Kothagudem
* రహదారి నిర్మాణం కోసం తొలగింపు
Kothagudem: ఆకేరు న్యూస్, మహబూబాబాద్: కొత్తగూడ మండలం చింతగట్టు తండాలో బొడ్రాయి కూల్చివేతపై ఉద్రిక్తత నెలకొంది. తండా ప్రజలు సంప్రదాయబద్ధంగా గ్రామ దేవతగా పూజించే బొడ్రాయిని రహదారి నిర్మాణ పనుల్లో భాగంగా తొలగించడంపై గిరిజనులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
తండా అభివృద్ధి కోసం ప్రభుత్వం చేపడుతున్న రహదారి నిర్మాణాన్ని తాము స్వాగతిస్తున్నామని గ్రామస్తులు తెలిపారు. అయితే రహదారి మార్గంలో అడ్డుగా ఉందనే కారణంతో బొడ్రాయిని ముందస్తు సమాచారం లేకుండా తొలగించడం తమ మనోభావాలను దెబ్బతీసిందని ఆవేదన వ్యక్తం చేశారు.
పునఃప్రతిష్ఠ చేయాలని డిమాండ్
బొడ్రాయి కూల్చివేత విషయం తెలుసుకున్న తండావాసులు, మహిళలు పెద్ద సంఖ్యలో సంఘటనా స్థలానికి చేరుకుని నిరసన వ్యక్తం చేశారు. గిరిజనుల ఆచారాలు, సంప్రదాయాలను గౌరవించాలని డిమాండ్ చేశారు. తొలగించిన ప్రదేశంలోనే బొడ్రాయిని శాస్త్రోక్తంగా పునఃప్రతిష్ఠించాలని గ్రామస్తులు పట్టుబట్టారు. ఈ ఘటనకు బాధ్యులైన కాంట్రాక్టర్, సంబంధిత సిబ్బందిపై అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు.
గ్రామ పెద్దలు, గిరిజన సంఘాల నాయకులు మాట్లాడుతూ.. తండా సాంస్కృతిక, ఆధ్యాత్మిక సంప్రదాయాలను దెబ్బతీసే చర్యలను సహించబోమని అన్నారు. సంబంధిత అధికారులు, ఇంజనీరింగ్ శాఖ అధికారులు వెంటనే తండాను సందర్శించి సమస్యను పరిష్కరించాలని కోరారు. బొడ్రాయిని పునఃనిర్మించి ప్రతిష్ఠించకపోతే ఆందోళనను ఉధృతం చేస్తామని హెచ్చరించారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
