Uttam Kumar Reddy KCR Criticism
* కేసీఆర్ ఫామ్‌హౌస్‌లో ఉంటేనే బెటర్
* ఇరిగేషన్ శాఖను నాశనం చేశారు..
* మంత్రి ఉత్తమ్‌కుమార్ ఆగ్రహం
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : నీళ్ల సమస్యకు కేసీఆరే కారణమని నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. కేసీఆర్ ఇప్పుడు పాదయాత్ర చేస్తానంటే ప్రజలు నవ్వుకుంటారని, ఆయన ఫామ్‌హౌస్‌లోనే ఉంటే బెటర్ అంటూ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. గత పదేళ్ల కాలంలో రాష్ట్రంలో ఇరిగేషన్ రంగాన్ని పూర్తిగా నాశనం చేసింది కేసీఆరేనని ఆరోపించారు.
* కాళేశ్వరం దగ్గరికి ఎలా వెళ్తారు..
గత ప్రభుత్వ హయాంలో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు డిజైన్ లోపాలు, నాసిరకం నిర్మాణాల వల్ల కూలిపోయిందని, అలాంటిది ఏ ముఖం పెట్టుకుని కూలిపోయిన కాళేశ్వరం వద్దకు కేసీఆర్ వెళ్తారని మంత్రి ఉత్తమ్ ప్రశ్నించారు. “సిగ్గు లేకుండా కాళేశ్వరం దగ్గరికి ఎలా పోతారు? ఇరిగేషన్ శాఖను పూర్తిగా నాశనం చేసి, ఇప్పుడు నీళ్ల రాజకీయం చేయడం విడ్డూరంగా ఉంది” అని మండిపడ్డారు.
* శవ రాజకీయాలు చేస్తున్న బీఆరెస్
రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న నీళ్ల సమస్యకు రెండు ప్రధాన కారణాలు ఉన్నాయని ఉత్తమ్ విశ్లేషించారు. అందులో మొదటిది కేసీఆర్ దారుణమైన నిర్ణయాలు కాగా, రెండోది ప్రకృతి సిద్ధంగా వచ్చిన ఎల్‌నినో ప్రభావమని పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక రైతాంగాన్ని ఆదుకోవడానికి అన్ని రకాల చర్యలు చేపడుతుంటే, బీఆరెస్t నాయకులు శవ రాజకీయం చేస్తున్నారని విమర్శించారు.
* రాజకీయ నాయకుల భాషపై విమర్శలు
గతంలో కేసీఆర్ పబ్లిక్ మీటింగ్స్‌లో తీవ్రమైన బూతులు, అసభ్యకర పదజాలం మాట్లాడినప్పుడు బీఆరఎస్ నాయకులు ఆయనను హీరోగా ప్రొజెక్ట్ చేసుకున్నారని ఎద్దేవా చేశారు. ఇప్పుడు అదే భాషను కేసీఆర్ పై లేదా బీఆరెస్ నేతలపై ఉపయోగిస్తే ఎందుకు యాగీ చేస్తున్నారని నిలదీశారు. తెలంగాణ రాజకీయాల్లో సభ్యత లేని భాషను పరిచయం చేసిందే కేసీఆర్ అని ఆరోపించారు. కేసీఆర్ పాదయాత్రల పేరుతో ప్రజలను మళ్లీ మభ్యపెట్టలేరని, ప్రజలు ఇప్పటికే ఆయన అసలు స్వరూపాన్ని గ్రహించారని స్పష్టం చేశారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
