Warangal Collector Satya Sharada 22A Lands
* ప్రజలకు మెరుగైన సేవలందించాలి
* వరంగల్ జిల్లా కలెక్టర్ సత్యశారద
* రెవెన్యూ అధికారులతో సమీక్ష
* సర్, 22ఏ భూములు, అట్రాసిటీ కేసులపై చర్చ
ఆకేరు న్యూస్, వరంగల్ జిల్లా : ప్రతి మండలంలో నిర్ణీత లక్ష్యాలకు అనుగుణంగా క్షేత్రస్థాయిలో సిబ్బంది సమన్వయంతో పని చేయాలని వరంగల్ జిల్లా కలెక్టర్ సత్యశారద సూచించారు. జిల్లాలో ప్రభుత్వ ప్రాధాన్య కార్యక్రమాల అమలును మరింత వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. ఎసఐఆర్, సెన్సెస్, 22ఏ భూముల సమస్యలు, అట్రాసిటీ కేసులకు సంబంధించిన అంశాలపై తహసీల్దార్లు, సర్వేయర్లు, సంబంధిత రెవెన్యూ అధికారులతో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. జిల్లాలో చేపడుతున్న ఎసఐఆర్ పురోగతి, క్షేత్రస్థాయిలో ఎదురవుతున్న సమస్యలు, పెండింగ్ అంశాలపై అధికారులతో కలెక్టర్ చర్చించారు. అలాగే సెన్సెస్కు సంబంధించిన కార్యక్రమాల అమలు, సమాచార సేకరణ, అధికారుల బాధ్యతలపై సమీక్షించారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా నిబంధనలకు అనుగుణంగా ప్రక్రియను నిర్వహించాలని సూచించారు.
* 22ఏ భూములపై ప్రత్యేక దృష్టి
22ఏ పరిధిలో ఉన్న భూములకు సంబంధించిన సమస్యలు, పెండింగ్ కేసులు, భూ రికార్డుల పరిశీలన, సర్వేపై కలెక్టర్ ప్రత్యేకంగా సమీక్షించారు. భూ సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యానికి తావు లేకుండా అధికారులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు. భూ రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించి, నిబంధనల మేరకు అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సర్వేయర్లు క్షేత్రస్థాయిలో చేపడుతున్న సర్వే పనులను వేగవంతం చేయాలని, పెండింగ్లో ఉన్న సర్వే అంశాలను ప్రాధాన్య క్రమంలో పరిష్కరించాలని కలెక్టర్ సూచించారు. తహసీల్దార్లు తమ మండలాల్లోని భూ సంబంధిత సమస్యలను నిరంతరం పర్యవేక్షించాలని తెలిపారు.
* అట్రాసిటీ కేసులపై సమీక్ష
అట్రాసిటీ కేసులకు సంబంధించిన అంశాలపైనా కలెక్టర్ అధికారులతో సమీక్షించారు. బాధితులకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం అందాల్సిన సహాయాన్ని సకాలంలో అందించడంతో పాటు, పెండింగ్ అంశాల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని సూచించారు. సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి కేసుల పురోగతిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని తెలిపారు. జిల్లా పరిపాలనకు సంబంధించిన కీలక అంశాలపై మండలస్థాయి అధికారులు ప్రత్యేక శ్రద్ధ చూపాలని కలెక్టర్ స్పష్టం చేశారు. ప్రజలకు మెరుగైన సేవలందించాలని, అందుకు రెవెన్యూ యంత్రాంగం సమర్థవంతంగా పనిచేయాలని సూచించారు. సమీక్షలో వివిధ మండలాల తహసీల్దార్లు, సర్వేయర్లు, రెవెన్యూ శాఖ అధికారులు పాల్గొన్నారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
