Roopa Reddy Murder Case solved
* రూపారెడ్డి హత్య కేసులో వీడిన మిస్టరీ
* పదవ తరగతి విద్యార్థులే చంపేశారు
– ఎస్పీ శరత్ చంద్ర పవార్
ఆకేరు న్యూస్, నల్గొండ : ప్రిన్సిపల్ కల్లు రూపారెడ్డి హత్య కేసు మిస్టరీ వీడింది. బూబూ అన్న పిలుపే నిందితులను పటట్టించింది.. నల్గొండ జిల్లా కొండమల్లేపల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలో ఆగస్టు 11న నాగార్జున గ్రామర్ కాన్సెప్ట్ స్కూల్ ప్రిన్సిపల్ కల్లు రూపారెడ్డి దారుణ హత్యకు గురయింది. ఆమె తన ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. మృతురాలి శరీరంపై మొత్తం 27 కత్తిపోట్లు ఉన్నట్లు పోస్టుమార్టం పరిశీలనలో తేలిందని బుధవారం ఏర్పాటుచేసిన ప్రెస్‌మీట్ లో ఎస్పీ శరత్ చంద్ర పవార్ వెల్లడించారు. నిందితులిద్దరూ 16 ఏళ్ళ లోపు వారే.ఒకరు నాగార్జున గ్రామర్ స్కూల్ కు చెందిన హాస్టల్ ఉంటున్నారు. జల్సాలకు అలవాటు పడి విద్యను నిర్లక్ష్యం చేస్తున్నారు. ఈ విషయాన్ని వారి తల్లిదండ్రులను పిలిపించి విద్యార్థులను ప్రిన్సిపల్ రూపారెడ్డి వారి సమక్షంలోనే మందలించారు. రూపారెడ్డి ఇంట్లో డబ్బు దొంగతనం చేస్తుండగా ఆమె గుర్తుపట్టడంతో, పోలీసులకు ఫిర్యాదు చేస్తారనే భయంతో ప్రధాన నిందితుడు హత్యకు పాల్పడ్డాడు. రెండో విద్యార్థి దొంగతనానికి సహకరించి ఇంటి బయట కాపలా ఉన్నాడు.
* బాబూ అన్ని పిలుపే..
హత్య జరగడానికి కొద్దిసేపటి ముందు రూపారెడ్డి తన చిన్నమ్మతో ఫోన్లో మాట్లాడారు. ఆ సంభాషణ జరుగుతున్న సమయంలో ఆమె చివరిగా ‘బాబు’ అని పలికినట్లు తెలిసింది. ఆ తర్వాత ఫోన్ స్విచ్ఆఫ్ అయింది. రూపారెడ్డి తన పాఠశాల విద్యార్థులను సాధారణంగా ‘బాబు’ అని పిలుస్తారని విచారణలో తెలుసుకున్నాం. దీంతో ఈ నేరంలో పాఠశాలకు సంబంధించిన విద్యార్థుల ప్రమేయం ఉండవచ్చనే కోణంలో దర్యాప్తు చేపట్టామని ఎస్పీ వెల్లడించారు.హత్య అనంతరం పాఠశాలకు నాలుగు రోజులపాటు సెలవులు ఇచ్చారు. పాఠశాల తిరిగి ప్రారంభమైన తర్వాత గైర్హాజరైన 13 మంది విద్యార్థుల వివరాలను సేకరించాం. వారిలో ఐదుగురు పదో తరగతి విద్యార్థులు ఉన్నారు. ఇద్దరు విద్యార్థులు ఇటీవల అధికంగా డబ్బు ఖర్చుచేస్తూ పార్టీలు చేసుకుంటున్నట్లు విచారణలో తెలిసింది. వారి కదలికలను సీసీటీవీ దృశ్యాలతో పోల్చి చూడగా అనుమానం బలపడింది.నిందితులిద్దరూ 16 సంవత్సరాల వయస్సున్న పదో తరగతి విద్యార్థులు. మైనర్లు కావడంతో వారి పేర్లు, వ్యక్తిగత వివరాలను వెల్లడించడం లేదు. ప్రధాన నిందితుడు గతంలో ఇదే పాఠశాల హాస్టల్లో ఉండేవాడు. సుమారు 20 రోజుల క్రితం అతని బ్యాగులో డబ్బు, సెల్‌ఫోన్ లభించడంతో ప్రిన్సిపల్ రూపారెడ్డి అతన్ని మందలించారు. హాస్టల్ నుంచి తొలగించి డే స్కాలర్‌గా మార్చారు. అప్పటి నుంచి అతను రూపారెడ్డిపై కక్ష పెంచుకున్నట్లు విచారణలో వెల్లడైంది.
