Hyderabad Adulterated Ghee
* హెచ్ ఫాస్ట్ దాడుల్లో వెలుగులోకి
* సుమారు 25.5 టన్నుల కల్తీ నెయ్యి స్వాధీనం
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : హైదరాబాద్‌లో భారీగా కల్తీ నెయ్యి వెలుగులోకి వచ్చింది. ఈరోజు పలు ప్రాంతాల్లో అధికారులు చేపట్టిన దాడుల్లో అధిక మొత్తంలో కల్తీ నెయ్యిని స్వాధీనం చేసుకున్నారు. నెయ్యి తయారీ, విక్రయ యూనిట్లపై హెచ్ ఫాస్ట్ చేసిన స్పెషల్ డ్రైవ్ లో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. సుమారు 25.5 టన్నుల కల్తీ నెయ్యిని స్వాధీనం చేసుకున్నారు.
* నగరవ్యాప్తంగా దాడులు
హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో హైదరాబాద్ ఫుడ్ అడల్టరేషన్ సర్వైలెన్స్ టీమ్, ఫుడ్ సేఫ్టీ అధికారులు ఈరోజు సంయుక్తంగా దాడులు నిర్వహించారు. కేపీహెచ్‌బీ, బాచుపల్లి, జీడిమెట్ల తదితర ప్రాంతాల్లో అధికారులు దాడులు నిర్వహించారు. నగరవ్యాప్తంగా 130 ప్రాసెస్ మరియు విక్రయ కేంద్రాలపై ఏకకాలంలో దాడులు చేసి, దాదాపు 36 టన్నుల పదార్థాలను సీజ్ చేశారు. సుమారు 25.5 టన్నుల కల్తీ నెయ్యి, 8.7 టన్నుల మీగడ, 1,200 లీటర్ల పామాయిల్, 600 లీటర్ల వనస్పతి (డాల్డా), 30 కేజీల స్టార్చ్, కృత్రిమ వాసన ఇచ్చే రసాయనాలు స్వాధీనం చేసుకున్నారు. మరో 10.5 టన్నుల ముడి పదార్థాల సీజ్ చేశారు. మొత్తం 36 టన్నుల కల్తీ నెయ్యి, ముడి పదార్థాల స్వాధీనం చేసుకున్నారు.
* నకిలీ నెయ్యి తయారీ ఇలా..
అధికారులదాడుల్లో కీలక విషయాలను గుర్తించారు. పామాయిల్, డాల్డా, పాల పొడి, స్టార్చ్, రసాయన సుగంధాలను కలిపి నెయ్యిలా తయారు చేస్తున్నారు. వంద శాతం స్వచ్ఛమైన నెయ్యి అనే నకిలీ లేబుళ్లతో మార్కెట్లో విక్రయిస్తున్నట్లు గుర్తించారు. ఈ సందర్భంగా సీపీ సజ్జనార్ మాట్లాడుతూ.. ప్రజల ఆరోగ్యంతో ఆడుకునే కల్తీ నిర్వాహకులపై కఠిన కేసులు నమోదు చేయడంతో పాటు పీడీ యాక్ట్ నమోదు చేస్తామన్నారు. కొనుగోలుదారులు FSSAI లైసెన్స్, తయారీ వివరాలు, సీల్ సరిగ్గా ఉన్న బ్రాండెడ్ ఉత్పత్తులను మాత్రమే కొనుగోలు చేయాలని సూచించారు. ఆహార కల్తీపై సమాచారం ఉంటే డయల్ 112 లేదా హెచ్ ఫాస్ట్, హెల్ప్‌లైన్ 8712661212 కు ఫిర్యాదు చేయవచ్చని, వివరాలు గోప్యంగా ఉంచుతామని తెలిపారు. హోటళ్లు, స్వీట్ షాపులు, కేటరింగ్ నిర్వాహకులు కేవలం అధికారిక లేదా ప్రామాణికమైన డిస్ట్రిబ్యూటర్ల నుంచే నెయ్యి కొనుగోలు చేయాలని సూచించారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
