TGNPDCL Employee Performance Evaluation
* టీజీఎన్పీడీసీఎల్ కీలక నిర్ణయం
ఆకేరు న్యూస్ , హనుమకొండ : విద్యుత్ ఉద్యోగుల పనితీరును మరింత సమర్థవంతంగా అంచనా వేసేందుకు టీజీఎన్పీడీసీఎల్ కీలక చర్యలు చేపట్టింది. ఇకపై ఉద్యోగుల పనితీరును 100 మార్కుల విధానంలో మూల్యాంకనం చేయనుంది. మెరుగైన పనితీరు కనబరిచే వారికి ప్రోత్సాహం ఇవ్వడంతో పాటు నాణ్యతా ప్రమాణాల్లో లోపాలు కనిపిస్తే చర్యలు తీసుకునేలా వ్యవస్థను రూపొందిస్తోంది.
హైదరాబాద్ నుంచి ఇంధన శాఖ ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి నవీన్ మిట్టల్ శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. హనుమకొండ నక్కలగుట్టలోని టీజీఎన్పీడీసీఎల్ ప్రధాన కార్యాలయంలో సీఎండీ కర్నాటి వరుణ్‌రెడ్డి అధ్యక్షతన డైరెక్టర్లు, చీఫ్ ఇంజినీర్లు, చీఫ్ జనరల్ మేనేజర్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సంస్థ పనితీరుపై సీఎండీ పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు.

* ఏ అంశాలకు మార్కులు?
సెక్షన్ల పనితీరును పారదర్శకంగా కొలిచేందుకు 100 మార్కుల ఆధారిత పనితీరు నిర్వహణ వ్యవస్థను అమలు చేస్తున్నట్లు సీఎండీ తెలిపారు. ఇందులో కొత్త విద్యుత్ సర్వీసుల విడుదల, రెవెన్యూ వసూళ్లు, పెండింగ్ వర్క్ ఆర్డర్ల పరిష్కారం, ట్రాన్స్ఫార్మర్ వైఫల్యాల నియంత్రణ, ట్రాన్స్ఫార్మర్ నిర్వహణ, ఎనర్జీ ఆడిట్ నష్టాల తగ్గింపు వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుంటారు.
అలాగే విద్యుత్ చౌర్యం, అక్రమ వినియోగానికి సంబంధించిన తనిఖీలు, వినియోగదారుల ఫిర్యాదుల పరిష్కారం, కాలిపోయిన లేదా పనిచేయని మీటర్ల మార్పిడి, బిల్-స్టాప్ తనిఖీలు తదితర అంశాల ఆధారంగా మార్కులు కేటాయిస్తారు.
* గత నెలతో పోల్చి అదనపు మార్కులు
ఈ విధానంలో మరో ప్రత్యేకత కూడా ఉంది. ప్రస్తుత పనితీరుతో పాటు గత నెలతో పోలిస్తే ఎంత పురోగతి సాధించారనే అంశానికి కూడా అదనపు మార్కులు కేటాయించనున్నారు. దీంతో వెనుకబడిన సెక్షన్లు సైతం క్రమంగా తమ పనితీరును మెరుగుపరుచుకునే అవకాశం ఉంటుందని అధికారులు తెలిపారు.
ఉద్యోగులు తమ ర్యాంకు, స్కోర్, గ్రేడ్‌తో పాటు ఏ అంశంలో మార్కులు తగ్గాయో తెలుసుకునేలా ప్రత్యేక పనితీరు మూల్యాంకన డ్యాష్‌బోర్డ్ అందుబాటులో ఉంచుతున్నారు. దీని ద్వారా బలహీనంగా ఉన్న అంశాలను గుర్తించి వాటిపై ప్రత్యేక దృష్టి పెట్టే అవకాశం కల్పిస్తున్నారు.
* నైపుణ్యాభివృద్ధిపై ప్రత్యేక దృష్టి
ఉద్యోగులను ఆధునిక సాంకేతిక అవసరాలకు అనుగుణంగా తీర్చిదిద్దేందుకు మాస్టర్ ట్రైనర్ల శిక్షణా కార్యక్రమాలకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు టీజీఎన్పీడీసీఎల్ తెలిపింది. అకౌంట్స్, రెవెన్యూ, టెక్నికల్, ఆపరేషన్, మెయింటెనెన్స్, సేఫ్టీ, స్టోర్స్, కమర్షియల్, బెస్ట్ ప్రాక్టీసెస్, జనరల్ అడ్మినిస్ట్రేషన్, సివిల్ విభాగాల్లో శిక్షణ కార్యక్రమాలను రూపొందించారు.
* పనుల నాణ్యతపై నిఘా
క్షేత్రస్థాయిలో చేపట్టే విద్యుత్ పనుల నాణ్యతను క్వాలిటీ కంట్రోల్ విభాగం నిరంతరం తనిఖీ చేయనుంది. ఎర్తింగ్, జంపర్ బైండింగ్, ఫ్యూజ్ వైర్ తదితర పునరావృత లోపాలను తగ్గించేందుకు కామన్ ఫీల్డ్ చెక్‌లిస్ట్ విధానాన్ని అమలు చేయాలని సీఎండీ ప్రతిపాదించారు.
ఈ సందర్భంగా నవీన్ మిట్టల్ మాట్లాడుతూ.. ఉద్యోగుల పనితీరు, క్షేత్రస్థాయి పనుల నాణ్యత, సాంకేతిక పరిజ్ఞానం వినియోగం, వినియోగదారులకు పారదర్శక సేవలు, ఉద్యోగుల నైపుణ్యాభివృద్ధి అంశాలను సమన్వయం చేస్తూ విద్యుత్ పంపిణీ వ్యవస్థను మరింత సమర్థవంతంగా తీర్చిదిద్దుతున్నామని తెలిపారు. సాంకేతికంగా నైపుణ్యం కలిగిన మానవ వనరులను తయారు చేయడం ద్వారా వినియోగదారులకు మెరుగైన విద్యుత్ సేవలు అందించవచ్చని స్పష్టం చేశారు.


Please tell us what is wrong. Your report will be sent to the website team.
