Music Director Ajay Arasada with pawan kalyan
* అజయ్ అరసాడతో పవన్ కళ్యాణ్ సరదా సన్నివేశం
* ఏఐతో మ్యూజిక్ డైరెక్టర్ అవ్వలేరు..
* సెట్ అయిన వారితోనే పాడిస్తా
* క్రెడిట్ విషయంలో ఇబ్బంది అయింది
* సంగీత దర్శకుడు అజయ్ అరసాడతో ప్రత్యేక ఇంటర్వ్యూ ..
ఆకేరు న్యూస్, హైదరాబాద్: ఆయ్, సేవ్ ది టైగర్స్, వికటకవి, గుర్తుకొస్తున్నాయి వంటి ప్రాజెక్ట్‌లతో సంగీత దర్శకుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు అజయ్ అరసాడ. వరుస అవకాశాలతో బిజీగా ఉన్న ఆయన తన సినీ ప్రయాణం, ఎదురైన అనుభవాలు, మ్యూజిక్‌పై తన ఆలోచనలు, పవన్ కళ్యాణ్‌తో జరిగిన ప్రత్యేక భేటీ గురించి ఆసక్తికర విషయాలను ఆకేరు న్యూస్ సినిమా ప్రతినిధితో ప్రత్యేకంగా పంచుకున్నారు.
* ఉద్యోగం నుంచి సినీ సంగీతం వైపు..
అజయ్ అరసాడది వైజాగ్. తన కుటుంబంలోనే ఆర్ట్, మ్యూజిక్కు మంచి అనుబంధం ఉందని ఆయన తెలిపారు. సినిమాల్లోకి రాకముందు టీసీఎస్‌లో సుమారు ఏడేళ్లు ఉద్యోగం చేశానని చెప్పారు. ఉద్యోగం చేస్తూనే రెండు సినిమాలకు పనిచేశానని, సంగీత దర్శకుడు దేవీ శ్రీ ప్రసాద్ తనకు స్ఫూర్తి అని వెల్లడించారు.తన సినీ ప్రయాణంలో తల్లి, భార్య ఇచ్చిన ప్రోత్సాహం ఎంతో ముఖ్యమని అజయ్ తెలిపారు. అలాగే వైజాగ్‌కు చెందిన శ్రీచరణ్ తనకు మంచి స్నేహితుడని, ‘గూఢచారి’ సినిమాకు కీబోర్డ్ ప్రోగ్రామర్‌గా అవకాశం రావడానికి ఆయన కారణమని చెప్పారు.
* కాఫీ పట్టుకొచ్చావా…! పవన్ కామెడీ..
ఇటీవల జనసేన అధినేత, నటుడు పవన్ కళ్యాణ్‌ను కలిసిన విషయాన్ని అజయ్ అరసాడ ప్రత్యేకంగా ప్రస్తావించారు. జనసేన కార్యక్రమాలకు తాను మ్యూజిక్ అందిస్తున్నానని చెప్పారు.ప్రధాని మోదీని పవన్ కళ్యాణ్ కలిసిన సమయంలో తాను రూపొందించిన ఓ స్కోర్‌ను పవన్ చూశారని, తన వర్క్ నచ్చడంతో తనను ప్రత్యేకంగా పిలిపించారని తెలిపారు. డిప్యూటీ సీఎం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నన్ను పర్సనల్‌గా పిలిచి మాట్లాడారు. పొలిటికల్‌గా అయినా, పీకే క్రియేటివ్స్ బ్యానర్ కోసం అయినా కలిసి పనిచేద్దామని అన్నారు’’ అని అజయ్ వెల్లడించారు.పవన్ కళ్యాణ్‌తో మీటింగ్ ఉందని తెలిసినప్పుడు మొదట తాను ఆశ్చర్యపోయానని అజయ్ చెప్పారు. ఐదారు నిమిషాలు మాట్లాడి ఫొటో తీసుకుని వస్తానని అనుకున్నానని, కానీ అక్కడికి వెళ్లిన తర్వాత పరిస్థితి పూర్తిగా భిన్నంగా ఉందన్నారు. పవన్ కళ్యాణ్ ఒక్కరే ఉన్నారని, దాదాపు అరగంట పాటు ఇద్దరూ మాట్లాడుకున్నామన్నారు. ఈ సందర్భంగా ఎన్నో విషయాలపై చర్చించడంతో పాటు భవిష్యత్తులో కలిసి చేయాల్సిన ప్రాజెక్టుల గురించి కూడా పవన్ మాట్లాడారని అజయ్ చెప్పారు.కాఫీ మగ్ ఆకారంలోని బోస్ స్పీకర్‌ను చూసి పవన్ కళ్యాణ్ సరదాగా మాట్లాడిన విషయాన్ని కూడా అజయ్ గుర్తు చేసుకున్నారు.ఇదేంటి కాఫీ కప్పులా ఉంది.. కాఫీ పట్టుకొచ్చావా? అంటూ పవన్ సరదాగా జోక్స్ వేశారని చెప్పారు. పవన్ తనతో అలా సరదాగా ఆత్మీయంగా మాట్లాడాడం మరచిపోలేనే గొప్ప అనుభూతి అన్నారు.

