MP Kadiyam Kavya & MLA Kadiyam Srihari Kanakadurga Colony Model Park
* ఆధునిక హంగులతో కనకదుర్గకాలనీలోని పార్కు అభివృద్ధికి ప్రణాళిక
* ఎంపీ కడియం కావ్య, ఎమ్మెల్యే కడియం శ్రీహరి
* వాకింగ్ ట్రాక్, ఓపెన్ జిమ్, లైటింగ్ పరిశీలన
ఆకేరు న్యూస్, హనుమకొండ : కనకదుర్గ కాలనీలోని జీడబ్ల్యూఎంసీ పార్కును ఆధునిక సౌకర్యాలతో అభివృద్ధి చేసి మోడల్ పార్కుగా తీర్చిదిద్దేందుకు చర్యలు చేపడతామని వరంగల్ ఎంపీ కడియం కావ్య, స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి తెలిపారు. ఆదివారం కనకదుర్గ కాలనీలోని జీడబ్ల్యూఎంసీ పార్కు, కమ్యూనిటీ సెంటర్‌ను వారు సందర్శించారు. ఈ సందర్భంగా పార్కులోని వాకింగ్ ట్రాక్, ఓపెన్ జిమ్, లైటింగ్, మొక్కల నిర్వహణ తదితర అంశాలను పరిశీలించారు. పార్కుకు వచ్చిన వాకర్లు, స్థానికులతో మాట్లాడి అక్కడి సమస్యలు, అవసరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎంపీ , ఎమ్మెల్యే మాట్లాడారు. పార్కును మరింత ఆకర్షణీయంగా, ప్రజలకు ఉపయోగపడేలా అభివృద్ధి చేయాలని జీడబ్ల్యూఎంసీ అధికారులకు సూచించారు. ముఖ్యంగా వర్షాకాలంలో వాకింగ్ ట్రాక్‌పై నీరు నిలిచిపోకుండా శాశ్వత పరిష్కారం చూపాలని ఆదేశించారు. చిన్నారుల కోసం ప్రత్యేక ఆటస్థలాన్ని ఏర్పాటు చేసి, వారి వయస్సుకు అనుగుణంగా వివిధ ఆట పరికరాలను అందుబాటులో ఉంచాలని సూచించారు. పిల్లలకు సురక్షితమైన, ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించడంతో పాటు కుటుంబాలు సైతం పార్కుకు వచ్చేలా అవసరమైన సౌకర్యాలు అభివృద్ధి చేయాలని తెలిపారు. అలాగే వరంగల్ చారిత్రక నేపథ్యాన్ని ప్రతిబింబించేలా పార్కు గోడలపై కాకతీయ కళా వైభవం, చారిత్రక కట్టడాలు, సంస్కృతి ఉట్టిపడేలా ఆకర్షణీయమైన చిత్రాలను రూపొందించాలని సూచించారు. దీంతో పార్కు అందం పెరగడమే కాకుండా, నగర చరిత్ర, సంస్కృతిని ప్రజలకు పరిచయం చేసే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. వృద్ధులు, మహిళలు, యువతకు ఉపయోగపడేలా ధ్యానం కోసం ప్రత్యేక హాల్ ఏర్పాటు చేయాలని, ఓపెన్ జిమ్ పరికరాలను మెరుగుపరచాలని సూచించారు. సాయంత్రం పార్కుకు వచ్చే వారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా లైటింగ్ వ్యవస్థను పటిష్టం చేయాలని తెలిపారు. పార్కు భద్రత కోసం సోలార్ ఫెన్సింగ్ ఏర్పాటు పైనా అధికారులు దృష్టి సారించాలని సూచించారు. పార్కు అభివృద్ధికి అవసరమైన నిధుల సమీకరణ కోసం సంబంధిత అధికారులతో సమన్వయం చేసుకుంటామని, అవసరమైతే తమ వంతు సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. కనకదుర్గ కాలనీ ప్రజలకు మెరుగైన పచ్చదనం, ఆరోగ్యం, వినోద సౌకర్యాలు అందించడమే లక్ష్యంగా పార్కును అభివృద్ధి చేస్తామని ఎంపీ, ఎమ్మెల్యే పేర్కొన్నారు. కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ గుజ్జుల వసంత, జీడబ్ల్యూఎంసీ అదనపు కమిషనర్, మున్సిపల్ అధికారులు, స్థానిక వాకర్స్ అసోసియేషన్ సభ్యులు, రిటైర్డ్ ఉద్యోగులు, స్థానిక ప్రజాప్రతినిధులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
