Ponnam Prabhakar Palle Bata
* మంత్రి పొన్నం ప్రభాకర్ ‘పల్లెబాట’
* హుస్నాబాద్ నియోజకవర్గంలో నూతన చరిత్రకు శ్రీకారం
ఆకేరు న్యూస్, సైదాపూర్:
కేవలం పదవిలో ఉండి కార్యాలయాలకే పరిమితం కాకుండా, స్వయంగా ప్రజల గడప ముందుకు వచ్చి వారి కష్టసుఖాలు వినడమే నిజమైన ప్రజాస్వామ్యానికి, అసలైన ప్రజాపాలనకు నిదర్శనమని నిరూపిస్తూ రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ చేపట్టిన “పల్లె పల్లెకు పొన్నం అన్న – పల్లె పల్లెల్లో ప్రజా పాలన” వినూత్న కార్యక్రమం తెలంగాణ రాజకీయ పరిపాలనా చరిత్రలో ఒక నూతన అధ్యాయాన్ని లిఖిస్తోంది. తనను ఆదరించి గెలిపించిన నియోజకవర్గ ప్రజల రుణం తీర్చుకునేందుకు ప్రతీ పల్లెను నేరుగా పలకరిస్తూ, గ్రామస్థుల సమస్యలను క్షేత్రస్థాయిలో వింటూ, జిల్లా, మండల స్థాయి అధికారులందరినీ ప్రజల వద్దకే తీసుకువచ్చి సాధ్యమైన సమస్యలకు అక్కడికక్కడే పరిష్కార మార్గాలు చూపడం ఈ కార్యక్రమం ప్రత్యేకత. మిగిలిన సమస్యలకు నిర్దిష్ట గడువును నిర్ణయించి, వాటి పూర్తయ్యే వరకు స్వయంగా పర్యవేక్షించడం సంప్రదాయ రాజకీయ పర్యటనలకు పూర్తి భిన్నమైన, బాధ్యతాయుతమైన ప్రజాసేవా నమూనాగా నిలుస్తోంది. నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న మొత్తం 173 గ్రామాల గడపలను తట్టే ఈ బృహత్తర పల్లెబాట కేవలం ఒక మంత్రి పర్యటన మాత్రమే కాకుండా, పరిపాలనా యంత్రాంగాన్ని ప్రజల వద్దకు చేర్చే ఒక విప్లవాత్మక అడుగు. బుధవారం సైదాపూర్ మండల వేదికగా ఈ చారిత్రాత్మక కార్యక్రమాన్ని మంత్రి పొన్నం ప్రభాకర్ ఘనంగా ప్రారంభించారు.
* తొలిరోజే ఆరు గ్రామాల్లో విస్తృత పర్యటన
ఈ బృహత్ కార్యక్రమంలో భాగంగా తొలిరోజే సైదాపూర్ మండలంలోని దుద్దెనపల్లి, ఎక్లాస్పూర్, సోమారం, గర్రెపల్లి, లస్మన్నపల్లి, వెన్నంపల్లి, ఆరేపల్లి గ్రామాల్లో మంత్రి సుడిగాలి పర్యటన చేశారు. ఆయా గ్రామాల సర్పంచులు విజయ రాజశేఖర్, భాగ్యలక్ష్మి క్రాంతి, అనిత అంజి, శ్రీకాంత్, స్వప్న సంపత్ రెడ్డి, చిరంజీవి, లావణ్య మోహన్ రావులతో కలసి గ్రామాల్లోని సమస్యలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా వివిధ వేదికలపై మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతుండగా గ్రామీణులు తమ ఆవేదనలను, అవసరాలను స్వేచ్ఛగా పంచుకున్నారు. ప్రజాప్రతినిధి అంటే ఐదేళ్లకు ఒకసారి ఓట్ల కోసం ప్రజల ముందుకు రావడం కాదని, నిరంతరం వారి కష్టాల్లో తోడుగా ఉంటూ వారి కన్నీళ్లు తుడవడమే నిజమైన నాయకత్వ లక్షణమని మంత్రి స్పష్టం చేశారు. ప్రభుత్వ కార్యాలయాల్లో కూర్చొని ఫైళ్లపై సంతకాలు చేయడంతోనే పాలన ముగిసిపోదని, ప్రజల ఇళ్ల ముందుకు వచ్చి వారి సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకుని పరిష్కరించినప్పుడే ప్రజాపాలన అనే పదానికి పూర్తి అర్థం వస్తుందని ఆయన తేల్చిచెప్పారు.
