Private Hospitals Exploitation Telangana
* ప్రైవేట్ ఆస్పత్రుల దోపిడీపై కలెక్టర్లతో కఠిన చర్యలు తీసుకోవాలి
* తెలంగాణ శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : రాష్ట్రంలోని ప్రైవేట్ ఆస్పత్రులు పేద ప్రజల ఆరోగ్యాన్ని ఆసరాగా చేసుకుని విపరీతమైన దోపిడీకి పాల్పడుతున్నాయని, ఈ ధోరణిపై ఎంటైర్ మెడికల్ అండ్ హెల్త్ టీమ్‌తోపాటు జిల్లా కలెక్టర్లతో కఠిన చర్యలు తీసుకోవాలని తెలంగాణ శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఆరోగ్య శాఖ మంత్రికి సూచించారు. శాసన మండలిలో ఎమ్మెల్సీ విజయశాంతి ప్రైవేట్ ఆస్పత్రుల దోపిడీపై లేవనెత్తిన ‘స్పెషల్ మెన్షన్’ అంశంపై చైర్మన్ స్పందిస్తూ సభలో పలు కీలక వ్యాఖ్యలు చేశారు.
* అక్కర్లేని టెస్టులు.. మృతదేహాల ఆధారంగా వ్యాపారం..
సభలోని సభ్యులందరికీ ప్రైవేట్ ఆస్పత్రుల వైఖరి పట్ల స్పష్టత ఉందని చైర్మన్ పేర్కొన్నారు. అవసరం లేకపోయినా టెస్టులు చేయడం, అనవసరమైన చికిత్సలు అందించడం మాత్రమే కాకుండా, రోగి మరణించిన తర్వాత కూడా వెంటిలేటర్లపై ఉంచి కుటుంబసభ్యుల నుంచి డబ్బులు గుంజే దారుణ పరిస్థితులు నెలకొన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవల నల్గొండలోని ఓ ‘ఐకాన్ ఆస్పత్రి’పై హెల్త్ డిపార్ట్మెంట్ దాడి చేసిన ఉదంతాన్ని ఈ సందర్భంగా ప్రస్తావించారు. కేవలం ఏడాది రెండేళ్ల వ్యవధిలోనే ఆ ఆస్పత్రిలో 191 మరణాలు సంభవించాయని, ప్రైవేట్ ఆస్పత్రుల నిర్వాహణ ఎంత దారుణంగా ఉందో దీనిబట్టి అర్థం చేసుకోవచ్చని అన్నారు.
* ఆర్ఎంపీలు.. అంబులెన్స్ డ్రైవర్లతో కుమ్మక్కు..
ప్రైవేట్ ఆస్పత్రులు కమిషన్ల కోసం RMP డాక్టర్లు, అంబులెన్స్ డ్రైవర్లతో కుమ్మక్కవుతున్నాయని గుత్తా సుఖేందర్ రెడ్డి తెలిపారు. ఏదైనా ప్రమాదం జరిగిన వెంటనే బాధితుల కుటుంబసభ్యులు ఆందోళనలో ఉంటారని, ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లాలని వారు కోరినా.. ఎవరైతే ఎక్కువ కమీషన్ ఇస్తారో నేరుగా ఆ ప్రైవేట్ ఆస్పత్రులకే బాధితులను తరలిస్తున్నారని ఆరోపించారు. ప్రైవేట్ ఆస్పత్రులు ఇదే అవకాశంగా భావించి బాధితుల నుంచి చివరకు నగలు, పుస్తెలు కూడా కుదవబెట్టించి డబ్బులు గుంజే పరిస్థితి దాపురించిందన్నారు.
* ప్రభుత్వ ఆస్పత్రులను బలోపేతం చేయాలి..
ప్రస్తుతం ప్రైవేట్ ఆస్పత్రులలో తమ వద్ద ఉన్న డబ్బులన్నీ ఖర్చయిపోయి, చేతులెత్తేసిన తర్వాతనే పేద ప్రజలు నిజామ్స్ (NIMS) వంటి ప్రభుత్వ ఆస్పత్రులను ఆశ్రయిస్తున్నారని చైర్మన్ అన్నారు. ఆరోగ్య శాఖ మంత్రి వచ్చిన తర్వాత ఆస్పత్రులు బాగా పనిచేస్తున్నాయని, జిల్లాల్లో మెడికల్ కాలేజీలు, 500 పడకల ఆస్పత్రులు అందుబాటులోకి వచ్చాయని కొనియాడారు. ప్రభుత్వ ఆస్పత్రుల సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకునేలా ఎడ్యుకేట్ చేయాలని, వైద్య రంగంలో ప్రైవేట్ ఆస్పత్రుల దోపిడీ నుంచి పేదలను కాపాడేందుకు ప్రభుత్వం కఠిన నిర్ణయాలు తీసుకోవాలని ఈ సందర్భంగా మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి కోరారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