ప్రధాన నిందితుడు మద్యం సేవించడంతోపాటు విచ్చలవిడిగా డబ్బు ఖర్చు చేసే అలవాటు కలిగి ఉన్నట్లు తెలిసింది. అతనికి ద్విచక్ర వాహనం కొనుగోలు చేయాలనే కోరిక కూడా ఉంది. సులభంగా, త్వరగా డబ్బు సంపాదించడం ఎలా అనే అంశంపై ఇంటర్నెట్లో వీడియోలు వెతికినట్లు గుర్తించామని ఎస్పీ శరత్ పవార్ వివరించారు.
* రెక్కీ చేసి మరీ..
ప్రతి నెల 10వ తేదీ నాటికి పాఠశాల ఫీజుల వసూలు కారణంగా రూపారెడ్డి ఇంట్లో నగదు ఉంటుందని ప్రధాన నిందితుడికి తెలుసు. దీంతో మరో విద్యార్థితో కలిసి ఆమె ఇంట్లో దొంగతనం చేయాలని నిర్ణయించుకున్నాడు. ఘటనకు ఐదు రోజుల ముందే ఇద్దరూ ప్రణాళిక రూపొందించారు. రూపారెడ్డి ఇంటి పరిసరాల్లో రెక్కీ చేశారు. ఇంట్లోకి ఎలా ప్రవేశించాలి, దొంగతనం తర్వాత ఏ మార్గంలో పారిపోవాలి అనే విషయాలను ముందుగానే పరిశీలించారు. వేలిముద్రలు పడకుండా ఉండేందుకు గ్లౌజులు, గుర్తుపట్టకుండా ఉండేందుకు మాస్కులు కొనుగోలు చేశారు. ప్రధాన నిందితుడు తన వెంట కత్తిని కూడా తీసుకెళ్లాడు.ఆగస్టు 11 సాయంత్రం రూపారెడ్డి ఇంట్లో ఒంటరిగా ఉన్న విషయాన్ని గమనించారు. ఒక విద్యార్థి ఇంటి బయట కాపలా ఉండగా, ప్రధాన నిందితుడు వెనుకవైపు ఉన్న ప్రహరీ గోడ దూకి ఇంట్లోకి ప్రవేశించాడు. బెడ్రూమ్లో ఉన్న సుమారు రూ.2.50 లక్షల నగదును తీసుకున్నాడు.అతను ఇంట్లో నుంచి బయటకు వస్తున్న సమయంలో రూపారెడ్డి చూసి గుర్తుపట్టారు. తాను దొంగతనం చేసిన విషయం పోలీసులకు చెబుతారని, తనను పట్టిస్తారని భయపడ్డాడు. వెంట తెచ్చుకున్న కత్తితో ఆమెపై విచక్షణారహితంగా దాడి చేశాడు. మొత్తం 27 సార్లు కత్తితో పొడిచాడు. అనంతరం రూపారెడ్డి ఐఫోన్‌ను తీసుకొని అక్కడి నుంచి పారిపోయాడు.