* కోట్లాది రూపాయల అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాలు
పర్యటనలో భాగంగా ఆయా గ్రామాల్లో కోట్ల రూపాయల అభివృద్ధి పనులకు మంత్రి ప్రారంభోత్సవాలు చేశారు. దుద్దెనపల్లి గ్రామంలో ఇరవై లక్షల రూపాయల వ్యయంతో నూతనంగా నిర్మించిన పల్లె దవాఖానను ప్రారంభించిన అనంతరం రైతు వేదికలో ప్రజలతో విస్తృత స్థాయిలో ముఖాముఖి నిర్వహించారు. దుద్దెనపల్లి–మొగిలిపల్లి మధ్య రాకపోకల సౌకర్యార్థం మూడు కోట్ల యాభైఆరు లక్షల రూపాయలతో బ్రిడ్జి నిర్మాణానికి నిధులు మంజూరయ్యాయని వెల్లడించి, త్వరితగతిన పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. గ్రామ పంచాయతీ భవనం, వ్యాయామశాల, గ్రామ సమైక్య భవనం వంటి మౌలిక సదుపాయాల కల్పనకు రూపురేఖలు దిద్దారు. ఎక్లాస్పూర్ మరియు వెన్నంపల్లి గ్రామాలలో కూడా ఇరవై లక్షల రూపాయల చొప్పున వెచ్చించి నిర్మించిన పల్లె దవాఖానాలను ఆయన ప్రజలకు అంకితం చేశారు. వెన్నంపల్లిలో మంజూరైన ఇరవైఒక్క ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు వేగవంతంగా పూర్తయ్యాయని, అర్హులైన మిగిలిన వారికి త్వరలోనే రెండో విడత కింద ఇళ్లను మంజూరు చేస్తామని తెలిపారు. ఇదే గ్రామంలో ముప్పైఐదు మహిళా సంఘాలకు పదమూడున్నర లక్షల రూపాయల వడ్డీ లేని రుణాలను, బ్యాంక్ లింకేజ్ కింద నాలుగు కోట్ల ముప్పైఐదు లక్షల రూపాయలను అందజేశారు. అలాగే గ్రామంలో ఏడు కోట్ల పదమూడు లక్షల రూపాయల పరిమాణంలో రైతు రుణమాఫీ జరిగిందని, రెండు వందల పదమూడు మంది రైతులకు సన్న వడ్ల బోనస్ నిధులు జమ అయ్యాయని వివరించారు. ఆరేపల్లి గ్రామంలో పది లక్షల రూపాయలతో నిర్మించిన గ్రామ మహిళా సమైక్య భవనాన్ని, ప్రాథమిక పాఠశాలలో నూతనంగా ఏర్పాటు చేసిన కిచెన్ షెడ్‌ను మంత్రి లాంఛనంగా ప్రారంభించారు.
* పక్కా ప్రణాళికతో పర్యవేక్షణ వ్యవస్థ
ఈ కార్యక్రమం కేవలం వినతిపత్రాలు స్వీకరించే సాధారణ వేదిక కాకుండా, పక్కా ప్రణాళికతో సాగుతున్న పరిపాలనా ప్రక్రియగా నిలుస్తోంది. ప్రతి గ్రామంలోనూ ప్రధానంగా ఎదురవుతున్న ఐదు కీలక సమస్యలను గుర్తించి, దానికి తగిన శాఖను, సంబంధిత అధికారిని అక్కడికక్కడే బాధ్యుడిగా నియమిస్తున్నారు. వచ్చిన దరఖాస్తులపై ఇరవైనాలుగు గంటల్లో ప్రాథమిక నివేదిక రూపొందించి, ఏడు, పదిహేను, ముప్పై రోజుల వ్యవధిలో ప్రత్యేక సమీక్షలు నిర్వహించడం ద్వారా ప్రతీ సమస్య పరిష్కారమయ్యే వరకు నిరంతర పర్యవేక్షణ వ్యవస్థను ఏర్పాటు చేశారు. సోమారం, గర్రెపల్లి, లస్మన్నపల్లి గ్రామాల్లో ప్రజల నుంచి పింఛన్లు, రేషన్ కార్డులు, ఉపాధి హామీ, విద్యుత్ సమస్యలకు సంబంధించిన దరఖాస్తులను స్వీకరించి అధికారులకు తక్షణ ఆదేశాలు ఇచ్చారు. ఈ నెల ముప్పైఒకటి వరకు ఏడు రకాల పింఛన్ల దరఖాస్తు ప్రక్రియ అందుబాటులో ఉంటుందని వెల్లడించారు.
