CM Revanth Reddy Cambridge University Hyderabad
ఆకేరు న్యూస్, డెస్క్: తెలంగాణ రాష్ట్రాన్ని అంతర్జాతీయ విద్యా, ఆవిష్కరణలు, పరిశోధనా కేంద్రంగా తీర్చిదిద్దే దిశగా ‘తెలంగాణ రైజింగ్’ (Telangana Rising) కీలక ముందడుగు వేసింది. ముఖ్యమంత్రి ఎ. రేవంత్‌రెడ్డి నేతృత్వంలోని ఉన్నతస్థాయి ప్రతినిధి బృందం లండన్‌లోని ప్రఖ్యాత కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయ విద్యావేత్తలతో శనివారం ఫలప్రదమైన సమావేశం నిర్వహించింది.
ఈ కీలక చర్చల్లో రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీ దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, సీఎం సలహాదారు కె. రామకృష్ణారావు, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేశ్ రంజన్ తదితరులు పాల్గొన్నారు. హైదరాబాద్ నగరంలో ప్రపంచ అత్యుత్తమ విశ్వవిద్యాలయాలు, పరిశోధన సంస్థలకు ఉన్న అవకాశాలు, మౌలిక వసతులను ఈ సందర్భంగా బృందం వివరించింది. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్న ప్రపంచస్థాయి విజ్ఞాన కేంద్రంలో భాగస్వాములు కావాలని కేంబ్రిడ్జ్ ప్రతినిధులను సీఎం రేవంత్‌రెడ్డి అధికారికంగా ఆహ్వానించారు.
ఈ ప్రతిపాదనలపై కేంబ్రిడ్జ్ జడ్జ్ బిజినెస్ స్కూల్‌కు చెందిన ప్రొఫెసర్ జైదీప్ ప్రభు, ప్రొఫెసర్ వెంకట సిరీష్ గండికోట సానుకూలంగా స్పందించారు. తెలంగాణతో కలిసి విద్యా, పరిశోధనా రంగాల్లో పనిచేసేందుకు వారు ఆసక్తి కనబరిచారు. హైదరాబాద్‌లో సంయుక్త విద్యారంగ కార్యక్రమాలు, ఉమ్మడి పరిశోధనలు (Joint Research), యువ పారిశ్రామికవేత్తల ప్రాజెక్టుల ఇంక్యుబేషన్, స్టార్టప్‌ల సమగ్ర అభివృద్ధికి పరస్పరం సహకరించుకోవాలని ఇరు వర్గాలు సూత్రప్రాయంగా అంగీకరించాయి. త్వరలోనే దీనికి సంబంధించి పక్కా కార్యాచరణ ప్రణాళికను (Action Plan) రూపొందించనున్నారు. కేంబ్రిడ్జ్ వంటి అంతర్జాతీయ విశ్వవిద్యాలయంతో ఏర్పడే భాగస్వామ్యం రాష్ట్ర యువతకు అంతర్జాతీయ స్థాయి నైపుణ్యాలను, సరికొత్త అవకాశాలను అందిస్తుందని భావిస్తున్నారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
