ఇట్లు అర్జున’ ట్రైలర్
* రొమాన్స్, యాక్షన్‌తో ట్రైలర్
* నవంబర్ 13న విడుదల
ఆకేరు న్యూస్, సినిమా: కొత్త హీరో అనీష్ కథానాయకుడిగా, అనస్వర రాజన్ హీరోయిన్గా నటిస్తున్న చిత్రం ‘ఇట్లు అర్జున’. కింగ్ నాగార్జున సమర్పణలో, మహేష్ ఉప్పల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై ఇప్పటికే ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. తాజాగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్‌ను విడుదల చేసి చిత్రబృందానికి శుభాకాంక్షలు తెలిపారు. రొమాన్స్, యాక్షన్, కామెడీ, సస్పెన్స్ అంశాలతో రూపొందించిన ట్రైలర్ సినిమాపై అంచనాలను మరింత పెంచుతోంది.
ఈ సందర్భంగా ఎన్టీఆర్ సోషల్ మీడియా వేదికగా స్పందించారు. తొలి సినిమాతోనే ఒక్క మాట కూడా మాట్లాడకుండా అందరి దృష్టిని ఆకర్షించడం అనీష్ ధైర్యానికి నిదర్శనమని ప్రశంసించారు. మొదటి చిత్రానికే ఇలాంటి విభిన్నమైన పాత్రను ఎంచుకోవడం కథపై ఆయనకున్న నమ్మకాన్ని తెలియజేస్తోందన్నారు. అనీష్‌కు మంచి ఆరంభం లభించాలని ఆకాంక్షించారు. సంగీత దర్శకుడు థమన్, హీరోయిన్ అనస్వర రాజన్, దర్శకుడు మహేష్ ఉప్పల, సినిమాటోగ్రాఫర్ రాజా మహదేవన్, నిర్మాత వెంకీ కుడుములతో పాటు చిత్రబృందానికి అభినందనలు తెలిపారు.
రూ.1,000 కోట్ల డీల్.. ఆసక్తికరమైన కథాంశం
పోలీసుల వేటతో ప్రారంభమయ్యే ట్రైలర్ ఆద్యంతం ఉత్కంఠను రేకెత్తిస్తోంది. ఓ దొంగ కోసం పోలీసులు గాలిస్తున్న సమయంలో అర్జున్ అనే మూగ యువకుడు కథలోకి ప్రవేశిస్తాడు. మాట్లాడలేకపోయినా అసాధారణమైన తెలివితేటలు కలిగిన వ్యక్తిగా అతడి పాత్రను పరిచయం చేశారు. మరోవైపు కీర్తితో అర్జున్ ప్రేమకథ కూడా ఆకట్టుకుంటోంది.
అయితే ఓ మిస్టీరియస్ పెన్‌డ్రైవ్, రూ.1,000 కోట్ల డీల్ కారణంగా ఈ జంట ప్రమాదంలో చిక్కుకుంటుంది. పోలీసులు, గూండాల ముఠా వారి వెంట పడటంతో కథ ఉత్కంఠభరితంగా మారుతుంది. అర్జున్ ఎవరు? అతడి గతం ఏమిటి? పెన్‌డ్రైవ్‌లో ఉన్న రహస్యం ఏంటి? అనే ప్రశ్నలను ట్రైలర్ ఆసక్తికరంగా మలిచింది.
మూగ యువకుడిగా అనీష్ ఆకట్టుకునే నటన
ఈ సినిమాలో మూగ యువకుడి పాత్రలో అనీష్ నటన ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. మాటలు లేకుండా ముఖ కవళికలు, బాడీ లాంగ్వేజ్‌తో భావోద్వేగాలను పలికించాల్సిన పాత్రలో ఆయన మంచి ఇంపాక్ట్ చూపించారు. స్టైలిష్ లుక్‌తో పాటు యాక్షన్, ఛేజింగ్ సన్నివేశాల్లోనూ ఆకట్టుకున్నారు. హీరోయిన్ అనస్వర రాజన్ తన సహజమైన నటన, అభినయంతో కీర్తి పాత్రకు ప్రత్యేక ఆకర్షణ తీసుకొచ్చారు.
థమన్ సంగీతం.. ఆకట్టుకునే విజువల్స్
దర్శకుడు మహేష్ ఉప్పల ప్రేమ, యాక్షన్, కామెడీ, సస్పెన్స్ అంశాలను సమపాళ్లలో మేళవించినట్లు ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది. రాజా మహదేవన్ సినిమాటోగ్రఫీ ప్రేమ సన్నివేశాలతో పాటు థ్రిల్లింగ్ సన్నివేశాలను ఆకట్టుకునేలా చూపించింది. ఎస్. థమన్ అందించిన సంగీతం కథలోని భావోద్వేగాలకు, ఉత్కంఠకు బలాన్ని చేకూరుస్తోంది. వాట్ నెక్స్ట్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై వెంకీ కుడుముల ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
మొత్తంగా ‘ఇట్లు అర్జున’ ట్రైలర్ విభిన్నమైన కథాంశం, రొమాన్స్, యాక్షన్, సస్పెన్స్‌తో ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచుతోంది. నవంబర్ 13న ఈ సినిమా థియేటర్లలో విడుదల కానుంది.

Please tell us what is wrong. Your report will be sent to the website team.