హత్య తర్వాత నిందితులు కత్తి, రక్తపు మరకలు పడిన దుస్తులు, ఇతర వస్తువులను మార్గమధ్యంలో చెట్ల పొదలు, డ్రైనేజీలో పడేశారు. దొంగిలించిన డబ్బులో కొంత మొత్తాన్ని ఖర్చు చేశారు. పార్టీలు చేసుకోవడంతోపాటు విలాసాలకు డబ్బు వినియోగించారు. హత్య తర్వాత కూడా సాధారణంగా వ్యవహరిస్తూ పాఠశాలకు వచ్చి, అక్కడ జరుగుతున్న పరిణామాలను గమనించారు.
* కరెన్సీ నోట్లపై రక్తపు మరకలు
దర్యాప్తులో లభించిన ఆధారాల ఆధారంగా ఇద్దరు విద్యార్థులపై నిఘా పెట్టాం. దొనియాల ఎక్స్‌రోడ్డు సమీపంలో ద్విచక్ర వాహనంపై వెళ్తున్న వారిని అదుపులోకి తీసుకొని విచారించాం. వారి వద్ద రూ.1.54 లక్షల నగదు లభించింది. ఆ డబ్బు తమ తల్లిదండ్రులు ఇచ్చారని మొదట చెప్పారు. అయితే స్వాధీనం చేసుకున్న రూ.500 నోట్లలో మూడు నోట్లపై రక్తపు మరకలు కనిపించాయి. వాటిని ఫోరెన్సిక్ పరీక్షకు పంపించగా, అవి మానవ రక్తపు మరకలేనని నిర్ధారణ అయిందన్నారు.విచారణలో ఇద్దరూ నేరానికి సంబంధించిన వివరాలను వెల్లడించారు. వారి నుంచి రూ.1.54 లక్షల నగదు, రూపారెడ్డికి చెందిన ఐఫోన్, హత్యకు ఉపయోగించిన కత్తి, గ్లౌజులు, మాస్కులు, రెండు సెల్ఫోన్లు, ఇతర వస్తువులను స్వాధీనం చేసుకున్నాం. సీసీటీవీ దృశ్యాలు, స్వాధీనం చేసుకున్న వస్తువులు, రక్తపు మరకలున్న నగదు, మృతురాలి ఫోన్, నిందితుల వాంగ్మూలాలు ఈ కేసులో ప్రధాన ఆధారాలుగా ఉన్నాయి.నిందితులిద్దరూ మైనర్లు. అందువల్ల జువైనల్ జస్టిస్ చట్టంలోని నిబంధనల ప్రకారం వారిని జువైనల్ జస్టిస్ బోర్డు ఎదుట హాజరుపరుస్తాం. ఈ కేసులో సాంకేతిక, శాస్త్రీయ ఆధారాలను పూర్తిగా సేకరించి తదుపరి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఎస్పీ పవార్ చెప్పారు.
ఈ హత్య కేసును ఛేదించడానికి దేవరకొండ డీఎస్పీ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఐదు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశాం. మొత్తం 40 మంది పోలీసు సిబ్బంది దర్యాప్తులో పాల్గొన్నారు. క్లూస్ టీమ్, ఫింగర్‌ప్రింట్ నిపుణులు, ఫోరెన్సిక్ బృందం, డాగ్ స్క్వాడ్‌ను ఉపయోగించాం. కొండమల్లేపల్లి పరిసరాల్లో దాదాపు 30 కిలోమీటర్ల పరిధిలోని 70కిపైగా సీసీటీవీ కెమెరాల దృశ్యాలను పరిశీలించాం. స్థానికులు, బంధువులు, పాఠశాల సిబ్బంది, విద్యార్థులు సహా 80 మందికిపైగా వ్యక్తులను విచారించామని ఎస్పీ శరత్ చంద్ర పవార్ వెల్లడించారు..
——————————————

Please tell us what is wrong. Your report will be sent to the website team.
