KCR Land Probe
* జీవో 134 జారీ చేసిన ప్రభుత్వం..
* రంగంలోకి కమిటీ
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : తెలంగాణ రాజకీయ వర్గాలలో సరికొత్త ప్రకంపనలు రేపే పరిణామం చోటుచేసుకుంది. రాష్ట్రంలో గత ప్రభుత్వ హయాంలో చోటుచేసుకున్న భూ ఆక్రమణలు, నిబంధనల ఉల్లంఘనలు, అక్రమ మార్పిడి వ్యవహారాలపై లోతైన దర్యాప్తు జరిపేందుకు రాష్ట్ర ప్రభుత్వం కఠిన నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు అధికారికంగా జీవో 134 (G.O.Ms.No. 134) ను విడుదల చేస్తూ ఒక ప్రత్యేక ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది.
*ముగ్గురు ఐఏఎస్‌లతో కమిటీ కూర్పు..
ఈ ప్రతిష్టాత్మక విచారణ కమిటీకి చైర్‌పర్సన్‌గా సీనియర్ ఐఏఎస్ అధికారి ఏ. శ్రీదేవసేనను ప్రభుత్వం నియమించింది. అలాగే, కన్వీనర్‌గా ఐఏఎస్ అధికారి రాజీవ్ గాంధీ హనుమంతు, సభ్యుడిగా సందీప్ కుమార్ ఝా బాధ్యతలు నిర్వర్తించనున్నారు. వీరు కాకుండా, ఏయే జిల్లాల్లో విచారణ జరుగుతుందో ఆయా జిల్లాల కలెక్టర్లు కూడా ఈ కమిటీలో ప్రత్యేక సభ్యులుగా వ్యవహరించనున్నారు.
*ఎవరెవరి ఆస్తులపై దర్యాప్తు జరగనుంది అంటే..
గత అసెంబ్లీ సమావేశాల్లో చర్చకు వచ్చిన సెక్షన్ 22ఏ భూముల వివాదాల నేపథ్యంలో ఈ విచారణను వేగవంతం చేశారు. ప్రధానంగా.. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబ సభ్యులు, సన్నిహితుల భూ లావాదేవీలు.
బీఆర్ఎస్ పార్టీకి చెందిన ముఖ్య మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావు, గంగుల కమలాకర్, జగదీశ్ రెడ్డిలతో పాటు మరికొందరు మాజీ ప్రజాప్రతినిధుల కుటుంబ సభ్యుల పేరిట ఉన్న భూములు. రంగారెడ్డి, సిద్దిపేట, మేడ్చల్, హైదరాబాద్ సహా వివిధ జిల్లాల్లో జరిగిన వివాదాస్పద భూ బదలాయింపులపై కమిటీ ప్రధానంగా దృష్టి సారిస్తుంది.
*ఏయే అంశాలపై ఆరా తీయనున్నారు..
ప్రభుత్వ, అసైన్డ్, భూదాన్, ఇనామ్, అటవీ భూములు మరియు వాటర్ బాడీస్ పరిధిలోని భూములు అన్యాక్రాంతమైన తీరుపై ఈ కమిటీ సమగ్రంగా విచారించనుంది. అలాగే, గతంలో ధరణి పోర్టల్ మాడ్యూల్స్‌ను అడ్డుపెట్టుకుని నిబంధనలకు విరుద్ధంగా భూముల మార్పిడి జరిగిందా అనే కోణంలోనూ ఆధారాలు సేకరించనున్నారు.
ఈ విచారణ పూర్తికాగానే అక్రమాలకు పాల్పడిన వారి బాధ్యతను ఖరారు చేస్తూ ప్రభుత్వానికి కమిటీ తుది నివేదికను సమర్పించనుంది. అవసరమైన సందర్భాల్లో మధ్యంతర నివేదికలు ఇచ్చే వెసులుబాటు కూడా ఈ కమిటీకి కల్పించారు. మొత్తంగా ఈ ప్రత్యేక కమిటీ దర్యాప్తు రాష్ట్ర రాజకీయాల్లో ఏవిధమైన మలుపులు తిప్పుతుందనేది ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
