Professor Kasim Telangana Activists Recognition Demand
* ఉద్యమకారుల గుర్తింపు నిష్పక్షపాతంగా సాగాలి
* స్మారక స్తూపాలను జిల్లా కలెక్టరేట్ల వద్ద ఏర్పాటు చేయాలి
– ప్రొఫెసర్ కాసీం డిమాండ్
అకేరు న్యూస్ హన్మకొండ:
తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన ఉద్యమకారుల గుర్తింపు నిష్పక్షపాతంగా సాగాలి. విద్యార్థులు, ప్రజాసంఘాలు, సాంస్కృతిక సంస్థలు, అమరవీరుల కుటుంబాలకు న్యాయం జరిగేలా ప్రభుత్వం సమగ్ర విధానాన్ని రూపొందించాలని ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజీ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ కాసీం డిమాండ్ చేశారు. తెలంగాణ ప్రజా ఫ్రంట్ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో రాష్ట్ర అధ్యక్షుడు రాచమోని నాగభూషణం అధ్యక్షతన హన్మకొండ ప్రెస్‌క్లబ్‌లో తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపు, సంక్షేమంపై చర్చా వేదిక నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ప్రొఫెసర్ ఖాసీం మాట్లాడుతూ.. ఉద్యమకారుల గుర్తింపు ప్రక్రియ పారదర్శకంగా, నిష్పక్షపాతంగా సాగాలని సూచించారు. తెలంగాణ ఉద్యమంలో వివిధ దశల్లో పాల్గొన్న అన్ని వర్గాల ఉద్యమకారులను గుర్తించాలని, వారి పోరాట చరిత్రను అధికారికంగా నమోదు చేయాలని కోరారు. ఉద్యమకారుల గుర్తింపు కోసం ప్రభుత్వం చట్టబద్ధమైన కమిటీని ఏర్పాటు చేయడం స్వాగతించదగ్గ పరిణామం అన్నారు. అయితే గుర్తింపు కొంతమందికే పరిమితం కాకుండా ఉద్యమంలో చేసిన త్యాగాలు, అరెస్టులు, కేసులు, జైలు జీవితం, నిర్వహించిన పాత్ర తదితర అంశాలను పరిగణనలోకి తీసుకోవాలని ఆయన సూచించారు. అమరుల కుటుంబాల సంక్షేమం కోసం ప్రత్యేక బోర్డు ఏర్పాటు చేయాలని ప్రొఫెసర్ ఖాసీం డిమాండ్ చేశారు. ఉద్యమ సమయంలో రాజకీయ ఉద్యమాల నేపథ్యంలో నమోదైన కేసులను సమీక్షించి, అన్యాయంగా నమోదైన కేసులను ఎత్తివేసేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు.
* మావోయిస్ట్ కేసులు ఉన్నా తెలంగాణ ఉద్యమకారులుగా గుర్తించాలి
తెలంగాణ రాష్ట్ర సాధన కోసం జరిగిన ఉద్యమంలో తెలంగాణ జనసభ, తెలంగాణ ప్రజా ఫ్రంట్ క్రీయాశీలక భూమిక పోషించింది. తెలంగాణ కోసం పోరాడిన ఉద్యమకారుల సంక్షేమం, భద్రత కోసం ప్రత్యేక విధానం రూపొందించి అమలు చేయాలన్నారు. సూచించారు తెలంగాణ ఉద్యమంలోని తొలి, మలి, తుది దశల్లో వివిధ సంస్థలు నిర్వహించిన పోరాటాలను అధికారికంగా రికార్డు చేయాలని కోరారు. అమరవీరుల స్మారక స్థూపాలను జిల్లా కలెక్టర్ కార్యాలయాల వద్ద ఏర్పాటు చేసి ప్రతి సంవత్సరం అధికారికంగా నివాళులు అర్పించే విధానం తీసుకురావాలని సూచించారు. తెలంగాణ భాష, సంస్కృతి, సంప్రదాయాలను పరిరక్షిస్తూ తెలంగాణ అస్తిత్వానికి భంగం కలగకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఉద్యమకారులకు విద్య, ఉద్యోగాలు, ఆరోగ్యం తదితర రంగాల్లో ప్రత్యేక ప్రాధాన్యత కల్పించాలని కోరారు.
* ఉద్యమకారులకు 5 ఎకరాల భూమి ఇవ్వాలి
రాష్ట్ర ప్రభుత్వం అధీనంలో ఉన్న సుమారు 70 లక్షల ఎకరాల భూమిలో కొంత భాగాన్ని తెలంగాణ ఉద్యమకారుల సంక్షేమానికి వినియోగించాలని ఆయన కోరారు. ఉద్యమకారులకు 5 ఎకరాల భూమి, 500 గజాల ఇంటి స్థలం కేటాయించాలని డిమాండ్ చేశారు. అదే విదంగా ఉద్యమకారులు స్వయం ఉపాధి పొందేందుకు వ్యాపారాలు చేసుకునేలా ప్రభుత్వం రుణ సదుపాయం కల్పించాలని, వారి విద్యార్హతలకు అనుగుణంగా ప్రభుత్వ ఉద్యోగ అవకాశాలు కల్పించాలని సూచించారు. అలాగే ఉద్యమకారులకు జీవిత బీమా సౌకర్యం కల్పించాలని కోరారు. రైళ్లు, బస్సుల్లో తెలంగాణ ఉద్యమకారులకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాలని, స్వాతంత్య్ర సమరయోధులకు అందిస్తున్న తరహాలో తెలంగాణ ఉద్యమకారులకు కనీసం నెలకు రూ.10 వేల పెన్షన్ ఇవ్వాలని ప్రొఫెసర్ కాశిమ్ డిమాండ్ చేశారు.
ప్రజా ఫ్రంట్ ఆధ్వర్యంలో జరిగిన ఈ చర్చా వేదికలో పలువురు ఉద్యమకారులు, ప్రజా సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ప్రజా ఫ్రంట్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మంతెన సంజీవరావు, రాష్ట్ర కార్యదర్శులు గాండ్ల మల్లేశం, కావలి యాదయ్య, సత్తయ్య, శంకర ప్రభాకర్‌చారి, కిషన్ నాయక్, కడమంచి రాంబాబు, పాకల వెంకన్నతో పాటు వివిధ ప్రజా సంఘాల నాయకులు, ఉద్యమకారులు, అమరవీరుల బంధుమిత్రుల సంఘం ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.
——————————

Please tell us what is wrong. Your report will be sent to the website team.
