Kajal Aggarwal
* కాజల్ అగర్వాల్ వ్యాఖ్యలు
ఆకేరు న్యూస్, సినిమా డెస్క్ : ‘‘నేటి వేగవంతమైన డిజిటల్ ప్రపంచంలో స్మార్ట్‌ఫోన్ మన జీవితంలో విడదీయరాని భాగంగా మారింది. ఉదయం నిద్రలేవగానే ఫోన్ చూడటం నుంచి రాత్రి పడుకునే వరకు సోషల్ మీడియా, సందేశాలు, వీడియోలు, పనికి సంబంధించిన కాల్స్‌తోనే ఎక్కువ సమయం గడుస్తోంది. అయితే ఈ అలవాటు వ్యక్తిగత సంబంధాలపై, ముఖ్యంగా భార్యాభర్తల మధ్య ఉన్న అనుబంధంపై ప్రతికూల ప్రభావం చూపుతోందని’’ హీరోయిన్ కాజల్ అగర్వాల్ అభిప్రాయపడ్డారు. చిన్నచిన్న విషయాలకే సంబంధాలు తెగిపోతున్న ఈ కాలంలో, ఒకరికి ఒకరు సమయం కేటాయించడం ఎంత అవసరమో ఆమె వివరించారు.
* సహనం తగ్గిపోవడం..
నేటి జంటల్లో విడాకులు పెరగడానికి అనేక కారణాలు ఉన్నప్పటికీ వాటిలో సహనం తగ్గిపోవడం, పరస్పర సంభాషణ లేకపోవడం, స్మార్ట్ఫోన్లకు అతిగా అలవాటు పడటం ప్రధానమైనవని చెప్పారు. ఒకే ఇంట్లో, ఒకే గదిలో ఉన్నా మనస్పూర్తిగా మాట్లాడుకునే పరిస్థితి చాలా చోట్ల కనిపించడం లేదని కాజల్ పేర్కొన్నారు. డిన్నర్‌కు కలిసి వెళ్లినా, ఎదుటివారితో మాట్లాడటానికి బదులు చేతిలో ఫోన్ పట్టుకుని సోషల్ మీడియా స్క్రోల్ చేస్తూ గడపడం సాధారణంగా మారిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు.
* మాట వినడం ఎంతో ముఖ్యం..
సంబంధం బలంగా ఉండాలంటే ఖరీదైన బహుమతులు, పెద్ద పెద్ద ప్రయాణాలు మాత్రమే అవసరం కాదని కాజల్ అన్నారు. రోజులో కొంతసేపైనా ఒకరికొకరు పూర్తిగా సమయం ఇవ్వడం, తమ భావాలను పంచుకోవడం, ఎదుటివారి మాటను శ్రద్ధగా వినడం ఎంతో ముఖ్యమని సూచించారు. చిన్న అపార్థాలు కూడా మాట్లాడుకోకపోవడం వల్ల పెద్ద సమస్యలుగా మారుతాయని, చివరకు అదే దూరాన్ని పెంచుతుందని ఆమె అభిప్రాయపడ్డారు.
* తప్పనిసరి బయటికి..
తన వ్యక్తిగత జీవితాన్ని ఉదాహరణగా చెబుతూ, భర్త గౌతమ్ కిచ్లూతో వారానికి ఒక రోజు తప్పనిసరిగా బయట డిన్నర్‌కు వెళ్తామని కాజల్ వెల్లడించారు. ఆ సమయంలో ఇద్దరూ ఫోన్లను పూర్తిగా పక్కనపెట్టి, కేవలం ఒకరితో ఒకరు మాట్లాడుకుంటూ సమయం గడుపుతామని చెప్పారు. పనులు, కుటుంబం, రోజువారీ ఒత్తిడుల మధ్య దంపతులకు ఇలాంటి ప్రత్యేక సమయం అవసరమని ఆమె భావిస్తున్నారు. ఫోన్ నోటిఫికేషన్ల కంటే ఎదురుగా కూర్చున్న వ్యక్తి భావాలకు ప్రాధాన్యం ఇవ్వాలని ఆమె సందేశమిచ్చారు.
Please tell us what is wrong. Your report will be sent to the website team.
