Mulugu Gurukul School Inspection
* ప్రణాళికాబద్ధమైన బోధనతో ఉత్తమ ఫలితాలు సాధించేందుకు కృషి చేయాలి
– జిల్లా కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావు
ఆకేరు న్యూస్,ములుగు:
ప్రణాళికాబద్ధమైన బోధనతో విద్యార్థినులు ఉత్తమ ఫలితాలు సాధించేలా ఉపాధ్యాయులు కృషి చేయాలని, ఉన్నత లక్ష్యాలను చేరుకునేలా తీర్చిదిద్దాలని జిల్లా కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావు సూచించారు.
శనివారం ములుగు జిల్లా కేంద్రంలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల పాఠశాల, జూనియర్ కళాశాలను కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాల, కళాశాలలోని నిఘా కెమెరాల పనితీరు, విద్యార్థినులు, ఉపాధ్యాయులు, సిబ్బంది హాజరు శాతాన్ని పరిశీలించారు. ఉపాధ్యాయులు, సిబ్బంది వివరాలను అడిగి తెలుసుకున్న అనంతరం తరగతి గదులను సందర్శించి బోధన తీరును పరిశీలించారు. విద్యార్థినులకు నిర్వహిస్తున్న యూనిట్ పరీక్షల తీరును పరిశీలించి, పరీక్షల నిర్వహణపై సంబంధిత ఉపాధ్యాయులకు పలు సూచనలు చేశారు.
విద్యార్థినులకు నిర్ణీత ఆహార పట్టిక ప్రకారం నాణ్యమైన, పౌష్టికమైన భోజనం అందించాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. శనివారం ఆహార పట్టిక ప్రకారం అందించాల్సిన భోజన పదార్థాల వివరాలను క్షుణ్ణంగా పరిశీలించారు.
విద్యార్థినులకు అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పించాలని, విద్యాభ్యాసం, ఆరోగ్యం, భద్రతపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. ఉపాధ్యాయులు, సమయపాలన పాటించాలని తెలిపారు.
ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపల్ స్వాతి, రికార్డు అసిస్టెంట్ రాజు, సంబంధిత అధికారులు, విద్యార్థినులు, తదితరులు పాల్గొన్నారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
