Jana Sena Candidate Divya
* జనసేన అభ్యర్థి దివ్యకు 352 ఓట్ల మెజారిటీ
* గెలిచిన ఆనందం పంచుకోలేకపోయిన దివ్య..
* తల్లి లేని ఇద్దరు చిన్నారులు..
ఆకేరు న్యూస్, డెస్క్ : ఎన్నికల్లో గెలవాలనే ఆశతో ప్రజల్లోకి వెళ్లి ప్రచారం చేసిన ఓ మహిళా అభ్యర్థికి అనూహ్యంగా విజయం దక్కింది. అయితే ఆ గెలుపు సంబరాలను చూసేందుకు ఆమె జీవించి లేకపోవడం అందరినీ కలచివేస్తోంది. ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రారంభం కాకముందే గుండెపోటుతో మరణించిన జనసేన అభ్యర్థి గారపాటి దివ్య.. ఫలితాల్లో విజయం సాధించడం స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లి మండలంలోని ధుమంతునిగూడెం గ్రామానికి చెందిన 28 ఏళ్ల గారపాటి దివ్య జనసేన పార్టీ తరఫున ఎంపీటీసీ స్థానానికి బరిలో నిలిచారు. ఎన్నికల సమయంలో ప్రజలను కలిసి తనకు మద్దతు ఇవ్వాలని కోరారు. అయితే ఫలితాలు వెలువడకముందే ఆమె గుండెపోటుకు గురై ప్రాణాలు కోల్పోయారు. దీంతో కుటుంబ సభ్యులు, పార్టీ నాయకులు, గ్రామస్థులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు.
* మరణానంతరం ఎంపీటీసీగా గెలిచిన దివ్య
ఇదిలా ఉండగా, తాజాగా వెల్లడైన ఎన్నికల ఫలితాలు మరోసారి గ్రామంలో భావోద్వేగ పరిస్థితులను సృష్టించాయి. ఎంపీటీసీ స్థానానికి జరిగిన పోటీలో గారపాటి దివ్య తన ప్రత్యర్థి వైసీపీ అభ్యర్థిపై 352 ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించారు. ఎన్నికల్లో గెలిచినట్లు అధికారికంగా తెలిసినప్పటికీ ఆ విజయాన్ని ఆస్వాదించేందుకు ఆమె లేకపోవడం అందరినీ బాధిస్తోంది.
* ఇద్దరు చిన్నారులకు తీరని లోటు
దివ్యకు ప్రేమ వివాహం జరిగింది. ఆమెకు ఐదేళ్ల వయసున్న కుమారుడితో పాటు మూడు నెలల చిన్నారి కూడా ఉన్నారు. తల్లి మరణంతో ఆ ఇద్దరు చిన్నారులు మాతృప్రేమకు దూరమయ్యారు. చిన్న వయసులోనే దివ్య మరణించడం కుటుంబాన్ని తీవ్ర విషాదంలోకి నెట్టింది.
ఒకవైపు ఎన్నికల్లో సాధించిన విజయం.. మరోవైపు ఆ విజయాన్ని పంచుకోవడానికి అభ్యర్థి లేకపోవడం ధుమంతునిగూడెం గ్రామంలో విషాదాన్ని నింపింది. సాధారణంగా ఎన్నికల్లో గెలుపు అంటే సంబరాలు చేసుకునే సందర్భం. కానీ దివ్య విషయంలో మాత్రం గెలుపు వార్త కన్నీళ్లను తెప్పిస్తోంది. ప్రజల మద్దతుతో విజయం సాధించిన ఆమె.. ఆ విజయాన్ని కళ్లారా చూడలేకపోవడం స్థానికులను కలచివేస్తోంది.

Please tell us what is wrong. Your report will be sent to the website team.

