Siddipet Car Accident
* కారు బావిలో పడి ఒకే కుటుంబానికి చెందిన నలుగురు బలి
ఆకేరు న్యూస్, సిద్ధిపేట :
సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం అప్పనపల్లి గ్రామ శివారులో ఆగస్టు 19, 2026 బుధవారం అర్ధరాత్రి దాటిన తర్వాత అత్యంత హృదయవిదారకమైన ప్రమాదం చోటుచేసుకుంది. అర్ధరాత్రి వేళ ప్రయాణిస్తున్న ఒక కుటుంబం ప్రమాదవశాత్తు కారుతో సహా రహదారి పక్కనే ఉన్న వ్యవసాయ బావిలో పడిపోవడంతో ఈ దారుణ సంఘటన జరిగింది. ఈ ప్రమాద వార్త గురువారం (ఆగస్టు 20, 2026) ఉదయం వెలుగులోకి వచ్చింది. నీటి బావికి ఎలాంటి రక్షణ గోడ లేకపోవడమే ఈ భారీ విషాదానికి ప్రధాన కారణమని స్థానికులు తెలిపారు.
*బంధువుల ఇంటికి వెళ్లొస్తుండగా ప్రమాదం
మృతులంతా దుబ్బాక మండలానికి చెందిన బలవంతాపూర్ గ్రామానికి చెందినవారుగా పోలీసులు ధ్రువీకరించారు. సిద్దిపేట పట్టణంలో నివాసముంటున్న తమ బంధువుల ఇంట్లో జరిగిన ఒక కర్మకాండ కార్యక్రమానికి హాజరయ్యేందుకు దండుగుల రాజు తన కుటుంబంతో కలిసి వెళ్లారు. కార్యక్రమం ముగించుకుని బుధవారం రాత్రి కారులో స్వగ్రామానికి తిరుగుప్రయాణమయ్యారు. ఈ క్రమంలో అప్పనపల్లి గ్రామ శివారుకు చేరుకోగానే చీకటిగా ఉండటంతో పాటు రహదారి పక్కనే రక్షణ గోడ లేని వ్యవసాయ బావిని డ్రైవింగ్ చేస్తున్న రాజు గమనించలేకపోయారు. దీంతో కారు అతివేగంగా అదుపుతప్పి నేరుగా లోతైన బావిలోకి దూసుకెళ్లి మునిగిపోయింది.
*చిన్నారులతో సహా ఒకే కుటుంబం మృతి
బావి నీటితో నిండి ఉండటంతో కారు పూర్తిగా మునిగిపోయి, లోపల ఉన్న నలుగురూ బయటకు రాలేకపోయారు. ఈ ప్రమాదంలో కారు నడుపుతున్న దండుగుల రాజు (30), ఆయన భార్య భాగ్య (25), వారి చిన్నారి పిల్లలు నిహాన్ష్ (4), శాన్విక (2) ఊపిరాడక అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.
*ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా వెలుగులోకి..
బుధవారం అర్ధరాత్రి దాటినా కుటుంబ సభ్యులు ఇంటికి చేరకపోవడంతో బంధువులు రాజు, భాగ్యల ఫోన్లకు వరుసగా కాల్స్ చేశారు. అయితే రెండు మొబైల్ ఫోన్లు స్విచ్ఛాఫ్ రావడంతో వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు బాధితుల మొబైల్ టవర్ సిగ్నల్స్ ఆధారంగా గాలింపు చర్యలు చేపట్టారు. అప్పనపల్లి రహదారి సమీపంలో చివరిగా సిగ్నల్ నిలిచిపోవడంతో ఆ ప్రాంతంలో వెతకగా, బావిలో మునిగి ఉన్న కారును పోలీసులు గుర్తించారు.
*బలవంతాపూర్, అప్పనపల్లి గ్రామాల్లో తీవ్ర విషాదం
సమాచారం అందుకున్న దుబ్బాక పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది గురువారం ఉదయాన్నే (ఆగస్టు 20) ఘటనా స్థలానికి చేరుకుని జేసీబీ, క్రేన్ల సహాయంతో బావిలో నుంచి కారును బయటకు తీశారు. వెలికితీసే సమయానికే అందులోని నలుగురూ శవాలై కనిపించారు. పోలీసులు పంచనామా నిర్వహించిన అనంతరం మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం దుబ్బాక ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి డ్రైవర్ నిద్రమత్తా లేక అతివేగమా అనే కోణంలో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఒకే కుటుంబం బలవడటంతో బలవంతాపూర్, అప్పనపల్లి గ్రామాల్లో తీవ్ర విషాదం నెలకొంది.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
