Minister Seethakka
* ఉన్నత లక్ష్యాలతో చదివి ఉత్తమ ఫలితాలు సాధించాలి
– మంత్రి సీతక్క.
ఆకేరు న్యూస్,ములుగు: పాఠశాల స్థాయి నుంచే విద్యార్థినీలు సాంకేతిక పరిజ్ఞానం పెంపొందించుకోవాలని, ఉన్నత లక్ష్యాలతో చదివి ఉత్తమ ఫలితాలు సాధించాలని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటిసరఫరా, మహిళా స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క అన్నారు.
బుధవారం మంగపేట మండల కేంద్రంలోని కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయంలో బాలవికాస స్వచ్ఛంద సంస్థ సహకారంతో ఏర్పాటు చేసిన 14 ల్యాప్‌టాప్‌లతో కూడిన కంప్యూటర్ ప్రయోగశాలను మంత్రి సీతక్క ప్రారంభించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఉన్నత చదువులకు వెళ్లినప్పుడు కంప్యూటర్లు, పలు సాంకేతిక పరికరాలను వినియోగించడంలో ఇబ్బందులు ఎదురుకాకుండా ఇప్పటి నుంచే వాటి వినియోగంపై అవగాహన పెంచుకోవాలన్నారు. కంప్యూటర్ విద్యను అభ్యసించేందుకు 14 ల్యాప్‌టాప్‌లను అందుబాటులోకి తీసుకువచ్చామని, ఈ అవకాశాన్ని ప్రతి విద్యార్థిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
కస్తూరిబా గాంధీ చదివిన బాలికలు రాష్ట్రస్థాయిలో ఉత్తమ ఫలితాలు సాధిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారని పేర్కొన్నారు. కన్నాయిగూడెం కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయంలో పదో తరగతి వరకు చదివి, అనంతరం జవహర్‌నగర్‌లో ఇంటర్ విద్యను అభ్యసించిన విద్యార్థిని రాష్ట్రస్థాయిలో ఉత్తమ ర్యాంకు సాధించిందని గుర్తుచేశారు. ఆమెను స్ఫూర్తిగా తీసుకొని విద్యా సంవత్సరం ప్రారంభం నుంచే పట్టుదలతో చదవాలని, పదో తరగతి, ఇంటర్ పరీక్షల్లో అత్యుత్తమ మార్కులు సాధించాలని సూచించారు.
విద్యాలయంలో భోజన నాణ్యత, మరుగుదొడ్ల నిర్వహణ, నీటి సరఫరా, ఇతర సౌకర్యాల గురించి మంత్రి విద్యార్థినులను నేరుగా అడిగి తెలుసుకున్నారు. ఏవైనా ఇబ్బందులు ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని సూచించారు.
విద్యార్థినులు తమ భద్రత పట్ల అప్రమత్తంగా ఉండాలని, పగలు రాత్రి వేళల్లో ఉపాధ్యాయులకు తెలుపకుండ ఒంటరిగా బయటకు వెళ్లవద్దని సూచించారు.
చదువుతోపాటు శారీరక ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలని తెలిపారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. సమష్టిగా శ్రమదాన కార్యక్రమాల్లో పాల్గొని విద్యాలయ ప్రాంగణాన్ని శుభ్రంగా ఉంచుకోవాలన్నారు. అందుబాటులో ఉన్న స్థలంలో కూరగాయల పెంపకంపై అవగాహన పెంచుకోవడంతోపాటు జామ, మామిడి వంటి పండ్ల మొక్కలను నాటి సంరక్షించాలని సూచించారు. భవిష్యత్తులో తాము చదివిన విద్యాలయానికి తిరిగి వచ్చినప్పుడు, తాము నాటిన మొక్కలు వృక్షాలుగా ఎదగడం చూసి ఆనందించేలా వాటిని సంరక్షించాలన్నారు. విద్యార్థినులందరు ఉన్నత లక్ష్యాలతో ఎదగాలని ఆకాంక్షిస్తూ ప్రోత్సహించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి సిద్ధార్థ రెడ్డి, జీసీడీఓ బుర్ర రజిత, మండల విద్యాశాఖ అధికారి మేనక, పాఠశాల ప్రత్యేక అధికారి భాగ్యలక్ష్మి, ఉల్లాస్ సమన్వయకర్త కృష్ణ బాబు, పాఠశాల ఉపాధ్యాయ బృందం, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.


Please tell us what is wrong. Your report will be sent to the website team.