* రైతాంగానికి ప్రత్యామ్నాయ పంటలకు ప్రోత్సాహం
రైతాంగ సంక్షేమం మరియు గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడంపై మంత్రి ప్రత్యేక దృష్టి సారించారు. వర్షాభావ పరిస్థితుల దృష్ట్యా భూగర్భ జలాల పెంపునకు ‘జలసిరి’ కార్యక్రమం ద్వారా ప్రతీ ఒక్కరూ ఇంకుడు గుంతలు, బోర్ వెల్ ఇంజెక్షన్ పాయింట్లు ఏర్పాటు చేసుకోవాలని పిలుపునిచ్చారు. కేవలం సాంప్రదాయ వరి సాగుపైనే ఆధారపడకుండా, అధిక లాభాలనిచ్చే ఆరుతడి పంటలు, ఆయిల్ పామ్ వైపు రైతులు అడుగులు వేయాలని సూచించారు. ఏ గ్రామ పంచాయతీ పరిధిలోనైనా రైతులు ముందుకు వచ్చి రెండు వందల ఎకరాల్లో ఆయిల్ పామ్ సాగును పూర్తి చేస్తే, ఆ గ్రామ పంచాయతీకి ఐదు లక్షల రూపాయల ప్రత్యేక అభివృద్ధి నిధులను మంజూరు చేస్తామని మంత్రి ప్రకటించారు.
* అర్హులందరికీ సంక్షేమ ఫలాలు అందేలా హామీ
దుద్దెనపల్లి, ఎక్లాస్పూర్, వెన్నంపల్లి, ఆరేపల్లి తదితర గ్రామాల్లో సాగిన ఈ పర్యటనలో ప్రభుత్వ ముఖ్య సంక్షేమ పథకాలైన రెండు వందల యూనిట్ల ఉచిత విద్యుత్, ఐదు వందల రూపాయలకే గ్యాస్ సబ్సిడీ, రైతు భరోసా, రైతు బీమా, కళ్యాణలక్ష్మి, షాదీముబారక్, సన్న వడ్లకు ఐదు వందల రూపాయల బోనస్ అమలు తీరును మంత్రి నేరుగా ప్రజలను అడిగి తెలుసుకున్నారు. అర్హత ఉండి ఏ ఒక్కరికైనా పథకాలు అందకపోతే వెంటనే నమోదు చేసుకుని లబ్ధి చేకూర్చాలని స్పష్టం చేశారు. అలాగే గౌరవెల్లి ప్రాజెక్టు, సాగునీటి కాలువల భూసేకరణ, ఎల్ఎండీ నీటి ప్రాజెక్టుల వంటి దీర్ఘకాలిక సమస్యలను రాష్ట్రస్థాయిలో ముఖ్యమంత్రి, మంత్రివర్గం దృష్టికి తీసుకెళ్లి శాశ్వత పరిష్కారం చూపిస్తామని హామీ ఇచ్చారు.
* పెద్ద ఎత్తున హాజరైన ప్రజాప్రతినిధులు, నాయకులు
ఈ సుదీర్ఘ పర్యటనలో వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ దొంత సుధాకర్, సింగిల్ విండో అధ్యక్షుడు కొత్త తిరుపతిరెడ్డి, మండల స్పెషల్ ఆఫీసర్ జి. సునీత, ఏసీపీ మాధవి, తహసీల్దార్ శ్రీనివాస్, ఎంపీడీఓ యాదగిరి, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు కొండల్ రెడ్డి, సీనియర్ నాయకులు గుండారం శ్రీనివాస్ రాఘవులు, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు మిట్టపల్లి కిష్టయ్య, సర్పంచులు చంద్రయ్య, రవీందర్, రాజిరెడ్డి, రెడ్డ, వ్యవసాయ మార్కెట్ కమిటీ మరియు సింగిల్ విండో డైరెక్టర్లు, మండల యూత్ నాయకులు సాయి మేకల, రవీందర్, రాకేష్, పంతంగి రవీందర్, రమేష్, చల్లూరి రవీందర్, వివిధ శాఖల ప్రభుత్వ అధికారులు, గ్రామస్తులు మరియు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.


Please tell us what is wrong. Your report will be sent to the website team.
