Kamalapur DMHO Dr Appaiah Asha Day Meeting
* ఆశా డే మీటింగ్లో డీఎంహెచ్ఓ డాక్టర్ అప్పయ్య ఆకస్మిక సమీక్ష
* ప్రతి ఇంటికి ఆరోగ్యం – ప్రతి కుటుంబానికి ఆరోగ్య భద్రత లక్ష్యంతో పనిచేయాలని పిలుపు
ఆకేరు న్యూస్, కమలాపూర్: గ్రామీణ ప్రాంతాల్లో వైద్య ఆరోగ్య సేవలను మరింతగా అమలు చేసేందుకు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ అప్పయ్య మంగళవారం కమలాపూర్ ప్రభుత్వ ఆసుపత్రిలో ఆశా డే మీటింగ్ ను ఆకస్మికంగా సందర్శించారు.
ఈ సమావేశంలో గ్రామీణ ప్రజలకు అందుతున్న ప్రాథమిక ఆరోగ్య సేవలు, గర్భిణీల నమోదు, హెచ్పీవీ వ్యాక్సినేషన్, ప్రసూతి సేవలు, తల్లి-శిశు ఆరోగ్యంపై సమీక్షించారు. పూర్తి స్థాయి వ్యాక్సినేషన్, కుటుంబ నియంత్రణ, క్షయ (TB) గుర్తింపు-చికిత్స, రక్తహీనత నివారణ, అంటువ్యాధుల నియంత్రణతో పాటు మధుమేహం, రక్తపోటు వంటి అసాంక్రమిక వ్యాధుల (NCDs) స్క్రీనింగ్ ప్రక్రియను అడిగి తెలుసుకున్నారు. అలాగే ఫీవర్ సర్వేలు, సీజనల్ వ్యాధుల నివారణ, హౌస్ విజిట్లు, హైరిస్క్ గర్భిణీల గుర్తింపు వంటి అంశాలపై ఆశా కార్యకర్తలు చేస్తున్న సేవలను ప్రశంసిస్తూనే మరింత బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు.
ప్రతి ఆశా కార్యకర్త తమ పరిధిలోని కుటుంబాలతో నిరంతరం సంప్రదింపులు జరుపుతూ, ఆరోగ్య సమస్యలను ప్రాథమిక దశలోనే గుర్తించి సంబంధిత ఆరోగ్య కేంద్రాలకు సమాచారం అందించాలని డాక్టర్ అప్పయ్య ఆదేశించారు. ప్రభుత్వ ఆసుపత్రులలో ప్రసవాల సంఖ్యను పెంచేలా ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. ముఖ్యంగా సెప్టెంబర్ 20వ తేదీన జరగనున్న పల్స్ పోలియో కార్యక్రమంలో భాగంగా ఐదు సంవత్సరాల లోపు పిల్లలందరికీ విధిగా పోలియో చుక్కలు వేయించేలా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. క్షేత్రస్థాయిలో ఆశా కార్యకర్తలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను స్వయంగా అడిగి తెలుసుకొని, వాటి పరిష్కారానికి తగిన సహకారం అందిస్తామని భరోసానిచ్చారు. ప్రతి ఇంటికి ఆరోగ్యం – ప్రతి కుటుంబానికి ఆరోగ్య భద్రత అనే లక్ష్యంతో ఆరోగ్య శాఖ సిబ్బంది అంతా సమన్వయంతో పనిచేయాలని ఆయన పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో సి.హెచ్.సి సూపరింటెండెంట్ చందు నాయక్, గైనకాలజీ వైద్యులు ప్రియదర్శిని రెడ్డి, ప్రణీత, స్టాఫ్ నర్సులు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారులు నాగరాజు, రోహిత్, అరుణ్, మానస, రమ్య, సబ్ యూనిట్ ఆఫీసర్ విప్లవ్ కుమార్, ఆరోగ్య విస్తరణ అధికారి రవీందర్, హెల్త్ సూపర్వైజర్లు శ్రీకాంత్, అమృత, టీబీ నోడల్ పర్సన్ ప్రభాకర్, హెల్త్ అసిస్టెంట్లు మరియు ఆశా కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.


Please tell us what is wrong. Your report will be sent to the website team.
