Minister Seethakka, Shireesha Family Assistance
* శిరీష కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుంది
* ఫాస్ట్‌ట్రాక్ కోర్టు ద్వారా నిందితుడికి కఠిన శిక్ష పడేలా చర్యలు
* తక్షణ సహాయంగా రూ.5 లక్షలు ఇస్తాం..
* ఇందిరమ్మ ఇల్లు, వారి జీవనోపాధి తదితర విషయాల్లోనూ సాయం
* పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళా, శిశు సంక్షేమ శాఖల మంత్రి ధనసరి సీతక్క
* చౌటిగూడెంలో బాధిత కుటుంబానికి పరామర్శ
ఆకేరు న్యూస్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : ఆదివాసీ బిడ్డపై హత్యాచారం తనను కలచివేసిందని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళా, శిశు సంక్షేమ శాఖల మంత్రి ధనసరి అనసూయ సీతక్క అన్నారు. తుక్కుగూడలో అఘాయిత్యానికి గురైన నర్సు ఉకే శిరీష కుటుంబాన్ని ఆమె మంగళవారం పరామర్శించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, ములకలపల్లి మండలం చౌటిగూడెంలోని శిరీష ఇంటికి మంత్రి సీతక్క స్థానిక ఎమ్మెల్యే జారే ఆదినారాయణ, రాష్ట్ర మహిళా కమిషన్ సభ్యురాలు నునావత్ రాధాబాయితో కలిసి వెళ్లారు. శిరీష తల్లితో పాటు కుటుంబ సభ్యులను కలిసి ఓదార్చారు. శిరీష చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ ఘటన తెలిసిన వెంటనే పోలీస్ అధికారులు, డీజీపీతో మాట్లాడి దర్యాప్తు పురోగతిని పర్యవేక్షించామని తెలిపారు. నిందితుడిని వెంటనే గుర్తించి అరెస్టు చేయడంలో పోలీసులు వేగంగా స్పందించారని పేర్కొన్నారు. నిందితుడికి ఫాస్ట్‌ట్రాక్ కోర్టు ద్వారా కఠిన శిక్ష పడేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని మంత్రి స్పష్టం చేశారు. శిరీష కుటుంబానికి అన్ని విధాలా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు తానే శిరీష కుటుంబాన్ని పరామర్శించేందుకు వచ్చానని మంత్రి తెలిపారు. నిరుపేద ఆదివాసీ కుటుంబానికి చెందిన శిరీష తన కాళ్లపై తాను నిలబడాలనే ఆశయంతో చదువుకుని నర్సుగా ఉద్యోగం చేస్తోందని మంత్రి అన్నారు. కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకోవాలనే ఆశతో హైదరాబాద్‌కు వచ్చి ఉద్యోగం చేస్తున్న యువతి ఇలాంటి దారుణ ఘటనకు బలి కావడం అత్యంత బాధాకరమన్నారు. “బంగారు భవిష్యత్ ఉన్న బిడ్డ.. జీవితంలో ఎదగాలనే లక్ష్యంతో ముందుకు వెళ్తున్న సమయంలో ఓ దుర్మార్గుడి చేతిలో ప్రాణాలు కోల్పోవడం జీర్ణించుకోలేకపోతున్నాం” అని మంత్రి అన్నారు. బాధిత కుటుంబానికి తక్షణ సహాయంగా ప్రభుత్వం తరఫున రూ.5 లక్షల చెక్కును అందజేస్తామని తెలిపారు. మహిళా, శిశు సంక్షేమ శాఖ నుంచి రూ.1 లక్ష, ఐటీడీఏ నుంచి రూ.30 వేల సహాయంతో పాటు, తాను, స్థానిక ఎమ్మెల్యే జారే ఆదినారాయణ వ్యక్తిగతంగా రూ.1 లక్ష చొప్పున ఆర్థిక సహాయం అందించినట్లు తెలిపారు. కుటుంబ సభ్యులు కోరిన ఇందిరమ్మ ఇల్లు, జీవనోపాధి కోసం సాగు భూమి, అవుట్సోర్సింగ్ ఉద్యోగం అంశాలపై ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తుందని హామీ ఇచ్చారు. ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం కింద బాధిత కుటుంబానికి అందాల్సిన పరిహారాన్ని కూడా నిబంధనల ప్రకారం అందించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. భవిష్యత్‌లో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా అవసరమైన రక్షణ చర్యలను తీసుకుంటామని చెప్పారు. పట్టణాల్లో పని చేస్తున్న ఆదివాసీ యువతులు సహాయం పొందేందుకు ప్రత్యేక కాల్ సెంటర్ ఏర్పాటు చేసే అంశాన్ని పరిశీలిస్తామని తెలిపారు. మంత్రి సీతక్క వెంట స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు ఉన్నారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
