* ఒకరి తర్వాత మరొకరు భేటీ
ఆకేరు న్యూస్ డెస్క్ : విభజన సమస్యల పరిష్కారంపై మరో రెండు రోజుల్లో సమావేశం కానున్న తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబునాయుడు (Chandrababu Naidu) , రేవంత్ రెడ్డి (Revanth Reddy) ఈరోజు ఢిల్లీలో ప్రధాన మంత్రి నరేంద్రమోదీతో సమావేశం అయ్యారు. ఒకరి తర్వాత మరొకరు ప్రధానితో భేటీ కావడం ఆసక్తిగా మారింది. తొలుత ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రధానిని కలిశారు. రాష్ట్రానికి రావాల్సిన నిధులు, ప్రాజెక్టులపై చర్చించారు. ప్రధానంగా పోలవరం ప్రాజెక్టు గురించి వీరి మధ్య చర్చ జరిగినట్లు తెలిసింది. ఏపీ పునర్ నిర్మాణం, కేంద్రం మద్దతు సహకారం ఎజెండాగా చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటన సాగుతోంది. అదే సమయంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కేంద్ర హోంమంత్రి అమిత్ షా (Amit Shah) తో సమావేశం అయ్యారు. అనంతరం ప్రధానమంత్రిని కలిశారు. సీఎంతో పాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, అధికారులు కూడా ప్రధాని, కేంద్ర హోంమంత్రితో జరిగే సమావేశంలో పాల్గొన్నారు. పెండింగ్ ప్రాజెక్టులతో పాటు రాష్ట్రానికి చెందిన పలు కీలక అంశాలను ప్రధాని, కేంద్ర హోంమంత్రి దృష్టికి సీఎం రేవంత్ రెడ్డి తీసుకెళ్లారు.
——————————-