* మెజారిటీ ఎమ్మెల్యేలను చేర్చుకునేందుకు మంతనాలు
* అసెంబ్లీ ఎన్నికల్లో ప్రాధాన్యం శూన్యం
* ఫిరాయింపుల ద్వారా పటిష్టకు ప్లాన్
* ఇప్పటికే పార్టీలో చేరిన ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం
* తాజాగా కాంగ్రెస్ లోకి ప్రకాష్‌గౌడ్
* నేడు మరో బీఆర్ ఎస్ ఎమ్మెల్యే
* క్యూలో మరో ఐదుగురు..
ఆకేరు న్యూస్, హైదరాబాద్ :
అసెంబ్లీ ఎన్నిక (Assembly election) ల్లో రాష్ట్రవ్యాప్తంగా సత్తాచాటి అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్ పార్టీ (Congress Party). కానీ.. రాష్ట్రానికి గుండెకాయలాంటి గ్రేటర్ హైదరాబాద్ (Greater Hyderabad) లో మాత్రం కనీసం ఒక్కసీటు కూడా గెలుచుకోలేకపోయింది. చెప్పుకోవడానికి ఒక్క అధికార పార్టీ ఎమ్మెల్యే కూడా లేకుండా పోయారు. ఆ వెలితిని పూడ్చుకోవడానికి ఆపరేషన్ ఆకర్ష్ (Operation Akersh) కు తెరలేపింది. రాష్ట్రవ్యాప్తంగా ఆపరేషన్ ఆకర్ష్‌ను జోరుగా కొనసాగిస్తున్న కాంగ్రెస్ పార్టీ.. ఇప్పుడు గ్రేటర్ హైదరాబాద్‌పై ఫోకస్ పెట్టింది. ఒకరి తర్వాత మరొకరిని కాంగ్రెస్‌లో చేర్చుకుంటోంది.
అప్పుడు వేచి చూసి.. ఇప్పుడు ద్వారాలు తెరిచి..
లోక్‌సభ ఎన్నిక (Lok Sabha election) లకు ముందే జీహెచ్ఎంసీ (GHMC) కి చెందిన కొందరు ఎమ్మెల్యేలు అధికార పార్టీలో చేరేందుకు ఉత్సాహం చూపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ని కూడా కలిశారు. అయితే, వ్యూహాత్మకంగా వ్యవహరించిన రేవంత్ వారిని వేచి ఉండమన్నట్లు తెలిసింది. చేరికల ద్వారా ఆయా నియోజకవర్గాల్లో అసంతృప్త జ్వాలలు వెల్లడైతే ఎన్నికల ఫలితాలపై ప్రభావం పడుతుందని భావించారు. సికింద్రాబాద్ (Secunderabad) లోక్‌సభ నుంచి పోటీచేసేందుకు దీటైన అభ్యర్థి లేకపోవడంతో తప్పనిస్థితిలో ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ (Khairatabad MLA Dana Nagender) ను పార్టీలోకి చేర్చుకున్నారు. సికింద్రాబాద్ లోక్‌సభ స్థానంలో నిలబెట్టారు. ఎన్నికల ముగిసిన నాటి నుంచీ కాంగ్రెస్ పార్టీ ద్వారాలు తెరిచింది. బీఆర్ ఎస్(BRS) నుంచి ఎవరు వస్తామన్న వెల్కమ్ చెబుతోంది. దీనిలోభాగంగా గ్రేటర్ లోని బీఆర్ ఎస్ ఎమ్మెల్యేల (BRS MLAs) కు సీఎం రేవంత్ షేక్ హ్యాండ్ ఇస్తున్నారు.