* చిన్న సినిమాలు.. పెద్ద అనుభవాలు
చిన్న చిత్రాలకు పనిచేయడం వల్ల తనకు ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాలేదని అజయ్ అన్నారు. మంచి ప్రొడక్షన్స్‌తో పనిచేయడంతో పేమెంట్స్ విషయంలో కూడా సమస్యలు రాలేదని చెప్పారు.
తనకంటూ ఒకే తరహా మ్యూజిక్ బ్రాండ్‌ను ఏర్పరచుకోవడం కంటే అన్ని రకాల జానర్లు, విభిన్న కథలకు సంగీతం అందించాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. తన దగ్గరకు వచ్చిన కథకు న్యాయం చేయడమే తన లక్ష్యమని చెప్పారు.
* ఎవరు సెట్ అవుతారో వారితోనే పాడిస్తా
సంగీతానికి బడ్జెట్ ప్రభావం కొంతవరకు ఉన్నప్పటికీ, పాటకు సరిపోయే సింగర్‌ను ఎంచుకోవడమే తనకు ముఖ్యమని అజయ్ తెలిపారు. ‘‘ఫైనల్‌గా అది నా పాట. జీవితాంతం నిలిచిపోయే పాటగా ఉండాలని చూస్తాను’’ అని అన్నారు.కెరీర్ ప్రారంభంలో అనురాగ్ కులకర్ణితో పాట పాడించాలని భావించినప్పుడు ఓ నిర్మాత వద్దన్న విషయాన్ని గుర్తు చేసుకున్న ఆయన.. ఇప్పుడు అదే నిర్మాత అనురాగ్‌తో పాడించుకునే స్థాయిలో లేరంటూ సరదాగా వ్యాఖ్యానించారు. థియేటర్ కోసం రూపొందించిన మ్యూజిక్, స్కోర్‌ను చివరకు ఓటీటీ కోసం కూడా ఉపయోగిస్తారని అజయ్ చెప్పారు. అయితే ఓటీటీలో సౌండింగ్ స్థాయి తగ్గిపోవడం వల్ల తాము చేసిన కష్టం కొంత వృథా అవుతోందని అభిప్రాయపడ్డారు.‘వికటకవి’ని థియేటర్లో చూస్తే సౌండింగ్ పరంగా మరో స్థాయిలో ఉంటుందని, ఓటీటీకి వచ్చేసరికి తాను చేసిన పనిలో దాదాపు 50 శాతం ప్రభావమే కనిపిస్తుందని అన్నారు.
* ఏఐతో మ్యూజిక్ డైరెక్టర్ అవ్వలేరు..
