IMD Rain Alert
* ఉత్తరాంధ్రకు భారీ వర్షాల ముప్పు
ఆకేరు న్యూస్, అమరావతి : బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం ఉత్తరాంధ్ర తీరాన్ని దాటింది. శ్రీకాకుళం జిల్లా కళింగపట్నం సమీపంలో బుధవారం అర్ధరాత్రి సమయంలో తీరం దాటిన ఈ వాయుగుండం ప్రభావం ప్రస్తుతం ఉత్తరాంధ్రపై కొనసాగుతోంది. తీరం దాటే ప్రక్రియ దాదాపు మూడు గంటల పాటు కొనసాగినట్లు వాతావరణ శాఖ వెల్లడించింది.
వాయుగుండం ప్రభావంతో శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం మన్యం జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. కొన్ని ప్రాంతాల్లో అత్యంత భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉందని ఐఎండీ హెచ్చరించింది.
అదే సమయంలో గంటకు 55 నుంచి 75 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీచే అవకాశం ఉంది. దీంతో విద్యుత్ సరఫరా, రహదారి రవాణాకు అంతరాయం ఏర్పడే అవకాశముంది. తీర ప్రాంతాల్లో సముద్రం అల్లకల్లోలంగా ఉండే అవకాశం ఉండటంతో మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లకుండా అధికారులు సూచిస్తున్నారు.
తీరం దాటిన తర్వాత కూడా వాయుగుండం ప్రభావం వెంటనే తగ్గిపోనుంది. ఈరోజు సాయంత్రం వరకు తీవ్ర వాయుగుండం స్థాయిలోనే కొనసాగి, ఆ తర్వాత క్రమంగా బలహీనపడే అవకాశం ఉందని ఐఎండీ అంచనా వేసింది. దీంతో ఉత్తరాంధ్రలో ఈరోజు కూడా భారీ వర్షాలు, ఈదురుగాలులు కొనసాగే అవకాశం ఉంది.
ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దని, వర్షం-గాలుల సమయంలో చెట్లు, విద్యుత్ స్తంభాలు, బలహీనమైన నిర్మాణాలకు దూరంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. పరిస్థితిని ఎప్పటికప్పుడు అధికారులు పర్యవేక్షిస్తున్నారు.
Please tell us what is wrong. Your report will be sent to the website team.
