Praja Palana Day 2026
* అదనపు కలెక్టర్ సీహెచ్ మహేందర్ జి.
ఆకేరు న్యూస్, ములుగు: సెప్టెంబర్ 17న నిర్వహించే ప్రజాపాలన దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించాలని అదనపు కలెక్టర్ సీహెచ్ మహేందర్ జి అధికారులను ఆదేశించారు.
బుధవారం నూతన కలెక్టరేట్ సమావేశ మందిరంలో ప్రజాపాలన దినోత్సవ వేడుకల ఏర్పాట్లపై వివిధ శాఖల జిల్లా అధికారులతో రెవెన్యూ అదనపు కలెక్టర్ సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నూతన కలెక్టరేట్ ప్రాంగణంలో మొదటిసారిగా నిర్వహించనున్న ప్రజాపాలన దినోత్సవ వేడుకలకు అవసరమైన అన్ని ఏర్పాట్లను పకడ్బందీగా చేపట్టాలని అధికారులను ఆదేశించారు.
వేదిక పై ప్రొటోకాల్ ప్రకారం సీటింగ్ ఏర్పాట్లు సక్రమంగా ఉండేలా చూడాలని సూచించారు. జాతీయ పతాకావిష్కరణ సమయంలో అనుసరించాల్సిన మార్గదర్శకాలను తూచా తప్పకుండా పాటించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
వేడుకలకు హాజరయ్యే ప్రజలు, అధికారులు, ప్రభుత్వ సిబ్బందికి అవసరమైన తాగునీటి సౌకర్యంతోపాటు ఇతర మౌలిక వసతులను కల్పించాలని తెలిపారు.
ప్రజాపాలన దినోత్సవ వేడుకలకు ప్రజలు అధిక సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. వివిధ శాఖల అధికారులు తమ కార్యాలయ సిబ్బందితో కలిసి తప్పనిసరిగా హాజరు కావాలని సూచించారు.
ఈ సమావేశంలో ఆర్డీఓ కృష్ణవేణి, వివిధ శాఖల జిల్లా అధికారులు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
