* సాయంత్రం 6 గంటలకు ముఖ్యమంత్రుల సమావేశం
* హైదరాబాద్లోని ప్రజాభవన్ వేదిక
* కొన్ని సమస్యలకైనా పరిష్కారం లభిస్తుందనే ఆశ
* భేటీ అంశాలు కేంద్రం దృష్టికి
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణకు సంబంధించి కీలక సమావేశం నేడు జరగబోతోంది. హైదరాబాద్లోని ప్రజాభవన్లో (Praja Bhavan) ఏపీ సీఎం చంద్రబాబునాయుడు ( Chandrababu Naidu), టీజీ సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) సమావేశం కానున్నారు. సాయంత్రం 6 గంటలకు జరిగే ఈ భేటీలో పదేళ్లుగా రెండు రాష్ట్రాల మధ్య అపరిష్కృతంగా ఉన్న విభజన సమస్యలపై చర్చించనున్నారు. ఈభేటీ అనంతరం కొన్ని సమస్యలకైనా పరిష్కారం లభిస్తుందనే ఆశాభావంతో ఇరు రాష్ట్రాల ప్రజలూ, అధికారులు ఎదురుచూస్తున్నారు.
పదేళ్లుగా వీడని చిక్కులు
‘ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం-2014’లోని 9వ, 10వ షెడ్యూళ్లలోని ప్రభుత్వరంగ సంస్థలు, విద్యాసంస్థలు, అకాడమీలు, యూనివర్సిటీలపై సీఎంల భేటీలో చర్చకురానున్నాయి. షెడ్యూలు 9లో మొత్తం 91 సంస్థలు ఉండగా, వీటి ఆస్తులు, అప్పుల విభజనపై కేంద్ర ప్రభుత్వం షీలా భిడే కమిటీని నియమించింది. ఈ కమిటీ 89 సంస్థల ఆస్తులు, అప్పులను విభజిస్తూ సిఫారసు చేసింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ 89 సంస్థల విభజన సిఫారసులకు అంగీకరించింది. కానీ, తెలంగాణ మాత్రం వీటిలో 68 సంస్థల విభజన సిఫారసులను మాత్రమే ఒప్పుకొంటోంది. పదేళ్లుగా ఈ వ్యవహారం ఎటూతేలడం లేదు. రాష్ట్రావతరణ అనంతరం 2014 జూన్ 2వ తేదీ నుంచి 2017 జూన్ 10వ తేదీ వరకు ఏపీ జెన్కో నుంచి తీసుకున్న విద్యుత్తుకుగాను రూ.3441.78 కోట్లను సకాలంలో చెల్లించనందుకు ఆలస్య రుసుము సర్చార్జి కింద మరో రూ.3315.14 కోట్లు చెల్లించాలనేది ఏపీ వాదన. మొత్తం రూ.6756 కోట్లు చెల్లించాలంటోంది. అయితే.. ఏపీ నుంచే తమకు రూ.17,828 కోట్లు రావాల్సి ఉందని తెలంగాణ చెబుతోంది. ఏపీకి కట్టాల్సిన కరెంట్ బిల్లులు, ఆలస్య రుసుము సర్చార్జి మొత్తం కలిపి రూ.4887 కోట్లు మాత్రమే అవుతాయని, అవి పోను ఇంకా తమకు రూ.12,940 కోట్లు రావాల్సి ఉందని తెలంగాణ వాదిస్తోంది.
పదో షెడ్యూల్ లోనూ..
అలాగే.. పదో షెడ్యూల్లో 142 సంస్థలు ఉన్నాయి. వీటిలో తెలుగు అకాడమీ, తెలుగు యూనివర్సిటీ, అంబేద్కర్ యూనివర్సిటీ వంటి 30 సంస్థల పంపిణీపై రెండు రాష్ట్రాల మధ్య వివాదాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో వీటి పైనా చర్చించే అవకాశం ఉంది. ఇక విభజన సమస్యలపై ఇప్పటి వరకూ రెండు రాష్ట్రాల అధికారుల మధ్య 30 సమావేశాలు జరిగాయి. అయినా ఇప్పటివరకు పరిష్కార మార్గం దొరకలేదు. తాజా భేటీతో కొన్ని అంశాలకైనా పరిష్కారం లభిస్తుందనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. సమావేశంలో చర్చకు అంశాలు, పరిష్కారమార్గాలు, ఇద్దరి సీఎంల అభిప్రాయాలను భేటీ అనంతరం కేంద్రానికి పంపనున్నారు.
విలీన మండలాలకు విముక్తి కలిగేనా?
తెలంగాణలోని ఏడు మండలాలను విభజన అనంతరం ఏపీలో విలీనం చేశారు. అప్పుడు అలా చేస్తేనే నవ్యాంధ్రప్రదేశ్ తొలిముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తానని పట్టుబట్టడంతోనే కేంద్రం సమ్మతించిందని తాజాగా బాధ్యతలు చేపట్టిన అనంతరం చంద్రబాబు చెప్పుకొచ్చారు. ఆ మండలాలను ఏపీలో విలీనం చేయడం వల్లే పోలవరం ప్రాజెక్టు కట్టుకోగలుగుతున్నామని అన్నారు. అయితే.., ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రుల భేటీ నేపథ్యంలో ఆ మండలాలను తిరిగి తెలంగాణలో కలుపుకోవాలనే డిమాండ్ వెల్లువెత్తుతోంది. తెలంగాణ రాష్ట్రం ప్రధాన ఎజెండాగా విలీన మండలాల అంశాన్నేజోడించింది. మరి ఇందుకు ఏపీ సమ్మతిస్తుందా.. అనేది ఉత్కంఠగా మారింది.
———————————