Actress Radhika about hero Suriya
* రాధిక ఆసక్తికర వ్యాఖ్యలు
ఆకేరు న్యూస్, హైదరాబాద్ :
తమిళ స్టార్ హీరో సూర్య, డైరెక్టర్ వెంకీ అట్లూరి కలయికలో వచ్చిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ బాక్సాఫీస్ వద్ద విజయవంతంగా దూసుకెళ్తోంది. ఈ సినిమా సక్సెస్ మీట్లో నటి రాధిక సూర్య గురించి కొన్ని ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. సినీ ప్రయాణంలో సూర్య పడిన కష్టాలను దగ్గరుండి చూశానన్నారు. సవాళ్లు ఉంటాయి.. పోరాటాలు ఉంటాయి.. వాటన్నింటినీ సూర్య అధిగమించారన్నారు. అందుకే ఆయన ఈ స్థాయిలో ఉన్నారని చెప్పారు.
సూర్య చాలా తక్కువగా మాట్లాడుతాడని, అందరితోనూ అన్ని విషయాల గురించి చర్చించడని రాధిక తెలిపారు. అయితే కొంతమంది సన్నిహితులతో మాత్రం ప్రతి విషయాన్ని పంచుకుంటాడని, అలాంటి వ్యక్తుల్లో తాను కూడా ఒకరినని అన్నారు. అప్పుడప్పుడు సూర్య తన సలహాలు కూడా తీసుకుంటాడని రాధిక వెల్లడించారు. సూర్య తన కెరీర్లో తీసుకునే నిర్ణయాల విషయంలో ఎంతో ఆలోచిస్తాడని, ఒకసారి నిర్ణయం తీసుకున్న తర్వాత దానిపై పూర్తి నమ్మకంతో ముందుకు సాగుతాడని ఆమె చెప్పారు.
* కార్తి అమెరికా చదువులకు రాధిక సాయం
ఒకానొక సందర్భంలో స్టార్ హీరో సూర్య, ప్రముఖ నటి రాధికతో తన కుటుంబానికి ఉన్న అనుబంధం గురించి ప్రస్తావించారు. తన తమ్ముడు కార్తి అమెరికాలో చదువుకునే సమయంలో రాధిక సాయం చేశారని సూర్య గుర్తుచేసుకున్నారు. ఆమె చేసిన సాయాన్ని ఎప్పటికీ మర్చిపోలేమని, బతికున్నంత కాలం గుర్తుపెట్టుకుంటామని సూర్య చెప్పారు. ఇక ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ సినిమా ఇప్పటి వరకు రూ.150 కోట్లకు పైగా వసూళ్లు సాధించినట్లు చిత్రబృందం పేర్కొంటోంది. తమిళనాట ఈ చిత్రం వసూళ్ల పరంగా టాప్-3లో నిలిచినట్లు తెలుస్తోంది.
* తల్లి పాత్రకు కేరాఫ్‌గా రాధిక
‘విశ్వనాథ్ అండ్ సన్స్’ చిత్రంలో రాధిక తల్లి పాత్రలో కనిపించారు. తల్లి పాత్రలో నటించడం రాధికకు కొత్తేమీ కాదు. గతంలోనూ ఎన్నో సినిమాల్లో తల్లి పాత్రలతో ప్రేక్షకులను మెప్పించారు. అయితే కార్తి నటించిన ‘ఊపిరి’ సినిమాలో ఆయనకు తల్లిగా నటించిన రాధిక.. ఇప్పుడు ‘విశ్వనాథ్ అండ్ సన్స్’లో సూర్యకు తల్లిగా నటించడం విశేషం. ఒకే కుటుంబానికి చెందిన సూర్య, కార్తి ఇద్దరి సినిమాల్లోనూ తల్లి పాత్రలో కనిపించడం రాధికకు ప్రత్యేక అనుభవంగా నిలిచింది. ‘సింగమ్’ వంటి చిత్రాల్లోనూ కలిసి నటించారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
