CM Revanth Reddy Teachers PRC Promise
* ఉపాధ్యాయులకు సీఎం రేవంత్ ప్రామిస్
* పీఆర్సీ, ఇంక్రిమెంట్లు ఇచ్చే బాధ్యత నాది
ఆకేరు న్యూస్, కొడంగల్: రాష్ట్రంలో ఆర్థిక వెసులుబాటును బట్టి పీఆర్సీ, ఇంక్రిమెంట్లు, బకాయిలతో సహా ఉపాధ్యాయుల సమస్యలన్నింటినీ సామరస్యంగా పరిష్కరిస్తామని, తమ ప్రభుత్వానికి రెండు సంవత్సరాల పాటు సమయం ఇచ్చి సహకరించాలని ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. నిరుపేద విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దడానికి విద్యా రంగంలో చేపడుతున్న సంస్కరణలకు ఉపాధ్యాయులంతా పునరంకితమై, తెలంగాణ విద్యా వ్యవస్థను దేశానికే ఒక దిక్సూచిలా నిలబెట్టాలని కోరారు.
భారతదేశ మాజీ రాష్ట్రపతి, ఆదర్శ ఉపాధ్యాయుడు డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతిని పురస్కరించుకుని కొడంగల్‌లోని ప్రభుత్వ జూనియర్ కాలేజీలో నిర్వహించిన ఉపాధ్యాయ దినోత్సవ వేడుకల్లో ముఖ్యమంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా సర్వేపల్లి చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి, ఉపాధ్యాయులందరికీ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, మంత్రి దామోదర రాజనర్సింహ, ప్రభుత్వ సలహాదారు కే కేశవరావు, పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పెద్దఎత్తున పాల్గొన్నారు.

* ఉపాధ్యాయుల చేతిలోనే మార్కులు…
ఈ వేడుకలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. “రాజకీయ నాయకులంగా మేము ప్రతి ఐదేళ్లకు ఒకసారి ప్రజల ముందుకు వచ్చి పరీక్షలు రాయాల్సిందే. నేను చెప్పిన ప్రకారం పనిచేయకపోతే మార్కులు వేయాల్సింది, నిర్ణయం తీసుకోవాల్సింది ఉపాధ్యాయులే. మీ చేతిలోనే కలం ఉంది, మీ చేతిలోనే బలం ఉంది. ఉపాధ్యాయులు రోడ్లెక్కి ధర్నాలు చేస్తే సమాజానికి తప్పుడు సంకేతాలు వెళ్తాయి. అందుకే నాకు రెండేళ్ల సమయం ఇవ్వండి. మిమ్మల్ని అణాపైసా కష్టం రానివ్వకుండా చూసుకునే బాధ్యత నాది” అని స్పష్టం చేశారు. ఏవైనా సందేహాలు ఉంటే ప్రభుత్వ సలహాదారు కే కేశవరావుతో చర్చించాలని సూచించారు.

* గత పదేళ్ల విధ్వంసం నుంచి వికాసం వైపు..
గత ప్రభుత్వంలో పదేళ్ల పాటు విద్యా వ్యవస్థను నిర్వీర్యం చేశారని సీఎం విమర్శించారు. ప్రజా ప్రభుత్వం వచ్చిన తర్వాత వివాదాలు లేకుండా టీచర్ల బదిలీలు పూర్తి చేశామని, జీవో 317 సమస్యలను పరిష్కరించి, పెండింగ్ పదోన్నతులు కల్పించామని గుర్తుచేశారు. ఉపాధ్యాయులను విదేశాలకు పంపి అధ్యయనం చేయించడంతో పాటు, ప్రత్యేక విద్యా కమిషన్‌ను ఏర్పాటు చేశామన్నారు. ఉపాధ్యాయుల కృషి వల్లే ప్రభుత్వ పాఠశాలల్లో అదనంగా 80 వేల అడ్మిషన్లు పెరిగాయని, విద్యా రంగంలో జాతీయ స్థాయిలో తెలంగాణ 28వ స్థానం నుంచి 17వ స్థానానికి ఎదిగిందని అభినందించారు. రిటైర్మెంట్ బెనిఫిట్స్ కోసం నిధులను సమకూర్చి వంద రోజుల్లోనే రూ. 6 వేల కోట్లు చెల్లించినట్లు వెల్లడించారు.

* మారుతున్న కాలానికి అనుగుణంగా అప్డేటెడ్ విద్యా విధానం
జాతీయ విద్యా విధానంతో వస్తున్న మార్పులకు అనుగుణంగా సాంకేతిక నైపుణ్యాల (స్కిల్స్) శిక్షణకు ప్రాధాన్యత ఇస్తున్నామని సీఎం తెలిపారు. పాలిటెక్నిక్ విద్యను స్కిల్స్ యూనివర్సిటీ పరిధిలోకి తీసుకురావడంపై జరుగుతున్న తప్పుడు ప్రచారాన్ని నమ్మవద్దని కోరారు. పాలిటెక్నిక్‌లో రెండేళ్ల థియరీ, మూడో ఏట కార్పొరేట్ సంస్థల్లో రూ. 9 వేల వరకు స్టయిఫండ్‌తో ఇంటర్న్‌షిప్ సౌకర్యం కల్పిస్తున్నామని తెలిపారు. డిప్లమాతో పాటు డిగ్రీ పట్టా ఇచ్చేలా మార్పులు తెచ్చామని, డిప్లమా పూర్తయ్యాక ఇంజనీరింగ్ రెండో సంవత్సరంలో నేరుగా చేరే అవకాశం యథాతథంగా ఉంటుందని స్పష్టం చేశారు. ITIలను ATCలుగా మార్చడం ద్వారా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెరిగాయని వివరించారు.
జర్మనీ, జపాన్, సౌత్ కొరియా వంటి దేశాల్లో స్కిల్స్ ఉన్న వారికి విపరీతమైన డిమాండ్ ఉందని, నర్సరీ నుంచి 12వ తరగతి వరకు విద్యను అందించి, ఆ తర్వాత నైపుణ్య శిక్షణ, ఆవిష్కరణలు (ఇన్నోవేషన్), ఉపాధి వైపు దృష్టి సారించాలని పిలుపునిచ్చారు. ఈ విద్యా విప్లవానికి ఉపాధ్యాయులే సారథులని సీఎం రేవంత్ రెడ్డి పునరుద్ఘాటించారు.


Please tell us what is wrong. Your report will be sent to the website team.
