Telangana Auto Cab Strike
* తెలంగాణలో అర్ధరాత్రి నుంచి ఆటో, క్యాబ్, స్కూల్ వ్యాన్ల బంద్
అకేరు న్యూస్ హైదరాబాద్: తెలంగాణ వ్యాప్తంగా ఆటో, క్యాబ్, స్కూల్ వ్యాన్ల సేవలకు బ్రేక్ పడనుంది. ఈరోజు అర్ధరాత్రి నుంచి రాష్ట్రవ్యాప్తంగా బంద్ నిర్వహించనున్నట్లు 18 ఆటో, క్యాబ్ సంఘాలతో కూడిన జేఏసీ ప్రకటించింది. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ప్రభుత్వం అమలు చేయడం లేదని ఆరోపిస్తూ ఈ బంద్‌కు పిలుపునిచ్చినట్లు సంఘాల నేతలు తెలిపారు.
ఆర్టీసీలో ఈవీ ఆటోలను ప్రవేశపెట్టే ప్రతిపాదనను వెంటనే వెనక్కి తీసుకోవాలని జేఏసీ డిమాండ్ చేస్తోంది. అలాగే ఆటో డ్రైవర్లకు ఏటా రూ.12 వేల ఆర్థిక సాయం అందించాలని, ఆటో, ప్రైవేట్ రవాణా కార్మికుల కోసం ప్రత్యేక సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని కోరుతోంది.
మరోవైపు ఓలా, ఉబర్, ర్యాపిడో వంటి యాప్ ఆధారిత బైక్ సేవలపై నిషేధం విధించాలని సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. గిగ్ వర్కర్ల సమస్యలను పరిష్కరించేందుకు అగ్రిగేటర్ పాలసీని తెలంగాణలో అమలు చేయాలని కోరుతున్నాయి.
అదేవిధంగా ట్రాఫిక్ చలాన్లపై 80 శాతం సబ్సిడీ ఇవ్వాలని, రవాణా రంగ కార్మికుల సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని జేఏసీ డిమాండ్ చేస్తోంది.
బంద్ నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా ప్రజా రవాణాపై ప్రభావం పడే అవకాశం ఉంది. ముఖ్యంగా హైదరాబాద్ సహా ప్రధాన నగరాల్లో ఆటోలు, క్యాబ్‌లు, స్కూల్ వ్యాన్లు నిలిచిపోతే ప్రయాణికులు, విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది. ప్రభుత్వం తమ డిమాండ్లపై సానుకూలంగా స్పందించకపోతే ఆందోళనను మరింత ఉధృతం చేస్తామని సంఘాల నేతలు హెచ్చరించారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
