September 17 Telangana History
* కాంగ్రెస్, బీజేపీలవి అబద్ధపు ప్రచారాలు
ఆకేరు న్యూస్, హైదరాబాద్: తెలంగాణ రక్షణ సేన కార్యాలయంలో తెలంగాణ విలీన దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆ పార్టీ అధినేత్రి, కల్వకుంట్ల కవిత జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె తెలంగాణ సాయుధ పోరాట యోధుల త్యాగాలను స్మరించుకుంటూ తీవ్రస్థవలో విమర్శలు గుప్పించారు. సెప్టెంబర్ 17 చరిత్రను కాంగ్రెస్, బీజేపీ పార్టీలు తమ రాజకీయ లబ్ధి కోసం వక్రీకరిస్తున్నాయని ఆమె మండిపడ్డారు. నాటి పోరాటంలో ఆ రెండు పార్టీల పాత్ర లేదని, కేవలం తెలంగాణ ప్రజల స్వయంపోరాటమే విముక్తి తెచ్చిందని స్పష్టం చేశారు.
*చరిత్రను వక్రీకరిస్తున్నారు..
తెలంగాణ పౌరుషానికి, పోరాట పటిమకు, త్యాగాల చరిత్రకు సెప్టెంబర్ 17 ప్రతీక అని కవిత పేర్కొన్నారు. కానీ, నేడు దీనిపై రకరకాల రాజకీయాలు చేస్తూ అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి తమ స్టేట్ కాంగ్రెస్ పోరాటం వల్లే విముక్తి లభించిందని ముఖ్యమంత్రి చెబుతున్నారని, అది పూర్తిగా అబద్ధమని కొట్టిపారేశారు. అలాగే, ఇది కేవలం ముస్లిం రాజుపై హిందువులు చేసిన పోరాటమని బీజేపీ మతపరమైన రంగు పులిరే ప్రయత్నం చేస్తోందని, ఆ ప్రచారంలోనూ ఎలాంటి నిజం లేదని తేల్చిచెప్పారు.
*ప్రజలే తమను తాము కాపాడుకున్నారు..
అప్పట్లో ఎలాంటి సౌకర్యాలు లేకపోయినా, ప్రజలే తమకు జరుగుతున్న అన్యాయాలపై సైకిళ్లపై తిరుగుతూ సంఘటిత పోరాటాలు చేశారని కవిత గుర్తుచేశారు. వట్టికోట ఆళ్వారుస్వామి, సురవరం ప్రతాపరెడ్డి, రావి నారాయణరెడ్డి, కాళోజీ, దాశరథి, షోయబుల్లాఖాన్, మగ్దూం మొయినోద్దీన్ లాంటి మహనీయులు, మేధావులు ఆంధ్ర మహాసభల ద్వారా ప్రజలను చైతన్యపరిచారని కొనియాడారు. నాటి జాగీర్దార్లు, జమీందార్ల దౌర్జన్యాలకు వ్యతిరేకంగా హిందూ, ముస్లిం తేడా లేకుండా ప్రజలందరూ ఏకమై తుపాకీ పట్టారని తెలిపారు. దొడ్డి కొమురయ్య, చాకలి ఐలమ్మ, షేక్ బందగీ వంటి యోధుల స్ఫూర్తితో మల్లు స్వరాజ్యం, అరుట్ల కమలదేవి వంటి వారు ఉద్యమాన్ని ముందుకు నడిపారన్నారు.
* కాంగ్రెస్, బీజేపీల పాత్ర శూన్యం..
మహాత్మా గాంధీ స్వయంగా సంస్థానాల్లో పోరాటం చేయడం తమ విధానం కాదన్నారని కవిత గుర్తుచేశారు. నిజాం సర్కార్ కాలంలో పేదలకు పంచిన 10 లక్షల ఎకరాల భూమిని, భారత యూనియన్లో విలీనమైన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం మళ్లీ లాక్కుని జమీందార్లకు పంచిందని తీవ్ర ఆరోపణలు గుప్పించారు. ఇక నాటి పోరాట సమయంలో అసలు బీజేపీ, ఆర్ఎస్ఎస్ల ఆనవాళ్లే లేవని స్పష్టం చేశారు.
* అరాచక శక్తుల గద్దె దించేందుకే ‘టీఆర్ఎస్’
నాటి పోరాట స్ఫూర్తితోనే ప్రస్తుత అరాచక శక్తులను గద్దె దించేందుకు ‘తెలంగాణ రక్షణ సేన ‘టీఆర్ఎస్)’ పుట్టుకొచ్చిందని కవిత ప్రకటించారు. ఈ పోరాటంలో కులం, మతం, పేద, ధనిక అనే తేడాలు లేవని, ప్రజల హక్కులను పరిరక్షించడమే లక్ష్యంగా అందరూ ఏకమై ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