అందరిపైనా దృష్టి
నగరం, శివార్లలోని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలందరినీ తమ గూటికి తెచ్చుకునేందుకు కాంగ్రెస్ (Congress) ప్రయత్నాలు చేస్తోంది. ఇప్పటికే ఆ ప్రయత్నాలు దాదాపు కొలిక్కి వచ్చాయి. నగర శివార్లలోని ఆరుగురు ఎమ్మెల్యేలు (Six MLAs) అధికార కాంగ్రెస్‌లోచేరడం దాదాపు ఖాయమైందని తెలుస్తోంది. అయితే దశల వారీగా ఈ చేరికలు జరగనున్నాయి. దీనిలో భాగంగా రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాశ్‌గౌడ్ (Prakash Goud) తన అనుచరులతో కలిసి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. ఆయనతో పాటు ఇద్దరు మున్సిపల్ చైర్మన్లు (Municipal chairmens), మరికొందరు అనుచరులు కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. గతంలోనే ఆయన కాంగ్రెస్ లో చేరతారని ప్రచారం జరిగింది. వెంటనే కేటీఆర్ (KTR) వెళ్లి ప్రకాశ్‌గౌడ్ తో సమావేశం కూడా అయ్యారు. ఆ తర్వాత నిర్ణయం మార్చుకున్నట్లు తెలిపారు. ఇప్పుడు కాంగ్రెస్ లో చేరిపోయారు.
నేడు మరో ఎమ్మెల్యే..
బీఆర్ ఎస్‌కు చెందిన శేరిలింగంపల్లి ఎమ్మెల్యే (Serilingampally MLA) ఆరెకపూడి గాంధీ (Arekapudi Gandhi) కూడా నేడు కాంగ్రెస్‌లో చేరనున్నారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సమక్షంలో పలువురు కార్పొరేటర్లు (Corporators), అనుచరులతో కలిసి శనివారం పార్టీ తీర్థం పుచ్చుకోనున్నారు. ఈమేరకు ఆయన శుక్రవారం అనుచరులు, ముఖ్యనాయకులు, కార్పొరేటర్లతో సమావేశమయ్యారు. శేరిలింగంపల్లి నుంచి మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన గాంధీ 2014లో టీడీపీ అభ్యర్థిగా (TDP Candidate) పోటీ చేసి 79వేలకు పైగా మెజార్టీతో గెలుపొందారు. అనంతరం బీఆర్ఎస్ అధికారంలోకి రావడంతో బీఆర్ఎస్లో చేరి 2018లో ఎమ్మెల్యేగా గెలుపొందారు. మూడోసారి 2024 ఎన్నికల్లో ఆయన కాంగ్రెస్ అభ్యర్థి జగదీశ్వర్‌గౌడ్ (Jagdeeshwar Gowd) పై గెలుపొందారు.
రేపు మరో ఇద్దరు..?
మంగళవారం మరో ఇద్దరు ఎమ్మెల్యేలు (Two MLAs) చేరనున్నట్లు సమాచారం. ఇప్పటికే ఉమ్మడి రంగారెడ్డి జిల్లా (Ranga Reddy District) నుంచి ఒక ఎమ్మెల్యే బీఆర్ఎస్ను వీడగా మిగతా వారు కూడా కాంగ్రెస్ వైపు చూస్తున్నట్లు కొంతకాలంగా ప్రచారం సాగుతోంది. ఇటీవల చేవెళ్ల ఎమ్మెల్యే యాదయ్య (Chevella MLA Yadaiah) అధికార పార్టీలో చేరారు. మిగతా వారు కూడా ఆయన బాటలోనే నడిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో బీఆర్ఎస్ 10 అసెంబ్లీ సీట్లు కైవసం చేసుకోగా వీరిలో ఒకరిద్దరు మినహా మిగతా వారంతా కాంగ్రెస్‌లో చేరేందుకు ఆసక్తి చూపుతున్నట్లు కొద్ది రోజులుగా ప్రచారం సాగుతోంది. అలాగే, జీహెచ్ఎంసీ పరిధిలోని 24 నియోజకవర్గాల (24 Constituencies) ఎమ్మెల్యేల్లో మెజార్టీ సభ్యులు అధికార పార్టీతో టచ్‌లో ఉన్నట్లు తెలిసింది. బీఆర్ ఎస్ లో నలుగురు తప్ప అందరూ కాంగ్రెస్‌లోకి వస్తున్నారని దానం నాగేందర్ (Dana Nagender) తాజాగా తెలిపారు. తాను పదిమందితో మాట్లాడినట్లు వివరించారు.
—————————-