MLA Kadiyam Srihari Minority Welfare
ఆకేరు న్యూస్, స్టేషన్ ఘన్ పూర్ :
మైనారిటీల సంక్షేమానికి ప్రభుత్వం పెద్ద పీట వేసిందని, కాంగ్రెస్ పార్టీ మత సమరస్యానికి, లౌకికవాదానికి కట్టుబడి పని చేస్తుందని స్థానిక ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. జనగామ జిల్లా స్టేషన్ ఘన్ పూర్ డివిజన్ కేంద్రంలో మంగళవారం ఇందిరా మహిళా శక్తి పథకంలో భాగంగా 100 శాతం సబ్సిడీతో మైనారిటీలకు కుట్టు మిషన్ల పంపిణి చేశారు.
అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ ఇందిరా మహిళా శక్తి పథకం కింద మైనారిటీ కార్పొరేషన్ ద్వారా నిరుపేద మైనారిటీ మహిళలకు స్వయం ఉపాధి కల్పించాలని శిక్షణ ఇచ్చి 100 శాతం సబ్సిడీతో కుట్టు మిషన్లను కాంగ్రెస్ ప్రభుత్వం అందిస్తోందని తెలిపారు. అందులో భాగంగా నియోజకవర్గంలోనే 100 మంది లబ్ధిదారులకు కుట్టు మిషన్లు పంపిణి చేయడం జరిగిందని అన్నారు. మైనారిటీ మహిళలు పూర్తి సబ్సిడీతో అందిస్తున్న ఈ కుట్టు మిషన్లను సద్వినియోగం చేసుకొని స్వయం ఉపాధి పొందాలని సూచించారు. రాబోయే రోజుల్లో పాఠశాల విద్యార్థుల యూనిఫామ్స్ కూడా మీకే వచ్చే విధంగా చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు.
కాంగ్రెస్ ప్రభుత్వం మైనారిటీల సంక్షేమానికి పెద్ద పీట చేస్తుందని తెలిపారు. విదేశాలకు వెళ్లి చదువుకునే మైనారిటీ విద్యార్థులకు ఓవర్సిస్ స్కాలర్షిప్ లు అందిస్తుందని తెలిపారు. పేద మైనారిటీ విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించేందుకు ప్రతీ నియోజకవర్గానికి ఒక మైనారిటీ బాలికల, బాలుర గురుకుల పాఠశాలలను ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. గురుకుల పాఠశాలలో ఆధునిక వసతులు, నాణ్యమైన విద్యను అందిస్తున్నట్లు వెల్లడించారు. అలాగే నిరుద్యోగ మైనారిటీ యువతకు ఉపాధి కల్పించేందుకు మైనారిటీ కార్పొరేషన్ ద్వారా 50 వేల వరకు 100 శాతం సబ్సిడీతో రుణాలు మరియు లక్ష రూపాయల నుండి 5 లక్షల వరకు బ్యాంక్ లింకేజి ద్వారా రుణాలు అందిస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వం అందిస్తున్న ఈ అవకాశాలను మైనారిటీ మహిళలు, నిరుద్యోగులు, విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. నియోజకవర్గ పరిధిలోని ఇల్లు లేని నిరుపేద మైనారిటీలకు ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయనున్నట్లు హామీ ఇచ్చారు. కేంద్రంలోని బీజేపీ పార్టీ మైనారిటీల పట్ల చిన్న చూపు చూస్తోందని కానీ కాంగ్రెస్ పార్టీ మైనారిటీలకు అండగా ఉంటుందని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ మత సమరస్యానికి, లౌకికవాదానికి కట్టుబడి పని చేస్తుందని స్పష్టం చేశారు.
హిందూ ముస్లింలు అందరూ సోదర భావంతో కలిసి మెలిసి ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మారుజోడు రాంబాబు, మున్సిపల్ చైర్మన్ తాటికొండ వినయ్ కుమార్, మార్కెట్ కమిటీ చైర్మన్ లావణ్య శిరీష్ రెడ్డి, మైనారిటీ కార్పొరేషన్ అధికారులు, వివిధ గ్రామాల సర్పంచులు, కౌన్సిలర్లు, ఇతర ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
