Mancherial Mother Daughter Suicide
* ఇద్దరూ మృతి
* మంచిర్యాల జిల్లాలో ఘటన
ఆకేరు న్యూస్, మంచిర్యాల : కష్టం ఎవరికి ఏ రూపంలో వస్తుందో తెలియదు.. వచ్చిన కష్టాన్ని ఎలా ఎదుర్కోవాలో తెలియక దాని నుంచి బయటపడే దారి కానరాక ఓ తల్లి కఠిన నిర్ణయం తీసుకుంది. మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం లింగాపూర్ గ్రామంలో కుటుంబ కలహాల కారణంగా ఓ తల్లి తన 6 ఏళ్ల కుమార్తెను నడుముకు కట్టుకుని వ్యవసాయ బావిలో దూకి ఆత్మహత్య చేసుకుంది. ఈ విషాద ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. లింగాపూర్‌కు చెందిన రజిత(28)కు జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం ఎనుగుమట్ల గ్రామానికి చెందిన మెరుగు అంజన్నతో ఏడేళ్ల క్రితం వివాహమైంది. వీరికి కుమార్తె అక్షిత(6)తో పాటు 18 నెలల కుమారుడు ఉన్నాడు. దంపతుల మధ్య తరచూ మనస్పర్థలు, గొడవలు జరుగుతుండడంతో రజిత నాలుగేళ్లుగా పిల్లలతో సహా లింగాపూర్‌లోని తన పుట్టింట్లోనే ఉంటోంది. ఆటో నడుపుకునే భర్త అంజన్న అప్పుడప్పుడు వచ్చి తన పిల్లలను చూసి వెళ్తుండేవాడు. ఆదివారం ఉదయం లింగాపూర్‌కు వచ్చిన భర్త అంజన్నతో రజితకు గొడవ జరిగింది. భర్తతో గొడవపడి తీవ్ర మనస్తాపానికి గురైన రజిత, సాయంత్రం వేళ తన కూతురు అక్షితను నడుముకు చీరతో కట్టుకుని గ్రామ శివారులోని వ్యవసాయ బావి వద్దకు వెళ్లి అందులోకి దూకింది. అటుగా వెళ్తున్న స్థానికులు బావిలో తేలిన తల్లీకూతుళ్ల మృతదేహాలను చూసి కుటుంబీకులకు సమాచారం ఇచ్చారు. ఈ విషయం తెలుసుకున్న దండేపల్లి ఎస్సై రాజవర్ధన్ ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను బావి నుంచి బయటకు తీయించి, పోస్టుమార్టం కోసం ఆసుపత్రికి తరలించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
