Social Media Impact on Teen Mental Health
* డిప్రెషన్‌ను నిర్లక్ష్యం చేయొద్దు
* సోషల్ మీడియా ప్రభావంతో టీనేజర్లలో మానసిక సమస్యలు
* సైకియాట్రిస్ట్‌ను కలవడానికి భయమెందుకు
– మానసిక వైద్య నిపుణురాలు డాక్టర్ శీతల్
ఆకేరు న్యూస్, హెల్త్: ఆధునిక సమాజంలో మానసిక ఆరోగ్య సమస్యలు చాలామందిని ఇబ్బంది పెడుతున్నాయి. మానసిక సమస్యతో బాధపడుతున్నట్లు గుర్తించినప్పటికీ, సైకియాట్రిస్ట్‌ను సంప్రదించేందుకు చాలామంది వెనుకడుగు వేస్తున్నారు. సమాజంలో తమకు చెడ్డ పేరు వస్తుందనే భయం, కుటుంబ పరువు పోతుందనే ఆందోళనతో చికిత్సకు దూరంగా ఉంటున్నారు. మానసిక ఆరోగ్య సమస్యలను నిర్లక్ష్యం చేయకుండా, సకాలంలో నిపుణులను సంప్రదించాలని డాక్టర్ శీతల్, ఎం.డి. సైకియాట్రీ సూచించారు. ఆకేరు న్యూస్ కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆమె మానసిక ఆరోగ్యం, మహిళల్లో ఎదురయ్యే సమస్యలు, టీనేజర్ల మానసిక పరిస్థితులు, సోషల్ మీడియా ప్రభావం, తల్లిదండ్రుల బాధ్యతలపై పలు విషయాలు వెల్లడించారు.
* మానసిక సమస్యలను గుర్తించడం ఎలా..?
మానసిక ఆరోగ్య సమస్యలను గుర్తించడం ఎంత ముఖ్యమో, వాటిని గుర్తించిన తర్వాత సరైన చికిత్స తీసుకోవడం కూడా అంతే ముఖ్యమని డాక్టర్ శీతల్ తెలిపారు. అధికంగా బాధపడటం, విపరీతమైన కోపం రావడం, భావోద్వేగాల్లో తీవ్రమైన మార్పులు చోటుచేసుకోవడం, ఇతరులు లేని సమయంలో మాటలు వినిపించడం లేదా మనుషులు కనిపిస్తున్నట్లు అనిపించడం వంటి లక్షణాలను నిర్లక్ష్యం చేయకూడదన్నారు. అలాగే వ్యసనాలకు బానిస కావడం, ఒకే పనిని పదేపదే చేయడం, సందర్భానికి సంబంధం లేకుండా మాట్లాడటం, ఇంటిని వదిలి వెళ్లిపోవడం, చిన్న విషయాలకే తీవ్రంగా ఆవేశపడటం వంటి ప్రవర్తనా మార్పులను కూడా గమనించాలని సూచించారు. ఉద్యోగం చేయడం, ఇంటి పనులు నిర్వహించడం, వ్యక్తిగత అవసరాలను చూసుకోవడం లేదా చదువుపై దృష్టి పెట్టడం కష్టంగా మారినా నిపుణుల సలహా తీసుకోవాలని చెప్పారు.
* సైకియాట్రిస్ట్‌ను సంప్రదించడానికి భయపడొద్దు
మానసిక సమస్యల కోసం వైద్యుడిని సంప్రదిస్తే సమాజం ఏమనుకుంటుందోననే భయం చాలామందిలో ఉంటోందని డాక్టర్ శీతల్ (Dr Sheethal) పేర్కొన్నారు. సైకియాట్రిస్ట్ దగ్గరకు వెళ్తే తమకు మానసిక సమస్య ఉందనే ముద్ర వేస్తారనే ఆందోళనతో చికిత్స తీసుకోవడం లేదన్నారు. మానసిక ఆరోగ్యం కూడా శారీరక ఆరోగ్యం లాంటిదేనని, సమస్య ఉన్నప్పుడు వైద్య సహాయం తీసుకోవడంలో ఎలాంటి సంకోచం అవసరం లేదని స్పష్టం చేశారు. ప్రతి మానసిక సమస్యకు మందులు అవసరం ఉండవని, సమస్య తీవ్రతను బట్టి కౌన్సెలింగ్, మందులు లేదా రెండింటినీ సూచించే అవకాశం ఉంటుందని వివరించారు.
