CM Revanth Reddy KCR Family
* ఎర్రవల్లి ‘శుద్ధి’ ఘటనపై అసెంబ్లీలో సీఎం తీవ్ర ఆగ్రహం
* దళితులు నడిచిన చోట పసుపు నీళ్లు చల్లడమేంటని ప్రశ్న
* ఖర్గే సభాస్థలి ‘శుద్ధి’ ఘటనతో పోలిక
* దేశంపై ఉగ్రవాదుల దాడికి.. స్పీకర్‌పై కులవాదుల దాడికి తేడా లేదని వ్యాఖ్య
* ఫామ్‌హౌస్ కేంద్రంగా కుట్ర జరిగిందన్న సీఎం
* సీనియర్ ఐపీఎస్ అధికారితో సమగ్ర విచారణకు ఆదేశం
* బీఎన్ఎస్, ఎస్సీ–ఎస్టీ అట్రాసిటీ చట్టాల కింద చర్యలు తీసుకుంటామని హెచ్చరిక
ఆకేరు న్యూస్, హైదరాబాద్: బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కేసీఆర్ కుటుంబాన్ని సమాజం నుంచి సామాజికంగా బహిష్కరించాల్సిన అవసరం ఉందంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఎర్రవల్లిలోని కేసీఆర్ ఫామ్‌హౌస్ సమీపంలో దళితులు నిరసన తెలిపిన ప్రాంతాన్ని బీఆర్ఎస్ నేతలు పసుపు నీళ్లతో ‘శుద్ధి’ చేసినట్లు వచ్చిన ఆరోపణలపై బుధవారం తెలంగాణ శాసనసభలో జరిగిన చర్చ సందర్భంగా సీఎం తీవ్రంగా స్పందించారు.
* దళితులు నడిస్తే అపవిత్రమవుతుందా?
కేసీఆర్ ఫామ్‌హౌస్ సమీపంలో కాంగ్రెస్ ఎస్సీ, ఎస్టీ విభాగాల ఆధ్వర్యంలో పెద్ద సంఖ్యలో దళిత కార్యకర్తలు ‘డప్పుల మోత’తో నిరసన చేపట్టారు. అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌పై బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యాఖ్యలకు నిరసనగా ఈ కార్యక్రమం జరిగింది. అనంతరం ఆ ప్రాంతంలో బీఆర్ఎస్ నాయకులు పసుపు నీళ్లు చల్లి ‘శుద్ధి’ కార్యక్రమం నిర్వహించారని అధికారపక్షం ఆరోపించింది. ఈ అంశాన్ని అసెంబ్లీలో మంత్రులు అడ్లూరి లక్ష్మణ్, పొన్నం ప్రభాకర్, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క తీవ్రంగా ఖండించారు. దళితులు నడిచిన ప్రాంతాన్ని శుద్ధి చేయడమంటే వారి ఆత్మగౌరవాన్ని అవమానించడమేనని భట్టి మండిపడ్డారు.
* ఖర్గే ఘటనను గుర్తుచేసిన రేవంత్
ఈ సందర్భంగా కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే పాల్గొన్న ఉత్తరాఖండ్‌లోని హల్ద్వానీ రామ్‌లీలా మైదానం ఘటనను సీఎం రేవంత్ రెడ్డి ప్రస్తావించారు. ఖర్గే సభ నిర్వహించిన ప్రాంతంలో అనంతరం ‘శుద్ధి’ కార్యక్రమం నిర్వహించారన్న ఆరోపణలను గుర్తుచేస్తూ, అక్కడ జరిగిన దానికి.. ఇప్పుడు ఎర్రవల్లిలో జరిగిన దానికి తేడా ఏముందని ప్రశ్నించారు.బీజేపీ అనుసరించిన అదే ధోరణిని తెలంగాణలో బీఆర్ఎస్ అనుసరిస్తోందని అధికారపక్షం ఆరోపించింది. మంత్రి సీతక్క కూడా బీజేపీ, బీఆర్ఎస్ల ఆలోచనా ధోరణి ఒకటేనంటూ సభలో విమర్శించారు.
దళితుల నిరసనలో భాగమైన ‘డప్పు’ అంశాన్ని రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా ప్రస్తావించారు. “డప్పు మాదిగల జీవన విధానంలో భాగం” అని పేర్కొంటూ, వెయ్యి మందికిపైగా దళితులు డప్పులతో నిరసన తెలిపిన తర్వాత ఆ ప్రాంతాన్ని శుద్ధి చేయాల్సిన అవసరం ఏమొచ్చిందని ప్రశ్నించారు. ఈ చర్యను కేవలం రాజకీయ నిరసనకు ప్రతిస్పందనగా చూడలేమని, దళితుల ఆత్మగౌరవానికి సంబంధించిన అంశంగా ప్రభుత్వం పరిగణిస్తున్నట్లు స్పష్టం చేశారు.
* కేసీఆర్ కుటుంబాన్ని సామాజికంగా బహిష్కరించాలి
ఈ క్రమంలోనే సీఎం తన విమర్శల తీవ్రతను మరింత పెంచారు. కేసీఆర్ కుటుంబ రాజకీయ ధోరణిని సమాజం తిరస్కరించాలని, వారిని సామాజికంగా బహిష్కరించాల్సిన పరిస్థితి వచ్చిందనే అర్థంలో తీవ్ర వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ వ్యవహారశైలిని కేవలం రాజకీయ ప్రత్యర్థిపై విమర్శగా కాకుండా సామాజిక విలువలకు సంబంధించిన అంశంగా రేవంత్ మలిచారు.సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్‌ను ఉద్దేశించి కూడా సీఎం మాట్లాడారు. స్పీకర్‌పై జరిగిన వ్యాఖ్యలను ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తోందని చెప్పారు. “దేశంపై ఉగ్రవాదులు దాడి చేయడానికి, గౌరవనీయమైన స్పీకర్‌పై కులవాదులు దాడి చేయడానికి తేడా లేదు” అంటూ తీవ్ర వ్యాఖ్య చేశారు.
* ఫామ్‌హౌస్‌లోనే కుట్ర..
ఎర్రవల్లి ఫామ్‌హౌస్ కేంద్రంగా జరిగిన పరిణామాల వెనుక కుట్ర ఉందనే అనుమానాన్ని సీఎం వ్యక్తం చేశారు. ఈ మొత్తం వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు ప్రకటించారు. సీనియర్ ఐపీఎస్ అధికారితో విచారణ చేయిస్తామని తెలిపారు.విచారణలో వెల్లడయ్యే అంశాల ఆధారంగా భారతీయ న్యాయ సంహిత (BNS)తో పాటు ఎస్సీ, ఎస్టీ (అత్యాచారాల నిరోధక) చట్టంలోని సంబంధిత సెక్షన్ల కింద చర్యలు తీసుకుంటామని సీఎం హెచ్చరించారు.
———————————————-

Please tell us what is wrong. Your report will be sent to the website team.
