ఏడీఏ ఆదిరెడ్డి
* వరి సాగుపై అప్రమత్తంగా ఉండాలి
* ఏడీఏ ఆదిరెడ్డి
Kamalapur| ఆకేరు న్యూస్, కమలాపూర్: వాతావరణ మార్పులు, ఎల్నినో ప్రభావంతో ఉష్ణోగ్రతలు పెరిగి భూగర్భ జలాలపై ఒత్తిడి పెరుగుతున్న నేపథ్యంలో రైతులు ఆరుతడి పంటల సాగుకు ప్రాధాన్యం ఇవ్వాలని హన్మకొండ జిల్లా సహాయ వ్యవసాయ సంచాలకులు (ఏడీఏ) ఆదిరెడ్డి సూచించారు. నీటి లభ్యతను దృష్టిలో ఉంచుకుని తక్కువ నీటితో సాగు చేయగల ప్రత్యామ్నాయ పంటలను ఎంచుకోవాలని, తద్వారా పెట్టుబడి ఖర్చులను నియంత్రించుకోవచ్చని తెలిపారు.
ఖేత్ బచావో అభియాన్
కమలాపూర్ మండలం గుండేడులో శనివారం నిర్వహించిన ఖేత్ బచావో అభియాన్ కార్యక్రమంలో పాల్గొన్న ఏడీఏ ఆదిరెడ్డి రైతులకు పలు సూచనలు చేశారు. ప్రస్తుత వాతావరణ పరిస్థితుల్లో వరి సాగు విషయంలో అప్రమత్తంగా ఉండాలని కోరారు. అధిక ఉష్ణోగ్రతల వల్ల వరి పంట పూత దశలో పరాగసంపర్కానికి ఆటంకం ఏర్పడి, గింజలు సరిగా ఏర్పడకపోవచ్చని వివరించారు. దీనివల్ల దిగుబడులు తగ్గే ప్రమాదం ఉందని పేర్కొన్నారు.
తక్కువ నీటితో సాగు
నీటి ఎద్దడిని ఎదుర్కొనేందుకు తక్కువ నీరు, పెట్టుబడితో సాగు చేయగల పంటలపై రైతులు దృష్టి సారించాలని ఆదిరెడ్డి సూచించారు. జీరో టిల్లేజ్ పద్ధతిలో మొక్కజొన్న సాగు చేసే అవకాశాలను పరిశీలించాలని చెప్పారు. 100 నుంచి 110 రోజుల్లో పంట చేతికి వచ్చే స్వల్పకాలిక రకాలను ఎంపిక చేసుకోవడం ద్వారా సాగు ప్రణాళికను మెరుగుపరుచుకోవచ్చని తెలిపారు. తక్కువ నీటితో పండించే కూరగాయ పంటలను సాగు చేస్తే మెరుగైన ఆదాయం పొందే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు.
పొలాల్లో అధికారుల పరిశీలన
అనంతరం మర్రిపల్లిగూడెం గ్రామంలోని వరి పొలాలను వ్యవసాయ అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించారు. వరి పంటకు ఆశించే చీడపీడలు, తెగుళ్ల నివారణకు చేపట్టాల్సిన సమగ్ర సస్యరక్షణ చర్యలపై రైతులకు అవగాహన కల్పించారు. పంటల యాజమాన్యంలో పాటించాల్సిన పద్ధతులను వివరించారు. శనిగరం గ్రామంలో నిర్వహిస్తున్న పత్తి పంట కోత ప్రయోగాన్ని కూడా అధికారులు పరిశీలించారు.
నీటి పొదుపుపై అవగాహన
రాబోయే రోజుల్లో నీటి లభ్యతను దృష్టిలో ఉంచుకుని ప్రతి నీటి బొట్టును పొదుపుగా వినియోగించాలని అధికారులు రైతులకు సూచించారు. వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా ప్రత్యామ్నాయ పంటలను ఎంచుకుని సాగు చేపట్టాలని కోరారు. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి వేణు, వ్యవసాయ విస్తరణాధికారి తిరుపతి, గ్రామ సర్పంచ్, ఉపసర్పంచ్, రైతులు పాల్గొన్నారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.