* సోషల్ మీడియా ప్రభావంతో దాంపత్య జీవితంలో ఒత్తిళ్లు
సోషల్ మీడియాలో కనిపించే జీవితాలను చూసి తమ జీవితాలను వాటితో పోల్చుకోవడం కొంతమందిలో అసంతృప్తికి దారితీస్తోందని డాక్టర్ శీతల్ అభిప్రాయపడ్డారు. ఇతర జంటలు విహారయాత్రలకు వెళ్లడం, ఖరీదైన దుస్తులు ధరించడం, విలాసవంతమైన జీవితం గడపడం చూసి తాము కూడా అలాంటి జీవితాన్నే కోరుకోవడం వల్ల కుటుంబాల్లో విభేదాలు తలెత్తవచ్చన్నారు. ఆర్థిక పరిస్థితులు, ఉద్యోగ బాధ్యతలు, సమయం వంటి కారణాలతో భాగస్వామి తమ కోరికలను తీర్చలేకపోతే చిన్న చిన్న వివాదాలు పెద్ద గొడవలుగా మారే ప్రమాదం ఉందని తెలిపారు. సోషల్ మీడియాలో కనిపించే ప్రతి జీవితమూ వాస్తవ పరిస్థితులను పూర్తిగా ప్రతిబింబించదనే విషయాన్ని గుర్తించాలని సూచించారు.

* మహిళల్లో డిప్రెషన్, ఆందోళన సమస్యలు
మహిళలు ఎదుర్కొనే మానసిక ఆరోగ్య సమస్యల్లో డిప్రెషన్, ఆందోళన, పోస్ట్ ట్రామాటిక్ స్ట్రెస్ డిజార్డర్ (PTSD) వంటి సమస్యలు ఉంటాయని డాక్టర్ శీతల్ వివరించారు. లైంగిక వేధింపులు, అత్యాచారం, శారీరక హింస, మానసిక వేధింపులు లేదా ఇతర భయానక సంఘటనలు ఎదురైన తర్వాత కొందరు మహిళలు తీవ్రమైన మానసిక ఒత్తిడికి గురవుతారని తెలిపారు. గతంలో జరిగిన సంఘటనలు పదేపదే గుర్తుకు రావడం, మళ్లీ అదే ఘటన జరుగుతుందనే భయం కలగడం, ఆ సంఘటనను మళ్లీ అనుభవిస్తున్నట్లుగా అనిపించడం వంటి లక్షణాలు కనిపించవచ్చన్నారు. బాధితులు కావాలని గతాన్ని గుర్తు చేసుకోవడం వల్లే ఇలా జరుగుతుందని భావించకూడదని, కొన్ని సందర్భాల్లో ఆ జ్ఞాపకాలు అనుకోకుండానే వెంటాడుతాయని వివరించారు.
* టీనేజర్ల మానసిక ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ అవసరం
బాల్యం నుంచి యుక్తవయసులోకి అడుగుపెట్టే దశలో శారీరకంగా, హార్మోన్ల పరంగా, మానసికంగా అనేక మార్పులు చోటుచేసుకుంటాయని డాక్టర్ శీతల్ తెలిపారు. పాఠశాల నుంచి కళాశాలకు వెళ్లడం, కొత్త వ్యక్తులతో పరిచయాలు, సామాజిక పరిస్థితులను అర్థం చేసుకోవడం వంటి అంశాలు టీనేజర్లలో గందరగోళం, ఆందోళనకు కారణమవుతాయని చెప్పారు. ఈ దశలో కొందరు డిప్రెషన్, ఆందోళన వంటి సమస్యలను ఎదుర్కొనే అవకాశం ఉందన్నారు. పిల్లల ప్రవర్తనలో గణనీయమైన మార్పులు కనిపించినప్పుడు తల్లిదండ్రులు వాటిని సాధారణ అల్లరి లేదా వయసుతో వచ్చే మార్పులుగా మాత్రమే భావించి నిర్లక్ష్యం చేయకూడదని సూచించారు.
