Epic First Semester trailer Launch, Rashmika Mandanna
* ‘ఎపిక్’ మంచి విజయం సాధించాలి
* ప్రతి తరానికి కనెక్ట్ అవుతుంది – శివ నిర్వాణ
ఆకేరు న్యూస్, హైదరాబాద్:
ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య జంటగా నటించిన ‘ఎపిక్ – ఫస్ట్ సెమిస్టర్’పై అంచనాలు పెరుగుతున్నాయి. డెబ్యూ డైరెక్టర్ ఆదిత్య హాసన్ తెరకెక్కించిన ఈ చిత్రాన్ని సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించారు. సెప్టెంబర్ 11న సినిమా థియేటర్లలోకి రానుంది. ఈ నేపథ్యంలో శుక్రవారం హైదరాబాద్‌లో ట్రైలర్ లాంచ్ ఈవెంట్ నిర్వహించారు. నేషనల్ క్రష్ రష్మిక మందన్న, దర్శకుడు శివ నిర్వాణ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
* ఎమోషన్‌తో మొదలైన ట్రైలర్
‘నాకు డైరెక్టర్ అవ్వాలని ఉంది.. సినిమాలో ఓ మ్యాజిక్ ఉంది.. ఓ మంచి సినిమా, మన సినిమా తీయాలని ఉంది’ అనే డైలాగ్‌తో ప్రారంభమైన ట్రైలర్ ఆద్యంతం ఆకట్టుకునేలా సాగింది. హీరో విదేశాలకు వెళ్లడం, అక్కడ జరిగే పరిణామాలు, ఆనంద్, వైష్ణవి మధ్య లవ్ ట్రాక్ యూత్‌ను ఆకట్టుకునేలా కనిపించాయి. అయితే ట్రైలర్ చివర్లో కథ ఒక్కసారిగా ఎమోషనల్ టర్న్ తీసుకుంది. లోన్ ఈఎంఐ, కాలేజ్ ఫీజు వంటి అంశాలతో వచ్చే సన్నివేశాలు కుటుంబ భావోద్వేగాలను టచ్ చేసేలా ఉన్నాయి. బ్రేకప్, రిలేషన్షిప్ గురించి హీరో చెప్పే డైలాగ్స్ కూడా సినిమాపై ఆసక్తిని పెంచుతున్నాయి.
* ‘ఎపిక్’ ట్రైలర్ నచ్చింది
రష్మిక మందన్న మాట్లాడుతూ ‘ఎపిక్’ ట్రైలర్ తనకు చాలా నచ్చిందన్నారు. ఆనంద్ ఎప్పుడూ సినిమా గురించే ఆలోచిస్తూ, దాని కోసం కష్టపడుతుంటాడని చెప్పారు. కడలి పాత్ర వైష్ణవికి మంచి పేరు తీసుకొస్తుందని అన్నారు. ఆదిత్య హాసన్‌ను చూస్తే గర్వంగా అనిపిస్తుందని, ‘90స్’ తర్వాత ఆయనపై బాధ్యత మరింత పెరిగిందని రష్మిక పేర్కొన్నారు. హేషమ్ అబ్దుల్ వహాబ్ సంగీతం ఎప్పుడూ ప్రత్యేకంగా ఉంటుందని అన్నారు. సెప్టెంబర్ 11న సినిమా విడుదల కానుందని, సెప్టెంబర్ 10న ప్రీమియర్లు ఉంటాయని తెలిపారు. టీంతో కలిసి సినిమాను చూడనున్నట్లు చెప్పారు. ‘ఎపిక్’ గొప్ప విజయం సాధించాలని కోరుకుంటున్నట్లు రష్మిక తెలిపారు.
* అందమైన చిత్రం.. అందరినీ సర్ప్రైజ్ చేస్తుంది
ఆనంద్ దేవరకొండ మాట్లాడుతూ ‘ఎపిక్’ అనే టైటిల్ వెనుక ప్రత్యేకమైన కారణం ఉందన్నారు. మన జీవితంలో కొన్ని క్షణాలు ఎప్పటికీ గుర్తుండిపోయేలా ఉంటాయని, బాధలో ఉన్నప్పుడు మన భాగస్వామి అండగా నిలిచినా, నుదుటిపై ముద్దు పెట్టినా అది ఎపిక్ మూమెంట్‌గా మారుతుందని చెప్పారు. కొత్త దర్శకులు ఇండస్ట్రీకి కొత్త ఆలోచనలు తీసుకొస్తారని, ఆదిత్య ప్రతి ఒక్కరి జీవితాన్ని నిశితంగా పరిశీలిస్తారని అన్నారు. ఈ సినిమా ఒక థెరపీలా ఉంటుందని, తెరపై మన జీవితాన్ని మనమే చూసుకున్నట్లు అనిపిస్తుందని తెలిపారు.
‘ఎపిక్’ అందమైన ఎమోషనల్ సినిమా అని, ప్రేక్షకులను సర్ప్రైజ్ చేస్తుందని ఆనంద్ అన్నారు. ‘ఏమాయ చేశావే’, ‘ప్రేమలు’ కలిపితే వచ్చే అందమైన కథలా ఈ సినిమా ఉంటుందని చెప్పారు. కడలి పాత్రలో వైష్ణవి అద్భుతంగా నటించిందని, ఆమె నటన ప్రేక్షకులను సర్ప్రైజ్ చేస్తుందని అన్నారు.