ప్రస్తుతం అన్ని రంగాల్లోకి దూసుకొస్తున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌పై కూడా అజయ్ స్పందించారు. ఏఐ వల్ల మ్యూజిక్‌పై పెద్దగా ప్రభావం కనిపించలేదని ఆయన అన్నారు.కొంతమంది నిర్మాతలు ఏఐ ద్వారా రూపొందించిన ట్రాక్స్‌ను పంపించి, అదే తరహాలో మ్యూజిక్ కావాలని అడుగుతున్నారని తెలిపారు. ఏఐని ఒక టెక్నీషియన్ తన పనిలో ఉపయోగించుకోవచ్చని, కానీ ఏఐని ఉపయోగించి ఎవరైనా మ్యూజిక్ డైరెక్టర్ అయిపోతారని మాత్రం అనుకోవద్దని వ్యాఖ్యానించారు.
* దర్శకులు కాన్సెప్ట్ చెప్పాలి..
ప్రస్తుత దర్శకులతో పనిచేసే విధానంలో మార్పు వచ్చిందని అజయ్ అభిప్రాయపడ్డారు. గతంలో దర్శకులు సిట్యువేషన్, కాన్సెప్ట్‌ను వివరించి, ఎలాంటి ట్యూన్ కావాలో చెప్పేవారని అన్నారు.ఇప్పుడు కొంతమంది దర్శకులు కేవలం సీన్ గురించి మాత్రమే చెబుతున్నారని, కానీ ఆ సీన్ వెనుక ఉన్న కాన్సెప్ట్‌ను వివరించలేకపోతున్నారని చెప్పారు. కాన్సెప్ట్ స్పష్టంగా తెలియకపోతే లిరిసిస్ట్ సాహిత్యం రాయడం, తాను ట్యూన్ ఇవ్వడం కష్టమవుతుందని తెలిపారు.
* ‘ఆయ్’లో క్రెడిట్ విషయంలో ఇబ్బంది..
‘ఆయ్’ సినిమాకు సంబంధించి తనకు క్రెడిట్ విషయంలో కొంత ఇబ్బంది ఎదురైందని అజయ్ తెలిపారు. రామ్ మిర్యాల రెండు పాటలు అందించారని, మిగిలిన మ్యూజిక్ అంతా తానే చేశానని చెప్పారు. అయితే మీడియాలో కొన్ని సందర్భాల్లో పూర్తి మ్యూజిక్ క్రెడిట్ రామ్ మిర్యాలకే వెళ్లిందని వివరించారు.ఈ విషయాన్ని గమనించిన నిర్మాత బన్నీ వాస్ తన పేరును ప్రతి ఈవెంట్లో ప్రస్తావిస్తూ కరెక్ట్ చేయడానికి ప్రయత్నించారని తెలిపారు. ‘సేవ్ ది టైగర్స్’ సమయంలోనూ తన పేరు కాకుండా వేరే పేరు కనిపించిన సందర్భం ఉందన్నారు.తన టీమ్‌లో పనిచేసే ప్రతి ఒక్కరికీ తాను క్రెడిట్ ఇస్తానని అజయ్ స్పష్టం చేశారు.
* పదేళ్ల జర్నీపై సంతృప్తే..
సినీ పరిశ్రమలో తనకు పదేళ్ల ప్రయాణం పూర్తయినప్పటికీ, కరోనా కారణంగా ఇందులో చాలా సమయం కోల్పోయానని అజయ్ చెప్పారు. అయితే ఈ ప్రయాణంలో తనపై తనకు నమ్మకం పెరిగిందని అన్నారు.
ఎలాంటి సినిమాకైనా మ్యూజిక్ ఇవ్వగలను. పెద్ద కమర్షియల్ సినిమాకు కూడా అద్భుతమైన సంగీతాన్ని అందించగలనన్న ఆత్మ విశ్వాసాన్ని ఈ పదేళ్లలో సంపాదించుకున్నానని తెలిపారు.
తనకు కావాల్సింది సరైన అవకాశం మాత్రమేనని, అలాంటి అవకాశం కోసం ఎదురుచూస్తున్నానని అజయ్ అరసాడ పేర్కొన్నారు.
————————

Please tell us what is wrong. Your report will be sent to the website team.
