వినలేదని వాదించారు. ఒక అమ్మాయి వద్దు (No) అని చెబితే, దానికి వద్దు అనే అర్థం అని స్పష్టం చేశారు. సరైన తీర్పు ఇవ్వడం ద్వారా సమాజానికి గట్టి మెసేజ్ ను ఇవ్వాలని వాదించారు. ఆయన వాదనలతో ఏకీభవించిన గోవా హైకోర్టు తెహల్కా మాజీ ఎడిటర్ తరుణ్ తేజ్‌పాల్‌కు పదేళ్ల జైలు శిక్ష, పది లక్షల రూపాయల జరిమానా విధిస్తూ సంచలన తీర్పు వెలువరించింది. నాలుగు వారాల్లో లొంగిపోవాలని ఆదేశించింది. దాదాపు 13 ఏళ్ల తర్వాత ఆయనకు శిక్ష పడడం చర్చనీయాంశంగా మారింది.
* 13 ఏళ్లలో కేసు పరిణామక్రమం ఇలా..
08 – 11 – 2013 : తెహల్కా మాజీ ఎడిటర్ తరుణ్ తేజ్‌పాల్ పై లైంగికపైదాడి ఆరోపణలు
22 – 11 – 2013 : గోవా పోలీసులు సుమోటోగా కేసు నమోదు
30 – 11 – 2013 : బెయిల్ పిటిషన్ తిరస్కరణ – అరెస్టు
31 – 1 – 2014 : తరుణ్ తేజ్పాల్పై క్రైమ్ బ్రాంచ్ కొత్త కేసు నమోదు
17 – 2 – 2014 : క్రైమ్ బ్రాంచ్ చార్జ్ షీట్ దాఖలు
01 – 7 – 2014 : సుప్రీం కోర్టు బెయిలు మంజూరు
27 – 8 – 2014 : క్రైమ్ బ్రాంచ్ అనుబంధ చార్జ్ షీట్ దాఖలు
21 – 5 – 2021 : మాపుసా సెషన్స్ కోర్టు తేజ్పాల్ను నిర్దోషిగా ప్రకటన
23 – 4 – 2022 : హైకోర్టు కు గోవా ప్రభుత్వం
06- 08 -2026 : స్థానిక కోర్టు ఇచ్చిన తీర్పు రద్దు.. తరుణ్ తేజ్‌పాల్ దోషిగా హైకోర్టు తీర్పు
Please tell us what is wrong. Your report will be sent to the website team.