* ప్రతి తరానికి కనెక్ట్ అవుతుంది
శివాజీ మాట్లాడుతూ ‘ఎపిక్’లో తనకు మంచి పాత్ర ఇచ్చిన ఆదిత్య హాసన్, నాగవంశీకి ధన్యవాదాలు తెలిపారు. ‘90స్’ తన కెరీర్లో ఓ మిరాకిల్ అని, ఆదిత్య గొప్పగా కథను నెరేట్ చేస్తారని అన్నారు. ట్రైలర్లో కనిపించిన దానికంటే సినిమాలో మరింత గొప్ప ఎమోషన్ ఉంటుందని చెప్పారు. ఇది కేవలం జెన్ జీ ప్రేక్షకుల సినిమా కాదని, ప్రతి తరం ఈ చిత్రాన్ని గుండెల్లో పెట్టుకుంటుందని అన్నారు. విదేశాల్లో చదువుకునే యువతతో పాటు వారి కుటుంబాలకు ఈ కథ మరింతగా కనెక్ట్ అవుతుందని తెలిపారు. సినిమాలో రొమాన్స్, బ్రేకప్స్ కథలో భాగంగా వస్తాయని, క్లైమాక్స్ చాలా ఎమోషనల్‌గా ఉంటుందని చెప్పారు.
* థియేటర్లన్నీ వైబ్‌తో ఊగిపోవాలి
శివ నిర్వాణ మాట్లాడుతూ యంగ్ డైరెక్టర్లను ఇలా ప్రోత్సహించడం ఆనందంగా ఉందన్నారు. ఆదిత్య హాసన్ రైటింగ్ చాలా బాగుంటుందని, ‘90స్’ తర్వాత అదే ప్రపంచం నుంచి మరో కొత్త కథను తీసుకురావడం ఆసక్తికరంగా ఉందన్నారు. ‘బేబీ’తో ఆనంద్, వైష్ణవి మంచి విజయాన్ని అందుకున్నారని, మళ్లీ ఈ జంటను ఆదిత్య కొత్త కథలో చూపించడం, ఆ సినిమాతో ఎక్కడా పోలికలు రాకుండా చేయడం ఆయన ప్రతిభకు నిదర్శనమని అన్నారు. విజువల్స్ అద్భుతంగా ఉన్నాయని, హేషమ్ తన సంగీతంతో మ్యాజిక్ చేశారని చెప్పారు. ఆనంద్ తనను సొంత అన్నలా చూసుకుంటాడని శివ నిర్వాణ తెలిపారు. వైష్ణవి ఎదుగుదలను చూస్తుంటే సంతోషంగా ఉందన్నారు. సెప్టెంబర్ 11న థియేటర్లన్నీ ప్రేక్షకుల వైబ్‌తో ఊగిపోవాలని, ‘ఎపిక్’ మంచి విజయం సాధించాలని ఆకాంక్షించారు.
* కథలో మంచి ఎమోషనల్ డెప్త్
దర్శకుడు ఆదిత్య హాసన్ మాట్లాడుతూ ట్రైలర్ చూసి ప్రేక్షకులకు కల్చరల్ షాక్ కలిగి ఉండొచ్చని అన్నారు. ‘90స్’ ప్రపంచం నుంచి వచ్చినప్పటికీ ఇందులో కొత్తదనం ఉంటుందని చెప్పారు. కేవలం ఆకర్షణ కోసం సన్నివేశాలను రూపొందించలేదని, సినిమాలో మంచి ఎమోషనల్ డెప్త్ ఉంటుందని తెలిపారు. ఆనంద్, వైష్ణవి, శివాజీ, వాసుకి తదితరులు అద్భుతంగా నటించారని, హేషమ్ పాటలు, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఆకట్టుకుంటాయని చెప్పారు. అజీమ్ మహ్మద్ విజువల్స్ సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయని తెలిపారు. ‘ఎపిక్’ ప్రేక్షకులకు గుర్తుండిపోయే చిత్రంగా నిలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
వైష్ణవి చైతన్య మాట్లాడుతూ తనకు ఇష్టమైన దర్శకుడు, స్నేహితుడైన ఆదిత్య తనను కడలి పాత్రలో చూసి అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలిపారు. ప్రతి ఫ్రేమ్‌ను అజీమ్ అందంగా చూపించారని, హేషమ్ మంచి సంగీతాన్ని అందించారని అన్నారు. ‘బేబీ’ నుంచి ఆనంద్‌తో పరిచయం ఉందని, అప్పటికీ ఇప్పటికీ ఆయనలో మార్పు లేదని చెప్పారు. తన చుట్టూ ఉన్నవారు ఎదుగుతుంటే ఆనంద్ ఎంతో సంతోషిస్తారని ప్రశంసించారు. ‘ఎపిక్’ మంచి విజయం సాధిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య, శివాజీ, వాసుకి, రోహన్ తదితరులు నటించిన ఈ చిత్రానికి ఆదిత్య హాసన్ రచన, దర్శకత్వం వహించారు. హేషమ్ అబ్దుల్ వహాబ్ సంగీతం, అజీమ్ మహ్మద్ సినిమాటోగ్రఫీ, నవీన్ నూలి ఎడిటింగ్, అవినాష్ కొల్లా ప్రొడక్షన్ డిజైన్ అందించారు. సెప్టెంబర్ 11న ‘ఎపిక్ – ఫస్ట్ సెమిస్టర్’ ప్రేక్షకుల ముందుకు రానుంది.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
