Chief Sharmila, Veligonda Project YSR
* 10 శాతం పనులే చేసిన చంద్రబాబు
* ఇది ఆయన విజన్‌గా చెప్పడం పెద్ద జోక్
* శిలాఫలకం వేయడం తప్ప వారు చేసిందేమి లేదు..
– కాంగ్రెస్ ఏపీ చీఫ్ షర్మిల
ఆకేరు న్యూస్, అమరావతి : “వెలిగొండ” క్రెడిట్ వైఎస్ఆర్దే నని కాంగ్రెస్ ఆంధ్రప్రదేశ్ చీఫ్ షర్మిల అన్నారు. ఈ ప్రాజెక్టు మొదటి దశ ప్రారంభోత్సవం సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు. 3 దశాబ్దాల కల వెలిగొండ ప్రాజెక్టు మొదటి దశ అందుబాటులోకి రావడం శుభ సూచకమన్నారు. తీవ్ర కరువు కోరల్లో చిక్కుకున్న ప్రకాశం, నెల్లూరు, కడప జిల్లాలకు సాగు, తాగునీరందుతుండడం హర్షణీయమన్నారు. అయితే, ఈ ప్రాజెక్టు సాకారానికి రూపశిల్పి దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి అని అన్నారు. వైఎస్సార్ నాటి ‘జలయజ్ఞం’ ఫలితంగానే నేడు 4.5 లక్షల ఎకరాలకు సాగునీరు, 23 లక్షల మందికి తాగునీరు లభిస్తున్నాయని, చంద్రబాబు మాత్రం 10 శాతం పనులు చేసి ప్రాజెక్టును తన విజన్‌గా ప్రచారం చేసుకోవడం ఈ శతాబ్దపు అతిపెద్ద జోక్ అని షర్మిల విమర్శించారు. 1996లో నాటి సీఎం చంద్రబాబు నాయుడు శంకుస్థాపన పేరుతో కేవలం ఒక రాయి మాత్రమే వేశారని, తొమ్మిదేళ్ల పాలనలో నిధులు ఇవ్వకుండా, అనుమతులు తేల్చకుండా, డీపీఆర్‌ల ముసుగులో కాలయాపన చేశారని కాంగ్రెస్ ఆరోపించింది. శిలాఫలకం తప్ప ఆయన హయాంలో తట్టెడు మట్టి కూడా ఎత్తలేదని ధ్వజమెత్తింది. 2004లో అధికారంలోకి వచ్చాక చిన్న ప్రాజెక్టుగా ఉన్న వెలిగొండను భారీ ప్రాజెక్టుగా రీ-డిజైన్ చేసి, కాగితాల నుంచి క్షేత్రస్థాయికి తెచ్చిన ఘనత పూర్తిగా వైఎస్సార్‌దేనని కొనియాడింది. వెలిగొండ ప్రాజెక్టు పనులను 82 శాతం పూర్తి చేసింది నాటి వైఎస్పార్ ప్రభుత్వమేనని అన్నారు. జలయజ్ఞం కింద రూ.4 వేల కోట్లు ఖర్చు చేసి సింహభాగం పనులు పూర్తి చేశారన్నారు. గొట్టిపాడు, సుంకేసుల డ్యాముల నిర్మాణం కోసం భూసేకరణ పూర్తి చేసి, బాధితులకు వైఎస్సార్ పరిహారం అందించారు. వెలిగొండకు వైఎస్ఆర్ వెలుగైతే.. చంద్రబాబు చీకటి అని అభివర్ణించిన కాంగ్రెస్ పార్టీ, శంకుస్థాపన ఎవరిదైనా ప్రాజెక్ట్‌ను సాకారం చేసింది మాత్రం కాంగ్రెస్ ప్రభుత్వమేనని స్పష్టం చేసింది. ఇకనైనా రాజకీయ ప్రచారాలు పక్కన పెట్టి, ప్రాజెక్టు రెండో దశ పనులను నిబద్ధతతో పూర్తి చేయాలని డిమాండ్ చేసింది. ముంపు గ్రామాల బాధితులకు పూర్తిస్థాయి పునరావాసం కల్పించడంపై ప్రభుత్వం తక్షణమే దృష్టి సారించాలని ఏపీ కాంగ్రెస్ విజ్ఞప్తి చేసింది.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
