Ahuti MK-2 drone touches 498 kmph
* గంటకు 498 కి.మీ. వేగంతో దూసుకెళ్లిన ‘అహుతి’ డ్రోన్!
* ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో సంచలనం
* బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్ ఘనత
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్ సరికొత్త ఘనతను సాధించింది. కేంద్రంగా పనిచేస్తున్న రక్షణ సాంకేతిక స్టార్టప్ ‘అపోలియన్ డైనమిక్స్’ దేశం గర్వించదగ్గ ఘనత సాధించింది. ఈ సంస్థ స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన ఎలక్ట్రిక్ మల్టీరోటర్ డ్రోన్ ‘అహుతి ఎంకే-2’ గంటకు ఏకంగా 498 కిలోమీటర్ల వేగాన్ని తాకింది. మానవరహిత వైమానిక వాహనాల్లో ఈ స్థాయి వేగంతో దూసుకెళ్లడం దేశంలోనే ప్రథమం కావడంతో.. ఇది ‘ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్’లో సముచిత స్థానం దక్కించుకుంది.
* వేగంలో 66 శాతం వృద్ధి
తొలి తరం ‘అహుతి’ డ్రోన్ 2025లో సుమారు 300 కి.మీ. వేగాన్ని మాత్రమే సాధించగలిగింది. అయితే, పాత నమూనాను అలానే ఉంచకుండా.. పూర్తిగా సరికొత్త డిజైన్‌తో ‘అహుతి ఎంకే-2’ను తీర్చిదిద్దారు. శత్రువుల డ్రోన్లు, సంచరించే ఆయుధాలను (లాటరింగ్ మ్యూనిషన్స్) క్షణాల వ్యవధిలో కూల్చేసేలా దీన్ని డెవలప్ చేశారు. ఫలితంగా ఏడాది లోపే దీని గరిష్ఠ వేగం 300 నుంచి 498 కి.మీ.కు పెరిగి, ఏకంగా 66 శాతం వృద్ధిని నమోదు చేసింది.
* లక్ష్య సాధనే ధ్యేయంగా..
సాధారణంగా మల్టీరోటర్ డ్రోన్లలో ఎక్కువ సేపు గాల్లో ఉండటం, బరువు మోయడం, స్థిరత్వం వంటి అంశాలకే ప్రాధాన్యత ఇస్తుంటారు. కానీ, ‘అహుతి ఎంకే-2’ రూపకల్పనలో మాత్రం ‘వేగం’ ఒక్కటే ప్రధాన ప్రామాణికంగా తీసుకున్నారు. ఆకాశంలో ఎదురయ్యే ముప్పును అత్యంత తక్కువ సమయంలో ఛేదించడమే దీని ప్రత్యేకత. “వేగం మాకు కేవలం ఒక సంఖ్య కాదు.. లక్ష్యాన్ని చేరుకోవడంలో, ముప్పును ముందుగానే నిరోధించడంలో ఉన్న పెద్ద తేడా” అని సంస్థ సహ వ్యవస్థాపకులు జయంత్ ఖత్రి, సౌర్య చౌదరి స్పష్టం చేశారు.
* యువ ఇంజినీర్ల మేధస్సుకు నిలువెత్తు రూపం
జయంత్ ఖత్రి, సౌర్య చౌదరిల దార్శనికతకు.. యువ ఇంజినీర్ల కఠిన శ్రమ తోడవడంతో ఈ విజయం సాధ్యమైంది. ఈ ప్రాజెక్ట్‌లో అమన్ విరాణి (షాడీ), మనస్ విచారే, ఇషాన్ సూరి కీలక బాధ్యతలు నిర్వర్తించారు. ప్రముఖ డ్రోన్ పైలట్ అయిన అమన్ విరాణి స్వయంగా విమాన పరీక్షలు (ఫ్లైట్ టెస్టింగ్), అభివృద్ధి ప్రక్రియలను దగ్గరుండి పర్యవేక్షించారు. 2025లో ప్రారంభమైన అపోలియన్ డైనమిక్స్.. మన సాయుధ దళాల అవసరాలను గమనిస్తూ అత్యాధునిక స్వదేశీ మానవరహిత వ్యవస్థలను తయారు చేస్తోంది. ఇప్పటికే ఈ సంస్థ కొన్ని అధునాతన రక్షణ వ్యవస్థలను భారత సైన్యానికి అందించడం విశేషం.
* పవర్ క్రూయిజ్ మిసైల్..
ప్రస్తుత రికార్డులతో ఆగిపోకుండా.. 2030 నాటికి మరింత శక్తివంతమైన ‘పవర్ క్రూయిజ్ మిసైల్’ ప్లాట్‌ఫామ్‌ను అభివృద్ధి చేయడమే తమ ప్రధాన లక్ష్యమని అపోలియన్ డైనమిక్స్ ప్రకటించింది. భవిష్యత్ రక్షణ రంగంలో వేగం, కచ్చితత్వం, స్వయంప్రతిపత్తి (ఆటోనమీ), తక్కువ వ్యయం, భారీ స్థాయి ఉత్పత్తి అనేవే విజయానికి కీలకమని సంస్థ గట్టిగా నమ్ముతోంది.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
