MLC Addanki Dayakar Rao, NRI Commission Telangana
* శాసన మండలిలో అద్దంకి దయాకర్ రావు
* NRIల ఆస్తుల పరిరక్షణకు ప్రత్యేక వ్యవస్థ
ఆకేరు న్యూస్, హైదరాబాద్: తెలంగాణ ప్రవాస భారతీయుల (NRI) సంక్షేమం, వారి ఆస్తుల పరిరక్షణ మరియు రాష్ట్రంలో వారి పెట్టుబడులను ప్రోత్సహించేందుకు వెంటనే ఒక ప్రత్యేక “ఎన్ఆర్ఐ కమిషన్” (NRI Commission) ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ రావు శాసనమండలిని డిమాండ్ చేశారు. సభలో స్పెషల్ మెన్షన్ ద్వారా ప్రవాస తెలుగువారు ఎదుర్కొంటున్న కీలక సమస్యలను ఛైర్మన్ దృష్టికి తీసుకువచ్చారు. ఇటీవల తాను అమెరికాలోని హార్వర్డ్ విశ్వవిద్యాలయ పర్యటనకు వెళ్లిన సమయంలో దాదాపు 7 నుంచి 8 సమావేశాల్లో పాల్గొని, అక్కడి ప్రవాసాంధ్రులు, తెలంగాణవాసుల ఆవేదనను ప్రత్యక్షంగా తెలుసుకున్నట్లు తెలిపారు.
* సింగిల్ విండో విధానం
రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న సింగిల్ విండో విధానాన్ని మరింత సులభతరం చేసి, NRIలు సులువుగా పెట్టుబడులు పెట్టే వాతావరణం కల్పించాలని కోరారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘భారత్ ఫ్యూచర్ సిటీ’ మిషన్‌లో ఎన్ఆర్ఐల భాగస్వామ్యం కీలకమైనదని పేర్కొన్నారు.
* ప్రత్యేక ఎన్ఆర్ఐ కమిషన్ ..
ముఖ్యమంత్రి ప్యాట్రన్‌గా, ఒక ఎన్ఆర్ఐ ఛైర్మన్‌గా మరియు వివిధ ఖండాల/దేశాల ప్రతినిధులతో 10 మంది డైరెక్టర్లతో కూడిన వ్యవస్థను ఏర్పాటు చేయాలని సూచించారు. దుబాయ్, ఖతార్ (గల్ఫ్) నుంచి ఆస్ట్రేలియా, అమెరికా వరకు ఉన్న తెలుగువారి సమస్యలను ఈ కమిషన్ ద్వారా పరిష్కరించవచ్చని అభిప్రాయపడ్డారు.
* ప్రవాసుల ఆస్తులకు రక్షణ..
స్వదేశంలో ఆస్తులు, స్థలాలు కొనుగోలు చేసిన ఎన్ఆర్ఐలకు ల్యాండ్ గ్రాబర్స్ (కబ్జాదారులు) నుండి రక్షణ కరువైందని, ప్రభుత్వం ఒక థర్డ్ పార్టీగా జోక్యం చేసుకుని వారి ఆస్తుల పరిరక్షణకు గ్యారంటీ ఇవ్వాలని డిమాండ్ చేశారు.
* హైదరాబాద్ నుంచి నేరుగా అంతర్జాతీయ విమానాలు..
ఆంధ్రప్రదేశ్ నుంచి నేరుగా విదేశాలకు సర్వీసులు ఉన్నట్లే, హైదరాబాద్ నుంచి అమెరికా, ఆస్ట్రేలియాలోని ప్రధాన నగరాలకు డైరెక్ట్ ఫ్లైట్స్ ఏర్పాటు చేయాలన్నారు.
* కేంద్ర ప్రభుత్వంపై విమర్శ..
సీఎం అమెరికా పర్యటనను కేంద్ర ప్రభుత్వం నిరోధించడం అప్రజాస్వామికమని మండిపడ్డారు. ఆ పర్యటన జరిగి ఉంటే హార్వర్డ్ విశ్వవిద్యాలయం క్లోన్ సెంటర్, ఎమ్ఐటీ (MIT)కి చెందిన 20 మంది వెంచర్ క్యాపిటలిస్టులు తెలంగాణ విద్యావ్యవస్థలో పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వచ్చేవారని వివరించారు.
* గుజరాత్ మోడల్ పెట్టుబడులు..
విదేశాల్లో దాదాపు 15 నుండి 20 లక్షల మంది మనవాళ్లు ఉన్నారని, అందులో 10-15 శాతం మంది పెట్టుబడులు పెట్టడానికి సిద్ధంగా ఉన్నారని తెలిపారు. గుజరాత్లో ప్రవాసులను ప్రోత్సహించిన తరహాలోనే తెలంగాణ ఎన్ఆర్ఐల సామర్థ్యాన్ని రాష్ట్ర పునర్నిర్మాణానికి ఉపయోగించుకోవాలని విజ్ఞప్తి చేశారు.
విదేశాల్లో దురదృష్టవశాత్తు ప్రాణాలు కోల్పోయిన తెలుగువారి భౌతికకాయాలను స్వదేశానికి రప్పించడంలో ఎక్స్టర్నల్ అఫైర్స్ విధానాల వల్ల ఇబ్బందులు ఎదురవుతున్నాయని, రాష్ట్ర ప్రభుత్వం దీనిపై ప్రత్యేక శ్రద్ధ వహించి మోరల్ సపోర్ట్ అందించాలని కోరారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
