AIG Hospital Visakhapatnam
* రూ.2 వేల కోట్ల మెగా హెల్త్ హబ్
* ఎండాడలోని 9 ఎకరాల్లో క్యాంపస్ నిర్మాణం
* నేడు ఏఐజీ ఆస్పత్రికి లోకేష్ శంకుస్థాపన
* 9 వేల మందికి ఉపాధి అవకాశాలు
ఆకేరు న్యూస్, విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విశాఖపట్నంలో 1000 పడకల ఆస్పత్రి నిర్మించనున్నారు. ఏపీలో అత్యాధునిక వైద్య సేవలు, వైద్య విద్య, పరిశోధనలను ఒకే వేదిక పైకి తీసుకురావాలనే లక్ష్యంతో విశాఖలో ప్రతిష్టాత్మక ఏఐజీ హాస్పిటల్స్ హెల్త్ క్యాంపస్ ఏర్పాటు కానుంది. ఈ భారీ ప్రాజెక్టుకు రాష్ట్ర విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ నేడు శంకుస్థాపన చేయనున్నారు. విశాఖలోని ఎండాడ ప్రాంతంలో ఈ క్యాంపస్‌ను నిర్మించనున్నారు. ఏఐజీ హాస్పిటల్స్ ఈ ప్రాజెక్టుపై వచ్చే ఐదేళ్లలో దశలవారీగా రూ.2 వేల కోట్ల పెట్టుబడి పెట్టనుంది. మొత్తం 9 ఎకరాల విస్తీర్ణంలో 1000 పడకల సామర్థ్యంతో అత్యాధునిక ఆస్పత్రి క్యాంపస్ నిర్మించనున్నారు. పూర్తి స్థాయిలో అందుబాటులోకి వచ్చిన తర్వాత రోజుకు సుమారు 5 వేల మంది ఔట్‌పేషెంట్లకు సేవలందించేలా ఆస్పత్రిని రూపొందిస్తున్నారు. ఈ ప్రాజెక్టులో తొలి దశ అత్యంత కీలకంగా ఉండనుంది. టవర్-ఏ, టవర్-బిలను కలిపి 650 పడకల సామర్థ్యంతో నిర్మించి, 2028 అక్టోబర్ నాటికి తొలి దశను పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. రెండో దశలో మరో 350 పడకలతో టవర్-సి నిర్మించి, ఆస్పత్రి మొత్తం సామర్థ్యాన్ని 1000 పడకలకు పెంచనున్నారు. కేవలం ఆస్పత్రిగానే కాకుండా వైద్యం, వైద్య విద్య, శిక్షణ, పరిశోధనలకు కేంద్రంగా ఈ క్యాంపస్‌ను అభివృద్ధి చేయనున్నారు. 50కి పైగా వైద్య ప్రత్యేక విభాగాలు, పరిశోధనా ప్రయోగశాలలు, అధునాతన వైద్య సాంకేతిక సేవలు ఇందులో అందుబాటులో ఉండనున్నాయి. పక్కనే 2.5 ఎకరాల్లో నర్సింగ్ కళాశాలను కూడా ఏర్పాటు చేయనున్నారు. ఈ భారీ హెల్త్‌కేర్ ప్రాజెక్టు ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా దాదాపు 9 వేల మందికి ఉపాధి అవకాశాలు లభించే అవకాశం ఉంది. ఉత్తరాంధ్రతో పాటు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు అత్యాధునిక సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు మరింత చేరువ కావడంతో పాటు, విశాఖను వైద్య సేవలు మరియు పరిశోధన రంగంలో కీలక కేంద్రంగా తీర్చిదిద్దే దిశగా ఈ ప్రాజెక్టు ముందడుగుగా భావిస్తున్నారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
