* బీఆర్ఎస్లో మరో గుబులు
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : రేపు జరిగే గ్రేటర్ హైదరాబాద్ కౌన్సిల్ సమావేశంలో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించేందుకు జీహెచ్ ఎంసీ పరిధిలోని ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లతో బీఆర్ఎస్ (BRS) పార్టీ కార్యనిర్వాహక కార్యదర్శి కేటీఆర్ (KTR) ఈరోజు సమావేశం ఏర్పాటు చేశారు. అందరూ తప్పనిసరిగా హాజరుకావాలని బీఆర్ఎస్ అధిష్ఠానం ఆదేశించింది. అయితే ఈ సమావేశానికి ఆరుగురు ఎమ్మెల్యేలు హాజరుకాలేదని తెలిసింది. లక్ష్మారెడ్డి, మల్లారెడ్డి, వివేకానంద, కృష్ణారావు, రాజశేఖర్రెడ్డి సమావేశానికి హాజరుకాలేదు. మిగిలిన ఇద్దరు ఎమ్మెల్యేలు వివేకా, లక్ష్మారెడ్డిలు సమావేశానికి రాలేమని ముందస్తుగా సమాచారమిచ్చినట్లు తెలుస్తోంది. కేటీఆర్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో కొందరు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేటర్లు పాల్గొన్నారు. మీటింగ్కు మొత్తం 35మంది బీఆర్ఎస్ కార్పొరేటర్లు హాజరయ్యారు. రేపు జరిగే సమావేశంలో మేయర్, డిప్యూటీ మేయర్లపై అవిశ్వాసం పెట్టాలని సమావేశంలో నిర్ణయించినట్లు తెలిసింది. పార్టీ మారిన మేయర్, డిప్యూటీ మేయర్ తమ పదవుల నుంచి వైదొలకాలని కౌన్సిల్ మీటింగ్లో బీఆర్ఎస్ డిమాండ్ చేయనుంది. కౌన్సిల్ హాల్లో బైఠాయించి నిరసన తెలపాలని కార్పొరేటర్లు నిర్ణయం తీసుకున్నారు. కాగా, అధిష్ఠానం ఆదేశించినా ఎమ్మెల్యేలు సమావేశానికి రాకపోవడం పార్టీలో చర్చనీయాంశంగా మారింది. తాజా రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో గుబులు మొదలైంది.
—————————