Hanamkonda Fire Accident
*అగ్నిప్రమాదంలో కేదారి ఫుడ్ కోర్ట్ యజమాని మృతి
*భార్య పరిస్థితి విషమం
ఆకేరు న్యూస్, హన్మకొండ: హనుమకొండ నగరంలోని అదాలత్ సెంటర్ వద్ద తీవ్ర అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో ప్రముఖ హోటల్ యజమాని లింగాల కేదారి అగ్నికీలలకు చిక్కుకుని అక్కడికక్కడే మృతి చెందారు. ప్రమాదం సమయంలో ఆయనతో పాటు ఉన్న భార్య తీవ్రంగా గాయపడ్డారు. ఆమె శరీరానికి 80 శాతానికి పైగా తీవ్ర కాలిన గాయాలవ్వడంతో, సమాచారం అందుకున్న 108 సిబ్బంది ఆమెను హుటాహుటిన వరంగల్లోని ఎంజీఎం (MGM) ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.
* ఆహార వ్యర్థాలకు వ్యతిరేకిగా, ఉద్యమకారులకు ఆపద్బాంధవుడిగా..
తెలంగాణ మలిదశ ఉద్యమ సమయంలో ‘కేదారి ఫుడ్ కోర్ట్’ యజమాని లింగాల కేదారి వేలాది మంది తెలంగాణ వాదులు, విద్యార్థులకు అతి తక్కువ ధరకే నాణ్యమైన భోజనం అందించి సమాజంలో ఎంతో మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నారు. “అన్నాన్ని వృధా చేయకూడదు” అనే నియమంతో, భోజనం ప్లేట్లో వృధా చేసిన వారికి జరిమానా విధించే వినూత్న పద్ధతిని ప్రవేశపెట్టి ఆయన దేశవ్యాప్తంగా గుర్తింపు పొందారు.
* ప్రమాదానికి గల కారణాలు..
సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు మరియు అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ప్రమాదానికి గల ఖచ్చితమైన కారణాలు (షార్ట్ సర్క్యూటా లేక గ్యాస్ లీకేజా అన్నది) ఇంకా తెలియాల్సి ఉంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని ప్రమాద స్థలాన్ని పరిశీలించి దర్యాప్తు ప్రారంభించారు. కేదారి అకస్మాత్తుగా మృతి చెందడంతో హనుమకొండ, వరంగల్ ప్రాంతాల్లో విషాదఛాయలు అలముకున్నాయి.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
