HPV Vaccination for Girls
ఆకేరు న్యూస్, భీమదేవరపల్లి :
భీమదేవరపల్లి మండల పరిధిలోని కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయంలో మంగళవారం వంగర ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారుల పర్యవేక్షణలో హెచ్పీవీ టీకా పంపిణీ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. పెరిగిపోతున్న ఆరోగ్య సమస్యలను దృష్టిలో ఉంచుకుని బాలికల భవిష్యత్తును సురక్షితంగా మార్చేందుకు ప్రభుత్వం ఉచితంగా అందిస్తున్న ఈ టీకాల పంపిణీకి విద్యార్థినుల నుంచి మంచి స్పందన లభించింది. ఈ కార్యక్రమంలో భాగంగా 14 నుండి 15 సంవత్సరాల వయస్సు గల 14 మంది విద్యార్థినులకు హెచ్పీవీ టీకాలను విజయవంతంగా అందించారు. టీకా వేసే సమయంలో వైద్య సిబ్బంది బాలికలకు ధైర్యం చెబుతూ, దాని ప్రాముఖ్యతను వివరించారు.
ఈ సందర్భంగా వైద్యాధికారులు మాట్లాడుతూ మహిళల ఆరోగ్యానికి గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ పెద్ద సవాలుగా మారిందని, దీనిని నివారించడంలో హెచ్పీవీ టీకా అత్యంత కీలక పాత్ర పోషిస్తుందని స్పష్టం చేశారు. చిన్న వయస్సులోనే ఈ టీకా తీసుకోవడం వల్ల శరీరం వైరస్ను ఎదుర్కొనే రోగనిరోధక శక్తిని పెంపొందించుకుంటుందని, దీనివల్ల భవిష్యత్తులో వచ్చే క్యాన్సర్ ముప్పును సమర్థవంతంగా అడ్డుకోవచ్చని తెలిపారు. బాలికల ఆరోగ్యకరమైన భవిష్యత్తు కోసం ప్రతీ ఒక్కరూ హెచ్పీవీ టీకాలపై ఉన్న అపోహలను వీడి అవగాహన పెంచుకోవాలని కోరారు. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు పూనుకుని అర్హులైన బాలికలందరికీ తప్పకుండా ఈ టీకా వేయించాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో వైద్యాధికారులు డాక్టర్ రుబీనా, డాక్టర్ రెహమాన్, నర్సింగ్ అధికారులు కవిత, శౌర్య, సూపర్వైజర్ మోహన్, ఏఎన్ఎంలు లక్ష్మి, స్వరూప, పాఠశాల ప్రిన్సిపాల్ జ్యోతి, ఏఎన్ఎం కోమల, స్థానిక ఆశా కార్యకర్తలు మరియు కేజీబీవీ బోధనా సిబ్బంది పాల్గొన్నారు. టీకా పంపిణీని విజయవంతం చేసినందుకు పాఠశాల యాజమాన్యం వైద్య బృందానికి కృతజ్ఞతలు తెలిపింది.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
