Sushmita Konidela appointed as special invitee Indrakeeladri temple trust board
* ఉత్తర్వులు జారీ చేసిన ఏపీ ప్రభుత్వం
* ఇంద్రకీలాద్రి ట్రస్ట్ బోర్డులో ప్రత్యేక ఆహ్వానితురాలిగా నియామకం
ఆకేరు న్యూస్, డెస్క్ :
టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి పెద్ద కుమార్తె.. ఫ్యాషన్ డిజైనర్.. సినీ నిర్మాత సుస్మిత కొణిదెలకు అరుదైన గౌరవం దక్కింది. విజయవాడలోని శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థానం ట్రస్ట్ బోర్డుకు ఆమెను ప్రత్యేక ఆహ్వానితురాలిగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నియమించింది. ఈమేరకు రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ కార్యదర్శి కన్నబాబు మంగళవారం అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు.
* భక్తుల సౌకర్యాలు.. ఆలయ అభివృద్ధిపై దృష్టి..
ఇంద్రకీలాద్రికి వచ్చే భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడం.. ఆలయ సమగ్ర అభివృద్ధికి సంబంధించిన అంశాల్లో సూచనలు ఇవ్వడం, దసరా నవరాత్రులు వంటి ప్రత్యేక ఉత్సవాల నిర్వహణలో భాగస్వామ్యం కావడం వంటి బాధ్యతల్లో సుస్మిత తనవంతు సేవలు అందించనున్నారు.
* ఇప్పటికే కీలక బాధ్యతల్లో మెగా కుటుంబ సభ్యులు..
మెగా కుటుంబం నుంచి ఇప్పటికే పవన్ కళ్యాణ్ ఏపీ డిప్యూటీ సీఎంగా, నాగబాబు ఏపీ గ్రీన్ ఎగ్జిక్యూటివ్ కమిటీ చైర్మన్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. తాజాగా సుస్మిత కొణిదెలను ఇంద్రకీలాద్రి ట్రస్ట్ బోర్డులో ప్రత్యేక ఆహ్వానితురాలిగా ప్రభుత్వం నియమించడం ఆసక్తికరంగా మారింది.
* యాదాద్రి పాలకమండలిలో సురేఖ.. ఇంద్రకీలాద్రిలో సుస్మిత
ఇటీవల తెలంగాణ ప్రభుత్వం చిరంజీవి సతీమణి కొణిదెల సురేఖను యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం పాలకమండలి సభ్యురాలిగా నియమించింది. ఆ నియామకంపై అప్పట్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. మెగా కుటుంబానికి ఉన్న ఆధ్యాత్మిక అనుబంధం, సామాజిక ప్రాధాన్యత నేపథ్యంలో ఈ నియామకాలు జరిగాయని పలువురు పేర్కొన్నారు. తాజాగా సుస్మితకు కీలక బాధ్యతలు దక్కడంతో తెలుగు రాష్ట్రాల ఆధ్యాత్మిక రంగంలో మెగా కుటుంబానికి ప్రాధాన్యత మరోసారి చర్చనీయాంశంగా మారింది.
* ఫ్యాషన్ డిజైనర్ నుంచి విజయవంతమైన నిర్మాతగా..
సుస్మిత కొణిదెల సినీ రంగంలోనూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. తొలుత ఫ్యాషన్ డిజైనర్‌గా తన తండ్రి చిరంజీవి సినిమాలకు కాస్ట్యూమ్స్ రూపొందించారు. అనంతరం గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌ను స్థాపించి వెబ్ సిరీస్‌లు, సినిమాలను నిర్మించారు. ఈ ఏడాది సంక్రాంతికి చిరంజీవి కథానాయకుడిగా ఆమె నిర్మించిన ‘మన శంకర వర ప్రసాద్ గారు’ బాక్సాఫీస్ వద్ద ఘనవిజయం సాధించడంతో నిర్మాతగా సుస్మితకు మరింత గుర్తింపు లభించింది.
* సినీ రంగంలో సక్సెస్.. ఇప్పుడు ఇంద్రకీలాద్రి సేవలో..
ఓ వైపు సినీ పరిశ్రమలో నిర్మాతగా తన ప్రయాణాన్ని కొనసాగిస్తూనే.. మరోవైపు విజయవాడ ఇంద్రకీలాద్రి ఆలయ సేవలో భాగస్వామి కానున్నారు సుస్మిత. ఆమెకు ఈ బాధ్యత దక్కడంపై మెగా అభిమానులు, సినీ ప్రముఖులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
