CM Revanth Reddy in UK
* అమెరికా వెళ్లేందుకు అనుమతి ఇవ్వని విదేశాంగ శాఖ
* రద్దు చేసుకున్న ముఖ్యమంత్రి
* లండన్ నుంచే హైదరాబాద్కు తిరుగు ప్రయాణం
* పర్యటన ఆగినా తెలంగాణ రైజింగ్ ఆగదు : రేవంత్ రెడ్డి
ఆకేరున్యూస్, హైదరాబాద్ :
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అమెరికా పర్యటనకు కేంద్రం అనుమతి నిరాకరించింది. ఆయన అమెరికా వెళ్లేందుకు విదేశాంగ శాఖ అంగీకరించలేదు. ఈనెల 23న ఆయన లండన్ నుంచి అమెరికా వెళ్లాల్సి ఉంది. అనుమతి లేకపోవడంతో రేవంత్ లండన్ నుంచే తిరిగి హైదరాబాద్ చేరుకోనున్నారు. రేవంత్ యూకే, యూఎస్ పర్యటనకు తెలంగాణ ప్రభుత్వం అనుమతి కోసం చాలా రోజుల క్రితమే సమాచారం ఇచ్చింది. రేవంత్ రెడ్డి యూకే పర్యటకు మాత్రమే విదేశాంగ శాఖ అనుమతి ఇచ్చింది. అమెరికా వెళ్లేందుకు నిరాకరించడం చర్చనీయాంశంగా మారింది.
* పది రోజుల పర్యటనలో ఆటంకం
విదేశీ విద్యాసంస్థలను రాష్ట్రానికి ఆకర్షించడం, మౌలిక సదుపాయాలు, నైపుణ్యాభివృద్ధికి సంబంధించి భాగస్వామ్య ఒప్పందాలు చేసుకోవడానికి సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని బృందం 10 రోజుల యూకే, యూఎస్ పర్యటనకు సిద్ధమైంది. ఈ విదేశీ పర్యటనలకు అనుమతి కోరుతూ తెలంగాణ ప్రభుత్వం ఆగస్టు 16న ప్రతిపాదనలు పంపింది. విదేశాంగ శాఖ కేవలం యూకే పర్యటనకు మాత్రమే అనుమతిని ఇచ్చి, యూఎస్ పర్యటనకు రాజకీయ కారణాలు చూపుతూ నిరాకరించినట్లు ముఖ్యమంత్రి కార్యాలయం తెలిపింది.
* షెడ్యూల్లో మార్పులు
లండన్ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి, ముందుగా అనుకున్న షెడ్యూల్ ప్రకారం ఆగస్టు 23న అమెరికాలోని బోస్టన్ వెళ్లాల్సి ఉంది. విదేశాంగ శాఖ నిర్ణయంతో ఆయన అక్కడకు వెళ్లకుండా ఆగస్టు 23న లండన్ నుంచి నేరుగా హైదరాబాద్ తిరుగు ప్రయాణం కానున్నారు. ముఖ్యమంత్రి తన పర్యటనను రద్దు చేసుకున్నప్పటికీ, అధికారుల బృందాన్ని అమెరికా పర్యటనను కొనసాగించాలని ఆదేశించారు. ముందుగా అనుకున్న ప్రకారం హార్వర్డ్, ఎంఐటీ, వర్జీనియా టెక్ వంటి ప్రసిద్ధ విశ్వవిద్యాలయాలతో అనుకున్న ఎంఓయూలను పూర్తి చేయాల్సిందిగా అధికారులకు సూచించారు.
* తెలంగాణ రైజింగ్ ఆగదు..
యూఎస్ పర్యటనకు కేంద్రం అనుమతి ఇవ్వని కారణంగా తెలంగాణ రైజింగ్ ఆగదని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వ నూతన విద్యా విధానానికి అనుగుణంగానే ప్రపంచస్థాయి ఐవీ లీగ్ విద్యాసంస్థలను తెలంగాణకు తీసుకువచ్చే ఉద్దేశంతో యూఎస్ పర్యటనకు శ్రీకారం చుట్టినట్లు వెల్లడించారు. హైదరాబాద్ ను గ్లోబల్ నాలెడ్జ్ హబ్ గా మారుస్తామని స్పష్టం చేశారు. దేశ, రాష్ట్ర అభివృద్ధికే తమ ప్రాధాన్యం ఉంటుందని తెలిపారు. తెలంగాణకు పెట్టుబడులు తేవడమే తమ ముఖ్య ఉద్దేశమని సీఎం అన్నారు. దేశ నిర్మాణం, యువత భవిష్యత్తు విషయంలో రాజకీయాలకు అతీతంగా ఆలోచించాల్సి ఉందని సూచించారు.
———————–

Please tell us what is wrong. Your report will be sent to the website team.
