Hyderabad POCSO Case
* హైదరాబాద్ ఉప్పల్ లో దారుణం
* గర్భం దాల్చిన బాలిక
* తల్లి సహా ముగ్గురిపై పోక్సో కేసు నమోదు
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : తెలంగాణ రాజధాని హైదరాబాద్లో దారుణం చోటుచేసుకుంది. కంటికి రెప్పలా కాపాడాల్సిన తల్లే అన్యాయంగా ప్రవర్తించింది. కన్నకూతురిపై ఓ వ్యక్తి లైంగికదాడికి సహకరించి సభ్యసమాజం ఉలిక్కిపడేలా చేసింది. తల్లి సమక్షంలోనే ఓ నిందితుడు మైనర్ బాలికపై పలుమార్లు లైంగిక దాడికి పాల్పడటమే కాకుండా, ఆమె గర్భం దాల్చడం కలకలం రేపుతోంది. ఈ ఘటన ఉప్పల్ పోలీస్ స్టేషన్ పరిధిలో వెలుగుచూసింది.
పోలీసుల కథనం ప్రకారం.. పోలీసులకు బాధితురాలు అందించిన వివరాల ప్రకారం.. బాధిత బాలిక (17) తన కుటుంబంతో కలసి ఉప్పల్ ప్రాంతంలో నివాసముంటోంది. బాలిక తల్లికి ఓ వ్యక్తితో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయంతో తరచూ ఇంటికి వస్తూ పోతూ ఉండే వాడు. అతడి కన్ను ఆమె కుమార్తెపై పడింది.
సుమారు ఎనిమిది నెలల క్రితం తొలిసారిగా అతడు బాలికపై లైంగిక దాడికి ఒడిగట్టాడు. ఈ దారుణం జరుగుతున్న సమయంలో అడ్డుకోవాల్సిన కన్నతల్లి, నిందితుడికి సహకరించినట్లుగా బాలిక ఆరోపిస్తోంది. అంతటితో ఆగకుండా, బాలిక నోరు విప్పితే తీవ్ర పరిణామాలు ఉంటాయని, చంపేస్తామని బెదిరిస్తూ కొన్ని నెలలుగా సదరు నిందితుడు పలుమార్లు ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఘోరానికి బాలిక తల్లితో పాటు మరో బంధువు కూడా పూర్తిగా సహకరించినట్లు ఆరోపణలు ఉన్నాయి.
* గర్భం దాల్చడంతో వెలుగులోకి..
పలు మార్లు లైంగిక దాడికి పాల్పడడంతో బాలిక గర్భం దాల్చడంతో ఈ దారుణం వెలుగులోకి వచ్చింది. శారీరక మార్పులు గమనించిన కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తీసుకెళ్లగా, వైద్యులు పరీక్షించి బాలిక గర్భవతి అని నిర్ధారించారు. దీంతో ఇక భరించలేకపోయిన బాధిత బాలిక, ధైర్యం చేసి నేరుగా ఉప్పల్ పోలీసులను ఆశ్రయించి తనకు జరిగిన ఘోరాన్ని తెలిపింది.
బాలిక అక్క ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. లైంగిక దాడికి పాల్పడిన నిందితుడిపై, అత్యాచారానికి సహకరించి, ప్రోత్సహించిన కన్నతల్లిపై, ఈ ఉదంతంలో భాగస్వామిగా ఉన్న మరో బంధువుపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు.
* తల్లే సహకరించడంపై..
ఈ ఘటనపై ఉప్పల్ పోలీసులు సమగ్ర దర్యాప్తు ప్రారంభించారు. బాధిత బాలికను మెజిస్ట్రేట్ ముందు ప్రవేశపెట్టి ఆమె వాంగ్మూలాన్ని రికార్డు చేశారు. అలాగే బాధితురాలికి వైద్య పరీక్షలు నిర్వహించిన ప్రైవేట్ ఆసుపత్రి నుంచి మెడికల్ రిపోర్టులు, సాక్ష్యాధారాలను సేకరిస్తున్నారు. నిందితులను కఠినంగా శిక్షించేలా చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు. కన్నతల్లే ఇలాంటి దారుణానికి ఒడిగట్టడంపై సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.
Please tell us what is wrong. Your report will be sent to the website team.