* పిల్లలకు భరోసా ఇవ్వాలి.. భయపెట్టకూడదు
పిల్లలు తమకు ఎదురైన సమస్యలను తల్లిదండ్రులతో చెప్పుకునేలా ఇంట్లో నమ్మకమైన వాతావరణం కల్పించాలని డాక్టర్ శీతల్ సూచించారు. ముఖ్యంగా లైంగిక వేధింపులు లేదా ఇతర ఇబ్బందికర సంఘటనలు ఎదురైనప్పుడు పిల్లలు భయంతో చెప్పుకోలేకపోవచ్చన్నారు. పిల్లలు ఏదైనా సమస్యను పంచుకున్నప్పుడు వారిని నిందించడం, బెదిరించడం, భయపెట్టడం చేయకూడదని చెప్పారు. వారి మాటలను శ్రద్ధగా విని, వారికి భరోసా ఇవ్వాలని సూచించారు. సమస్య చిన్నదైతే తల్లిదండ్రుల ప్రోత్సాహం, ధైర్యం కొంతవరకు సహాయపడవచ్చు. అయినప్పటికీ భయం తగ్గకపోవడం, చదువుకు లేదా రోజువారీ జీవితానికి ఆటంకం కలగడం వంటి పరిస్థితుల్లో మానసిక ఆరోగ్య నిపుణులను సంప్రదించాలని తెలిపారు.
* ప్రతి సమస్యకు మందులు అవసరం లేదు
మానసిక వైద్యుడిని సంప్రదించినంత మాత్రాన ప్రతి ఒక్కరికీ మందులు ఇవ్వాల్సిన అవసరం ఉండదన్నారు వ్యక్తి పరిస్థితి, లక్షణాలు, సమస్య తీవ్రతను అంచనా వేసిన తర్వాత చికిత్సను నిర్ణయిస్తారని చెప్పారు. కొన్ని సందర్భాల్లో కౌన్సెలింగ్‌తోనే సహాయం అందవచ్చని, మరికొన్ని సందర్భాల్లో మందులు అవసరమవుతాయని తెలిపారు. మానసిక ఒత్తిడి తీవ్రంగా మారి రోజువారీ జీవితాన్ని ప్రభావితం చేస్తున్నప్పుడు , వ్యక్తిగా తన పనులు తాను చేసుకోవడంలో ఇబ్బంది పడుతున్నప్పుడు కూడా చికిత్సను వాయిదా వేయకూడదన్నారు. సమస్య ముదిరే వరకు వేచి చూడకుండా ముందుగానే వైద్య సహాయం తీసుకోవడం వల్ల పరిస్థితిని మెరుగు పరుచుకునేందుకు అవకాశం ఉంటుందని తెలిపారు.
* మానసిక ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయొద్దు
మానసిక సమస్యలు ఎదురవడం బలహీనతకు గుర్తు కాదని, వాటికి సరైన సహాయం తీసుకోవడం ముఖ్యమన్నారు. తమలో లేదా తమ కుటుంబ సభ్యుల్లో మానసిక ఆరోగ్యానికి సంబంధించిన సమస్యలు కనిపిస్తే అపహాస్యం, పరువు వంటి భయాలను పక్కనపెట్టి నిపుణులను సంప్రదించాలని సూచించారు. సకాలంలో సరైన సహాయం తీసుకోవడం ద్వారా మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవచ్చని డాక్టర్ శీతల్ తెలిపారు.
———————————

Please tell us what is wrong. Your report will be sent to the website team.

