Kalyana Lakshmi scheme stay
* ప్రజాధనం దుర్వినియోగంపై ఘాటు వ్యాఖ్యలు
ఆకేరు న్యూస్, హైదరాబాద్: తెలంగాణలో ఎంతో ప్రాచుర్యం పొందిన సంక్షేమ పథకాలు కల్యాణలక్ష్మి, షాదీముబారక్ అమలు విషయంలో రాష్ట్ర ప్రభుత్వానికి తెలంగాణ ఉన్నత న్యాయస్థానం (హైకోర్టు)లో తీవ్ర నిరాశ ఎదురైంది. ఈ రెండు పథకాల అమలపై గతంలో విధించిన మధ్యంతర స్టేను ఎత్తివేసేందుకు హైకోర్టు స్పష్టంగా నిరాకరించింది. విచారణ సందర్భంగా ప్రభుత్వ వైఖరిపై తీవ్ర అసహనం వ్యక్తం చేసిన న్యాయస్థానం, రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి ఆందోళనకరంగా ఉందని మండిపడింది.
* చట్టబద్ధత లేకుండా ప్రజాధనం ఖర్చు..
చట్టబద్ధత లేకుండా, కేవలం ప్రభుత్వ ఉత్తర్వుల (GOs) ద్వారా ఈ పథకాలను అమలు చేస్తూ కోట్ల రూపాయల ప్రజాధనాన్ని పంపిణీ చేస్తున్నారని, రాజ్యాంగంలోని ఆర్థిక క్రమశిక్షణ సూత్రాలను ఉల్లంఘిస్తున్నారని పేర్కొంటూ దాఖలైన పిటిషన్‌పై హైకోర్టు సమగ్ర విచారణ చేపట్టింది. గతంలో ఈ వ్యవహారంపై కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించినప్పటికీ గడువు పొడిగింపు కోరడంతో ఆ పథకాల నిర్వహణ, నిధుల విడుదలపై కోర్టు స్టే విధించిన సంగతి తెలిసిందే.
* ‘ఆర్థిక పరిస్థితిపై డేంజర్ బెల్స్ మోగుతున్నాయి’
తాజా విచారణ సందర్భంగా ప్రభుత్వం వేసిన అఫిడవిట్‌పై ధర్మాసనం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. “రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులకు, విశ్రాంత ఉద్యోగులకు సకాలంలో జీతాలు, పెన్షన్లు అందక ప్రజలు అనేక అవస్థలు పడుతున్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ఇప్పటికే డేంజర్ బెల్స్ మోగుతున్నాయి. 2014 నుంచి అమలవుతున్న ఈ తరహా పథకాల వల్ల ప్రజాధనం వృథా అవుతోందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఒకవైపు భూబాధితులకు ఇవ్వాల్సిన నష్టపరిహారం చెల్లించలేని స్థితిలో ఉన్న ప్రభుత్వం, పన్ను చెల్లింపుదారుల సొమ్మును ఉచిత పథకాలకు ఏవిధంగా మళ్లిస్తుంది?” అని న్యాయస్థానం ఘాటుగా ప్రశ్నించింది.
ప్రజాధనం వినియోగం, సంక్షేమ పథకాల ప్రాధాన్యత, మరియు ప్రభుత్వ ఆర్థిక నిలకడపై స్పష్టమైన వివరణ అవసరమని వ్యాఖ్యానించిన ఉన్నత న్యాయస్థానం, ఈ అంశంపై తదుపరి విచారణను సోమవారానికి వాయిదా వేసింది. హైకోర్టు తీసుకున్న ఈ నిర్ణయంతో కల్యాణలక్ష్మి, షాదీముబారక్ లబ్ధిదారులకు నిధుల విడుదల మరికొంత కాలం నిలిచిపోయే అవకాశం ఏర్పడింది.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
