Vijayashanti
* ‘క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్’ ఉన్నా దోపిడీ ఆగట్లేదు
*శాసనమండలిలో విజయశాంతి ఆవేదన
ఆకేరు న్యూస్, హైదరాబాద్ :
రాష్ట్రంలోని ప్రైవేట్, కార్పొరేట్ ఆసుపత్రుల అడ్డగోలు వసూళ్లు, దోపిడీపై శాసనమండలి (MLC) లో ఎమ్మెల్సీ విజయశాంతి (Vijayashanti) తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. మానవత్వంతో సేవ అందించాల్సిన వైద్య రంగం ప్రస్తుతం కేవలం లాభాపేక్షతో కూడిన పెద్ద వ్యాపారంగా మారిపోయిందని, సామాన్య ప్రజలను నట్టేట ముంచుతోందని ఆవేదన వ్యక్తం చేశారు.
* జ్వరం వస్తే రూ.30 వేల దాకా వసూళ్లు..
సాధారణ జ్వరంతో ఆసుపత్రికి వెళ్లే రోగులను సైతం ప్రైవేట్ ఆసుపత్రులు భయాందోళనకు గురిచేస్తున్నాయని శాసనమండలిలో పేర్కొన్నారు. బ్లడ్ టెస్ట్, యూరిన్ టెస్ట్, స్కాన్, ఎక్స్-రే అంటూ అవసరం ఉన్నా లేకపోయినా రకరకాల పరీక్షలు రాసి వేల రూపాయలు లాగుతున్నారని విమర్శించారు. కేవలం సాధారణ పరీక్షలకే ₹15,000 నుండి ₹30,000 వరకు వసూలు చేస్తున్నారని, డాక్టర్ల ఫీజు పేరుతోనే ₹1,000 నుండి ₹1,500 వరకు పిండుకుంటున్నారని ఆరోపించారు.
* రోడ్డున పడుతున్న కుటుంబాలు..
రోడ్డు ప్రమాదాలు, గుండెపోటు (హార్ట్ ఎటాక్), కిడ్నీ లేదా లివర్ సంబంధిత తీవ్రమైన ఆరోగ్య సమస్యలతో అత్యవసర పరిస్థితుల్లో (ఎమర్జెన్సీ) ప్రైవేట్ ఆసుపత్రుల్లో చేరితే బాధితుల పరిస్థితి మరీ దారుణంగా తయారవుతోందని తెలిపారు. లక్షల రూపాయల బిల్లులు వేస్తూ సామాన్య, మధ్యతరగతి కుటుంబాల ఆస్తులను కరిగించేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.
*చట్టాలు ఉన్నా ఆగని దోపిడీ…
ప్రైవేట్ ఆసుపత్రుల్లో అందరికీ అందుబాటులో ఉండేలా రీజనబుల్ ఛార్జీలు మాత్రమే ఉండాలని, నియంత్రణ తెచ్చేందుకు గతంలో సుప్రీంకోర్టు స్పష్టమైన మార్గదర్శకాలు ఇచ్చిందని గుర్తుచేశారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు తెలంగాణ ప్రభుత్వం ‘క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్’ తెచ్చినప్పటికీ, కార్పొరేట్ హాస్పిటళ్ల దోపిడీ మాత్రం ఆగడం లేదని విజయశాంతి (Vijayashanti) విమర్శించారు. కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ “వైద్యం, విద్య అనేవి సమాజానికి సేవలు కావాల్సింది పోయి పూర్తిగా బిజినెస్ అయిపోయాయి. డాక్టర్లు కష్టపడి సంపాదించుకోవడంలో తప్పు లేదు కానీ, ఈ స్థాయి దోపిడీ సరికాదు” అని దుయ్యబట్టారు. చట్టాలను కఠినంగా అమలు చేసి, అడ్డగోలు రుసుములు వసూలు చేస్తూ ప్రజలను పీల్చిపిప్పి చేస్తున్న ప్రైవేట్ ఆసుపత్రులపై ప్రభుత్వం వెంటనే స్పందించి తీవ్రమైన కఠిన చర్యలు తీసుకోవాలని శాసనమండలి ఛైర్మన్ ద్వారా ప్రభుత్వాన్ని విజయశాంతి డిమాండ్ చేశారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
