Boinpally Vinod Kumar
* బోయినపల్లి వినోద్ కుమార్ డిమాండ్
Boianapally Vinod Kumar| ఆకేరు న్యూస్, నెట్వర్క్: వరంగల్ మామునూరు విమానాశ్రయానికి కాకతీయ సామ్రాజ్య వీరనారి రాణి రుద్రమదేవి పేరు పెట్టాలని మాజీ ఎంపీ, బీఆర్ఎస్ నేత బోయినపల్లి వినోద్ కుమార్ డిమాండ్ చేశారు. ఈ మేరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఆయన ఐదు పేజీల బహిరంగ లేఖ రాశారు. మామునూరు విమానాశ్రయం పునరుద్ధరణ కోసం గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఎలాంటి ప్రయత్నం చేయలేదన్న సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను వినోద్ కుమార్ ఖండించారు. అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్‌తో పాటు బీఆర్ఎస్ ప్రభుత్వం విమానాశ్రయం కోసం నిరంతరం ప్రయత్నాలు చేసిందని ఆయన పేర్కొన్నారు.
* ప్రధాని, కేంద్ర మంత్రులను కలిశాం
మామునూరు విమానాశ్రయం అభివృద్ధి కోసం తాము పలుమార్లు కేంద్ర ప్రభుత్వాన్ని సంప్రదించామని వినోద్ కుమార్ తెలిపారు. ప్రధానమంత్రి, కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రులు, సంబంధిత అధికారులను కలిసి విమానాశ్రయం అవసరాన్ని వివరించినట్లు చెప్పారు. గతంలో కేంద్ర మంత్రులను కలిసిన సందర్భాలకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు, అప్పటి వార్తా కథనాలు, న్యూస్ క్లిప్పింగ్స్‌ను కూడా సీఎం రేవంత్ రెడ్డికి పంపుతున్నట్లు ఆయన తెలిపారు.
* బీఆర్ఎస్ ఏమీ చేయలేదనడం అబద్ధం
మామునూరు విమానాశ్రయం విషయంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఏమీ చేయలేదని చెప్పడం పచ్చి అబద్ధం అని వినోద్ కుమార్ విమర్శించారు. గత ప్రభుత్వ హయాంలో జరిగిన ప్రయత్నాలను విస్మరించి మొత్తం ఘనతను ప్రస్తుత ప్రభుత్వం తీసుకోవడం సరికాదని పేర్కొన్నారు. అయితే, మామునూరు విమానాశ్రయం కోసం ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి చేస్తున్న ప్రయత్నాలను తాము కాదనడం లేదని ఆయన స్పష్టం చేశారు. గతంలో జరిగిన ప్రయత్నాలు, ప్రస్తుత ప్రభుత్వ చర్యలు, కేంద్ర ప్రభుత్వ అనుమతులు కలిసి విమానాశ్రయ ప్రాజెక్టు ముందుకు సాగుతోందని తెలిపారు. ఇదిలా ఉండగా, మామునూరు విమానాశ్రయం కోసం అవసరమైన భూసేకరణ పూర్తయి, భూమిని ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాకు అప్పగించినట్లు తెలంగాణ ప్రభుత్వం తెలిపింది. విమానాశ్రయం అభివృద్ధికి రూ.295 కోట్లు కేటాయించినట్లు సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. అలాగే విమానాశ్రయానికి తగిన పేరును సూచించాలని ప్రజలను కోరారు.
* రుద్రమదేవి పేరు పెట్టాలని డిమాండ్
వరంగల్‌కు కాకతీయ చరిత్రతో ఉన్న అనుబంధాన్ని దృష్టిలో పెట్టుకుని మామునూరు విమానాశ్రయానికి రాణి రుద్రమదేవి విమానాశ్రయం గా నామకరణం చేయాలని వినోద్ కుమార్ కోరారు. కాకతీయుల చారిత్రక వారసత్వానికి, తెలంగాణ చరిత్రకు ప్రతీకగా రాణి రుద్రమదేవి పేరు నిలుస్తుందని ఆయన పేర్కొన్నారు

Please tell us what is wrong. Your report will be sent to the website team.
